‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:37:43+05:30 IST

దేశ భద్రతకు, దేశ సేవ చేయాలకునే సైనికుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఆర్మీలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు.

‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలి
మంథని దీక్షలో మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు

మంథని, జూన్‌ 27 : దేశ భద్రతకు, దేశ సేవ చేయాలకునే సైనికుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఆర్మీలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మంథనిలో సోమవారం జరిగిన సత్యగ్రహ దీక్షలో శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు.  అగ్నిపథ్‌లో నాలుగేళ్లు పనిచేసిన సైనికులు తిరిగి మళ్లీ ఉద్యోగం, ఉపాధి కోసం వెతుకులాడుకునే విధంగా ఈ పథకం ఉండటం విచారకరమన్నారు. అగ్నిపథ్‌ పథకం దేశ భద్రతను, ప్రపంచంలో బలమైన శక్తిగా ఉన్న దేశ ఆర్మీని బలహీన పర్చే ప్రమాదం ఉందన్నారు. ఆర్మీలో ప్రవేశ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులంతా బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌తో తమకు ఉద్యోగాలు రావనే భయంతో హైదరా బాద్‌లో ఆందోళన చేపడితే  పోలీసులతో కాల్పులు జరిపించి దేశ సేవ చేయాలనే యువతను చంపించడం, గాయపర్చడం బాధకరన్నారు. హైద రాబాద్‌కు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలు హైదరాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన సురేష్‌ చావుకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సరిహద్దుల్లో చైనా సైనికులు దేశ భూభాగంలోకి చొచ్చుకొని వస్తున్న తీరును నివారించడంలో కేంద్రం లోని బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాహుల్‌గాంధీని, ప్రతిపక్షాల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల విచారణ పేరిట ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దేశ వ్యాప్తం గా ఆందోళనలు చేస్తేనే కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను బీజేపీ విరమించుకుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్‌ ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు శశిభూషణ్‌కాచే, పెండ్రు రమాదేవీ-సురేష్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్‌,  అజీం, ఐత ప్రకాష్‌రెడ్డి, తోట్ల తిరుపతియాదవ్‌, చొప్పరి సదానందం, ఇనుముల సతీష్‌, గోటికార్‌ కిషన్‌జీ, చంద్రు రాజమల్లు, ఆర్గ నాగరాజు, మూల సరోజన పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T06:37:43+05:30 IST