అగ్నిపథ్‌ ఆగదు

ABN , First Publish Date - 2022-06-20T09:04:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సైనిక నియామక పథకం ‘అగ్ని పథ్‌’పై దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు కొనసాగున్నప్పటికీ..

అగ్నిపథ్‌ ఆగదు

ఇక త్రివిధ దళాల్లో నియామకాలన్నీ ఈ పథకం కిందే


రెగ్యులర్‌ నియామకాలు ఉండవ్‌

వెనక్కి తగ్గే ప్రశ్నేలేదు

నిరసనల్లో పాల్గొన్న వారికి సైన్యంలో చోటు కల్పించం

రిజర్వేషన్ల ప్రకటన వెనుక నిరసనల ప్రభావం లేదు

ఈ నెల 24 నుంచే ప్రక్రియ

జూలై 24న ఆన్‌లైన్‌ పరీక్ష

డిసెంబరు నుంచే తొలి బ్యాచ్‌

రక్షణ శాఖ స్పష్టీకరణ


న్యూఢిల్లీ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సైనిక నియామక పథకం ‘అగ్ని పథ్‌’పై దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు కొనసాగున్నప్పటికీ.. ఈ పథకం అమలుపై వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ స్పష్టం చేసింది. ఇక నుంచి త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ పాతపద్ధతిలో ఉండదని, ‘అగ్నిపథ్‌’ కిందే సైనిక నియామకాలు ఉంటాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరి ఆదివారం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్నవారికి నియామకాల్లో చోటు ఉండదని స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ పథకంలో చేరాలనుకునేవారు తాము ఎలాంటి నిరసనల్లో పాల్గొనలేదని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, పోలీస్‌ వెరిఫికేషన్‌ కూడా ఉంటుందని తెలిపారు. ఇక, అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరేవారికి ఎలాంటి అలవెన్సులు, ఇతరత్రా భత్యాలు ఉండవనే ప్రచారం సరికాదని పూరి పేర్కొన్నారు. అగ్నివీరులకు ఇతర సైనికుల మాదిరిగానే జీత భత్యాలు లభిస్తాయని తెలిపారు. సర్వీసులో ఉండగా అమరులైతే.. రూ.కోటి పరిహారంగా సైనికుడి కుటుంబానికి అందిస్తామన్నారు.


ఇకపై భారత రక్షణ రంగంలో జరిగే అన్ని నియామకాలు ‘అగ్నిపథ్‌’ పథకం కిందే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘‘అగ్నివీరుల విషయంలో ఎలాంటి వివక్షా ఉండదు. విధుల్లోవారు తమ జీవితాలను త్యాగం చేస్తే రూ.కోటి పరిహారం అందిస్తాం. ఇతర భత్యాలు కూడా అందుతాయి’’ అని పూరి వెల్లడించారు. నిరసన కారులకు భారత సైన్యంలో నియామకాలు ఉండబోవని తెగేసి చెప్పారు. సైన్యం అంటేనే క్రమశిక్షణకు మారుపేరని.. దేశ రక్షణ, భద్రతే వీరికి ప్రధానమని, నిరసనకారులను ఎట్టిపరిస్థితిలో చేర్చుకోబోమని అన్నారు. ‘‘అగ్నిపథ్‌ పథకాన్ని ఈ నెల 14న ప్రకటించారు. కానీ, వాస్తవానికి ఈ సంస్కరణ చాలా కాలంగా పెండింగులో ఉంది. దీనిపై పలు దేశాల్లో అమలవుతున్న సైనిక విధానాలను కూడా అధ్యయనం చేశాం. సుదీర్ఘంగా చర్చించాం. ఈ సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లేందుకు యువత మాకు ముఖ్యం. ప్రస్తుతం ఈ రోజు సైన్యంలో ఉన్నవారి వయసు దాదాపు 30 ఏళ్లకు చేరుకుంది. కానీ, భవిష్యత్‌ యుద్ధ రీతులు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా సాంకేతికపరంగా సైన్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. దీనికి యువత అవసరం ఎంతో ఉంది’’ అని పూరి వివరించారు. అగ్నిపథ్‌లో చేరేవారు నాలుగేళ్ల తర్వాత ఏం చేయాలనే ప్రశ్నకు పూరి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న త్రివిధ దళాల నుంచి ఏటా 17,600 మంది ముందస్తుగానే రిటైర్‌ అవుతున్నారు. వీరిలో ఎవరూ కూడా రిటైర్‌ అయిన తర్వాత మేం ఏం చేయాలి? అని ప్రశ్నించడం లేదు. రాబోయే నాలుగైదేళ్లలో అగ్నివీరుల సంఖ్య 50 వేల నుంచి 60 వేలకు పెరుగుతుంది. తర్వాత 90 వేల నుంచి లక్షకు చేరుకుంటుంది. అయితే.. ప్రస్తుతం 46 వేల మందితోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. సైన్యంలో పనిచేసి బయటకు వచ్చిన వారికి నైపుణ్యాలతోపాటు క్రమశిక్షణ అలవడుతుంది’’ అని వివరించారు. అగ్నిపథ్‌ విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందని, యువత తమ ఆందోళనలను విరమించుకోవాలని పూరి సూచించారు. 


