జిల్లాలో అగ్నిమాపక శాఖ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-09-27T05:28:14+05:30 IST

ఎంతో ప్రాధాన్యమున్న అగ్నిమాపక శాఖను జిల్లాలో నిర్వీర్యం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణాల్లో అనుమతులకు జిల్లా, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎలాంటి ప్రమేయం లేకుండా పాతేశారన్న విమర్శలున్నాయి.

జిల్లాలో అగ్నిమాపక శాఖ నిర్వీర్యం
జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయం

బాధ్యతలన్నీ రాష్ట్ర శాఖకు బదలాయింపు 

అనుమతుల మంజూరులో స్థానిక సిబ్బంది పాత్ర శూన్యం

డీజీ నుంచే అన్ని అనుమతులు

సామాన్యులకు కష్టంగా మారిన అనుమతుల ప్రక్రియ

అనంతపురం న్యూటౌన, సెప్టెంబరు 26: ఎంతో ప్రాధాన్యమున్న అగ్నిమాపక శాఖను జిల్లాలో నిర్వీర్యం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణాల్లో అనుమతులకు జిల్లా, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎలాంటి ప్రమేయం లేకుండా పాతేశారన్న విమర్శలున్నాయి. అగ్నిమాపక శాఖ అనుమతి కావాలంటే నేరుగా ఆ శాఖ డీజీ నుంచి అనుమతులు పొందేలా గెజిట్‌ను జారీ చేశారు. సాధారణంగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అనుమతులు తీసుకోవాలని హెచ్చరించి, అపరాధ రుసుం విధిస్తేనే ప్రణాళిక ప్రకారం అనుమతులు తీసు కోవడం కష్టతరంగా ఉండేది. అలాంటిది అవసరం వచ్చిన వారు స్వయంగా దరఖాస్తు పట్టుకొని రాజధానికి వెళ్లి డీజీ వద్ద అనుమతి పొందడం అంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

విధులు నిర్వీర్యం

 అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయుపోయిందన్న చర్చ జరుగుతోంది. జిల్లా శాఖ పరిధిలో ఏమి లేకుండా చేసి ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని అదుపు చేయడం తప్ప మరో బాధ్యత లేకుండా చేశారు. దీంతో సిబ్బంది సైతం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్పందించామా?  ఏమి లేవంటే కార్యాలయానికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోయామా అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. 

రాష్ట్ర శాఖకు బాధ్యతల బదలాయింపు

గతంలో ఫైౖర్‌ అనుమతులు పొందాలంటే కొన్ని కేటగిరీల వరకు జిల్లా అగ్నిమాపక శాఖాధికారే మంజూరు చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌తో అసలు జిల్లా అధికారికి ఎలాంటి బాధ్యతలు లేకుండా పోయాయి. చిన్న అనుమతి పొందాలన్న ఫైల్‌ తీసుకుని రాజధానికి పోవాల్సిందే. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు అనుమతుల మంజూరుకు తాత్కాలికంగా పరికరాలు అమర్చి, ఫైల్‌ తయారు చేయడం కోసం ఫొటోలు తీసుకొని అనుమతి రాగానే తీసేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆఖరికి దరఖాస్తుదారులు సెల్ఫ్‌ డిక్లరేషన ఇచ్చినా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఈ అనుమతులు సాధారణ ప్రజలు తెచ్చుకోవడం మహాకష్టం. రాజకీయ పలుకుబడి అయిన ఉండాలి, లేదంటే డీజీ కార్యాలయంలో అనుమతులు మంజూరు చేసేవారు అడిగిన సొమ్మునైన ముట్టజెప్పాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డీజీ నుంచే అనుమతులు

 జిల్లా అధికారుల స్థాయిలో మంజూరు చేసే అనుమతు లు సైతం డీజీకి కట్టబెట్టడంతో అనుమతులు పొందడం కష్టంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి ఏడాది అనుమతి పొందేవారు సైతం ఫైర్‌ అనుమతులను గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం గండి పడటంతోపాటు ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 

Updated Date - 2022-09-27T05:28:14+05:30 IST