అగాధంలో ఆర్థిక రథం!

ABN , First Publish Date - 2020-09-05T06:20:46+05:30 IST

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దుస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగాన్ని ఇతోధికంగా పెంపొందించడమే కీలకం.

అగాధంలో ఆర్థిక రథం!

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దుస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగాన్ని ఇతోధికంగా పెంపొందించడమే కీలకం. డబ్బును సమకూర్చుకుని ఖర్చు చేస్తున్నంత వరకు ఏ రంగంలో ఎంత వినియోగిస్తున్నామన్నది ముఖ్యం కానే కాదు. ఖర్చు చేయడమే ప్రధానం. పేదలకు నగదు బదిలీ, ఆహార ధాన్యాల పంపిణీతో పాటు అధికారాలను వికేంద్రీకరించి, రాష్ట్రాలకు ఆర్థిక సాధికారిత కల్పించడమనే సాహసోపేత చర్యలకు ప్రభుత్వం విధిగా పూనుకోవాలి.


మనఆర్థికం కుశలమేనా? సత్యాలు దాచేస్తే దాగవు. 2019–-20 ఆర్థిక సంవత్సరంలోనూ, ఆ తరువాత కూడా దేశ ఆర్థికవ్యవస్థ స్థితిగతుల గురించి ప్రభుత్వ కథనాలలో సత్యం పాలు తక్కువ అని కేంద్ర గణాంక సంస్థ నివేదికలతో బహిర్గతమయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇదొక సత్య విస్ఫోటనం. నా మాటలు కఠినంగా ఉన్నాయా? మరి వాస్తవాలు మరెంతో కఠినతరంగా ఉన్నాయి సుమా! ఆర్థికవ్యవస్థ ఆరోగ్యంపై ప్రభుత్వ అలక్ష్య వైఖరి, ప్రజలు చవిచూస్తున్న అపరిమిత బాధలు నన్నీ కర్కశ విమర్శకు పురిగొల్పాయి. మహారాజశ్రీ ప్రభుత్వానికి ఆగ్రహం కల్గించడం నా ఉద్దేశం కాదు. ముంచుకొస్తున్న ఆర్థిక ముప్పు గురించి అధికారంలో ఉన్న వారిని, ఆ పాలకులను సమర్థిస్తున్న వారినీ అప్రమత్తం చేయడమే నా సంకల్పం. 


మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలు ఎలా ఉన్నాయో చూడండి. కేంద్ర గణాంక సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్ – -జూన్ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో మన జీడీపీ 23.9 శాతం క్షీణించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 2019 జూన్ 30 నాటి స్థూల దేశీయోత్పత్తిలో నాలుగో భాగం గత పన్నెండు నెలల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఉత్పత్తిని నష్టపోవడమంటే ఆ ఉత్పత్తిని సృష్టించిన ఉద్యోగాలను కూడా నష్టపోవడమే. ఆ ఉద్యోగాలు సమకూర్చిన ఆదాయమూ మాయమైపోయింది. మరి ఆ రాబడిపై ఆధారపడిన కుటుంబాలు విషమ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక సుప్రసిద్ధ ఆర్థిక పరిశోధనా సంస్థ అంచనా ప్రకారం ఆర్థిక మాంద్యం ప్రారంభమయిన నాటికి, కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నాటికి మధ్య మన ఆర్థిక వ్యవస్థ 121 మిలియన్ ఉద్యోగాలను నష్టపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 12 కోట్ల మందికి పైగా భారతీయులు నిరుద్యోగులయ్యారు. 


అభివృద్ధి సాధించిన ఏకైక రంగం వ్యవసాయం మాత్రమే. 3.4 శాతం వృద్ధిరేటుతో అది పురోగమన బాటలో ఉంది. అలాగే అటవీ, మత్స్య ఉత్పత్తుల రంగాలు కూడా మంచి వృద్ధి బాటలో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి క్షీణముఖం పట్టడం ‘దైవకృత్యం’గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు! నిజానికి ఆమె రైతులకు, వారికి తమ ఆశీస్సులు అందజేసిన దేవుళ్ళకు కృతజ్ఞతలు చెప్పి తీరాలి. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి ఇతర రంగమూ తీవ్రంగా కుదేలైపోయింది. తయారీరంగం పురోగతి 39.3 శాతం క్షీణించింది; నిర్మాణ రంగం 50.3 శాతం క్షీణించింది; వ్యాపారం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో 47 శాతం క్షీణత నమోదయింది. 


