అగ్నిపథ్‌ను రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-06-28T06:38:50+05:30 IST

నిరుద్యోగ యువతకు నష్టం వాటిల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనను చేపట్టాయి.

అగ్నిపథ్‌ను రద్దు చేయాల్సిందే
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

కాంగ్రెస్‌ డిమాండ్‌

విశాఖపట్నం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు నష్టం వాటిల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనను చేపట్టాయి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ల పిలుపు మేరకు విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గ నేతల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి వజ్జపర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయేలా రూపొందించిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్మీలో ఖాళీగా ఉన్న 1.50 లక్షల ఉద్యోగాలను తక్షణమే పూర్వ విధానంలో భర్తీ చేయాలన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్‌రెడ్డి అగ్నిపథ్‌ విధానంపై నోరు మెదపాలన్నారు. సైన్యాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సునందా దేవి, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాసరావు, బీసీ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ మూల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:38:50+05:30 IST