రిజర్వేషన్‌ ప్లాన్‌ ఇప్పటిది కాదు!

అగ్నివీర్‌లకు సంబంధించి కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు.. పలు రిజర్వేషన్‌లు ప్రకటించిన విషయంపై పూరి స్పందిస్తూ.. ఇవన్నీ ముందస్తుగానే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలని తెలిపారు. అంతేతప్ప.. యువత చేస్తున్న నిరసనలు చూసి మాత్రం కాదని ప్రకటించారు. కేంద్ర హోం శాఖ పరిధిలోని సీఏపీఎ్‌ఫలో రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పోలీసు శాఖల్లో అగ్నివీర్‌లకు రిజర్వేషన్‌ కల్పించాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నియామకాలకు సంబంధించిన ఒక బుక్‌ లెట్‌ను విడుదల చేశారు. 


24 నుంచే నియామక ప్రక్రియ

ఈ నెల 24 నుంచే అగ్నివీర్‌ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌కే ఝా తెలిపారు. ఈ నెల 24న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూలై 24న ఆన్‌లైన్‌లో తొలిదశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. డిసెంబరు తొలివారానికి అగ్నివీర్‌  తొలి బ్యాచ్‌ సిద్ధమవుతుందని, వీరికి అదే నెల 30 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని వివరించారు. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదని ఆయన స్పష్టం చేశారు. తొలి బ్యాచ్‌లో 25 వేల మందికి అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. రెండో బ్యాచ్‌ ఫిబ్రవరి 2023 నాటికి ప్రారంభిస్తామన్నారు. నౌకాదళంలో అగ్నివీరుల శిక్షణ ఐఎన్‌ఎస్‌ చిల్కా(ఒడిసా)లో నవంబరు 21 నుంచే ప్రారంభమవుతుందని లెఫ్టినెంట్‌ జనరల్‌ బాన్సీ పొనప్ప తెలిపారు. ఈ విభాగంలో యువతీ, యువకులకు అవకాశం ఉంటుందన్నారు. దీనికి ముందు త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వరుసగా రెండో రోజు తన నివాసంలో అత్యవసర భేటీ నిర్వహించారు. అగ్నిపథ్‌ ఆందోళనలపై ఆయన చర్చించారు. అదేసమయంలో అగ్నివీరుల నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టే అంశాలపైనా రాజ్‌నాథ్‌ పలు కీలక సూచనలు చేశారు. 


‘అగ్నిపథ్‌’లో మహిళలూ! 

అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో మహిళలూ కనిపించనున్నారు. ఆ మేరకు  అగ్నిపథ్‌ను లింగ సమానత్వం దిశగా నడిపించేందుకు త్రివిధ దళాల్లోని నావికాదళం సిద్ధమైంది. అగ్నిపథ్‌ కింద ఈ ఏడాది నౌకాదళంలో 3వేల మందిని నావికులుగా తీసుకుంటారు. వీరిలో 20శాతం, అంటే 600 మందిని మహిళలను రిక్రూట్‌ చేస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత మహిళా నావికులను సముద్ర జలాల్లోని యుద్ధనౌకల్లో నియమిస్తారు.


అగ్నివీరుల ఆదాయం ఇదీ

అగ్నిపథ్‌ పథకం కింద నియమితులయ్యే అగ్ని వీరులకు మొదటి ఏడాది నెలకు రూ.30వేలు(చేతికి రూ.21వేలు) అందుతాయని తెలిపారు. ఇది నాలుగో ఏడాది నాటికి నెలకు రూ.40 వేలకు(చేతికి రూ.28 వేలు) వస్తుందని వివరించారు. మొత్తం వారికి రూ.16.70 లక్షలు వస్తాయని, అదేవిధంగా సేవానిధి ప్యాకేజి కింద వడ్డీతో కలిపి రూ.11.71 లక్షలు ఆఖరులో చెల్లిస్తామని తెలిపారు. 


బీజేపీ ఆఫీసు ముందు సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీరులు

బీజేపీ నేత విజయ్‌వర్గీయ సంచలన వ్యాఖ్యలు

ఇండోర్‌, హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): అగ్నిపథ్‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌ వర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. అగ్నివీరులుగా పనిచేసిన వారిని తమ పార్టీ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామని కైలాష్‌ అన్నారు. దీనిపై భారీ దుమారం రేగింది. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ‘అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరిన యువతకు క్రమశిక్షణ, విధేయత వంటి లక్షణాలు అలవడతాయి. నాలుగేళ్ల తర్వాత వారికి రూ.11 లక్షలు అందిస్తారు. బీజేపీ కార్యాలయానికి భద్రత నిపుణుల సేవలను తీసుకోవాలని భావిస్తే అగ్ని వీరులకే ప్రాధాన్యం ఇస్తాను’ అన్నారు. కైలాష్‌ సైనికులను అవమానించేలా మాట్లాడారని కాంగ్రెస్‌ మండిపడింది. కైలాష్‌ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ తప్పుబట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అసహనం వ్యక్తం చేశారు. 


సైనికులకు ఇచ్చే గౌరవం ఇదేనా: ఒవైసీ

సైనికులకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. మోదీ సర్కారు యువకుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు.

Updated Date - 2022-06-20T09:04:47+05:30 IST