భారత ఆర్థిక వ్యవస్థను సన్నిహితంగా పరిశీలిస్తున్నవారెవ్వరికీ కేంద్ర గణాంక సంస్థ అంచనాలు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మనం ఇప్పుడు ఒక మహా ఆర్థిక విషాదంలో ఉన్నాం. ఈ విపత్కర పరిస్థితి గురించి అనేక మంది ఆర్థికవేత్తలు చాలా ముందుగానే హెచ్చరించారు. కొద్దిరోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో కూడా సరిగ్గా ఇటువంటి నిష్ఠుర సత్యాలనే వెల్లడించింది. చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా దేశ ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయాయని ఆ నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ నివేదికలోని మరి కొన్ని ఇతర ముఖ్యాంశాలు: జి-20 కూటమి దేశాలు ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన పథకాల విలువ జీడీపీలో సగటున 12.1 శాతం మేరకు ఉండగా భారత్ ఉద్దీపన జీడీపీలో 1.7 శాతం మాత్రమే; వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. వినియోగం స్థాయి కరోనా విపత్తు పూర్వపు స్థితికి మళ్ళీ చేరేందుకు సుదీర్ఘకాలం పడుతుంది; రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించిన ఒక సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితిగతులు, ఉద్యోగిత, ద్రవ్యోల్బణం, ఆదాయాల విషయమై అనేక మంది తీవ్ర నిరాశా నిస్పృహలు వ్యక్తం చేశారు. 


కరోనా సంక్షోభం సమస్త దేశాల ఆర్థిక వ్యవస్థలనూ ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఇది నిజమే అయినప్పటికీ మన దేశ పరిస్థితి మిగతా దేశాల పరిస్థితికి భిన్నమైనది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మందగమనం, దేశంలో మొదటి కొవిడ్-–19 కేసు నమోదు కావడానికి చాలా కాలం ముందే ప్రారంభమయింది. పెద్ద నోట్ల రద్దుతో ఈ పతనం ప్రారంభమయింది. 2018-–19, 2019-–20 ఆర్థిక సంవత్సరాలలో వరుసగా ఎనిమిది త్రైమాసికాల పాటు, ప్రతి త్రైమాసికంలోనూ వృద్ధిరేటు తగ్గుతూ వచ్చింది. తొలుత 8.2 శాతంగా ఉన్న వృద్ధిరేటు క్రమంగా 3.2 శాతానికి క్షీణించిపోయింది. వృద్ధిరేటు పతనం గురించి ఎవరు ఎంతగా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పాలకులు పట్టించుకోనేలేదు. ‘దేశ ఆర్థికం అంతా సవ్యంగా ఉన్నట్టు’ వ్యవహరించారు. అంతేకాదు భారత్ ‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ’గా ఇంటా, బయటా గొప్పలు చెప్పుకుంది. వాస్తవం ఏమిటంటే అభివృద్ధి అంకురించేందుకు ఆస్కారం లేనంతగా భారత ఆర్థికవ్యవస్థ దిగజారిపోయింది. అయినా ఈ ఎడారిసీమలో పచ్చని మోసులు మొలకెత్తుతున్న సుందర దృశ్యాలను ఆర్థికమంత్రి, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు చూశారు మరి! 


మనం ఇప్పటికీ అంధకార బంధురమైన సొరంగంలో ఉన్నాం. అంతమాత్రాన క్రుంగిపోవల్సిన అవసరం లేదని పలువురు ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంకా సమయం మించిపోలేదని, ఈ క్లిష్టపరిస్థితి నుంచి మనం బయటపడవచ్చని వారు భరోసా ఇస్తున్నారు. అయితే మాంద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం విధిగా ద్రవ్యవిధానపరమైన చర్యలు చేపట్టి మాంద్యాన్ని అరికట్టి, డిమాండ్/ వినియోగాన్ని పెంపొందించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇందుకు ఎంత త్వరగా పూనుకుంటే ఆర్థిక వ్యవస్థ అంత శీఘ్రంగా కోలుకుంటుందని ఆర్థికవేత్తలు నిశ్చితంగా చెబుతున్నారు. డిమాండ్/ వినియోగం పెరిగితే ఉత్పత్తి, ఉద్యోగాలు పునరుద్ధరణ అవుతాయని క్లిష్ట పరిస్థితులు తొలగిపోతాయని ఆర్థికవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత దుస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగాన్ని ఇతోధికంగా పెంపొందించడమే కీలకం. డబ్బును సమకూర్చుకుని, ఖర్చు చేస్తున్నంతవరకు ఏ రంగంలో, ఏ పనికి, ఏ ప్రాజెక్టుకు ఎంత వినియోగిస్తున్నామన్నది ముఖ్యం కానే కాదు. ఖర్చు చేయడమే ప్రధానం. మరి ప్రభుత్వం అనేక విధాలుగా డబ్బును సమకూర్చుకోవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ఎఫ్ఆర్బిఎమ్ (ఫిస్కల్ రెస్సాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టం కింద పరిమితులను సడలించడం ద్వారా రుణాలు మరింతగా తీసుకోవడం; కొవిడ్-19 పై సమరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలెప్ మెంట్ బ్యాంక్ మొదలైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సమకూర్చనున్న 6.5 బిలియన్ డాలర్ల నిధులూ; ద్రవ్యలోటును భర్తీ చేసుకునేందుకు కరెన్సీ నోట్లను ముద్రించడం మొదలైనవి డబ్బును సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలు. 


ఇలా సమకూర్చుకున్న డబ్బును ధైర్యంగా ఖర్చు పెట్టడం చాలా ముఖ్యం. ఆ డబ్బులో కొంత భాగాన్ని పేదలకు నగదు రూపేణా బదిలీ చేయాలి; మరికొంత భాగాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ మూలధన వ్యయాలకు వినియోగించాలి; ఇంకొంత భాగాన్ని వస్తుసేవల పన్ను నష్టపరిహారాన్ని చెల్లించేందుకు; బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చేందుకు వినియోగించాలి. తమకు సమకూరిన నిధులతో మరింత మందికి రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులకు వెసులుబాటు లభిస్తుంది. మార్కెట్‌లో డిమాండ్ పునరుద్ధరణ అయిన సూచనలు కన్పించిన వెంటనే నగదు పుష్కలంగా గల ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు మదుపు చేసి, ఉత్పత్తిని పెంపొందించేందుకు సంసిద్ధమవుతాయి. ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టవలసిన తదుపరి చర్య ఆహారధాన్యాల నిల్వలను పేదల ప్రయోజనాల కోసం ఉపయోగించడం. పెద్ద ఎత్తున ప్రజాపనులు చేపట్టి శ్రామికులకు ధాన్యం రూపేణా వేతనాలు చెల్లించాలి. ఇందుకు ప్రభుత్వ గోదాంలలో అపారంగా నిల్వ ఉన్న ధాన్యరాశులను వినియోగించుకోవచ్చని మరి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది పంట దిగుబడులు రికార్డు స్థాయిలో ఉండగలవని విశ్వసిస్తున్నందున ప్రభుత్వ గోదాములు శీఘ్రగతిన ధాన్యరాశులతో నిండిపోయే అవకాశం ఎంతైనా ఉంది.

ప్రభుత్వం చేపట్టవలసిన మూడో సాహసోపేత చర్య అధికారాలను రాష్ట్రాలకు వికేంద్రీకరించి, వాటికి ఆర్థిక సాధికారిత కల్పించడం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి గానీ, నిత్యావసర సరుకుల సరఫరాలను క్రమబద్ధీకరించేందుకు గానీ, జిల్లా కేంద్ర, పట్టణ సహకార బ్యాంకులను నియంత్రించేందుకు కేంద్రం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అటువంటి ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఒకే జాతి సరే, అన్నీ ఒకే విధంగా, ఒకే తీరున ఉండాలను కోవడం ప్రయోజనకరమైన ఫలితాలనిచ్చే భానవ కాదు. ఈ సత్యాన్ని పాలకులు గుర్తించాలి. నా ప్రతిపాదనలు రెండు అజ్ఞాత అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకటి - కరోనా మహమ్మారి భావి గతి; రెండు చైనా ఉద్దేశాలు. నేనీ వ్యాసం రాస్తున్న సమయానికి అవి రెండూ తెలియని అంశాలుగానే ఉన్నాయి.



(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-09-05T06:20:46+05:30 IST