విప్లవవీరుని అంతిమ క్షణాలు

ABN , First Publish Date - 2022-06-24T07:07:09+05:30 IST

‘మద్రాసు రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది అంతయు వినియోగింపబడినను రెండున్నర సంవత్సరాలు ప్రయత్నించియు ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచలేక పోయినది. 700 మందికి పైగా పోలీసులు...

విప్లవవీరుని అంతిమ క్షణాలు

‘ఇటలీలో మాజినీ జాతీయతను ప్రచారం చేసి, స్వాతంత్ర్యాగ్నిని ప్రజ్వలింప చేయగా గారిబాల్డి కత్తిని పట్టి, యుద్ధం జేసి స్వాతంత్ర్యాన్ని స్థాపించినట్టు, తిలక్, గాంధీజీ రేకెత్తించిన జాతీయ భావముల ప్రచారము నూతగా గొని కత్తిని చేపట్టి భారత స్వాతంత్ర్యాన్ని స్థాపించుటకు శ్రీ రామరాజు సంకల్పించెను’ అని ఆయన సహపాఠి, స్వాతంత్ర్య యోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య నివాళి అర్పించారు. ఆ సంకల్ప సాధనలో నేలకొరిగినప్పుడు సీతారామరాజు వయసు 27 సంవత్సరాలు.


‘మద్రాసు రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది అంతయు వినియోగింపబడినను రెండున్నర సంవత్సరాలు ప్రయత్నించియు ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచలేక పోయినది. 700 మందికి పైగా పోలీసులు, 30 మంది ఆఫీసర్లు పని చేసి 13 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినను పోలీసులు కృతార్థులు కాలేకపోయిరి. వారికి కొండలలోకి పోవుటకు ధైర్యము లేక వెలుపలనే విప్లవకారుల కొరకు వృథాగా తిరుగుచున్నారు. విప్లవకారులను వెంబడించి, తరిమి వారితో పోరాడుటకు సైన్యానికి సాహసము లేకపోయినది’– 1924 మార్చిలో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో చింతలపాటి వెంకట నరసింహరాజు సైన్యం అసమర్థతను ఎత్తిపొడుస్తూ, విప్లవవీరుని పట్ల తన అభిమానాన్ని వెల్లడిస్తూ మాట్లాడిన మాటలివి. ఆ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అయితే రెండు నెలలు తిరగక ముందే ఆ విప్లవయోధుడు అస్తమించాడు. అతడి అంతిమ క్షణాల గురించి విశ్వసనీయమైన ప్రభుత్వ నివేదిక ఒకటి ఇలా పేర్కొంది: 


‘ఆ వేసవి రాత్రి అంతయు (1924 మే 6) రాజు కొండపై దాగి యుండెను. మరుసటి దినము దాహమును తీర్చుకొనుటకు కొండ దిగి సెలయేరు నొద్దకు వచ్చెను. సెలయేరు ఆవలి యొడ్డున ఇన్‌స్పెక్టర్ ఆళ్వారునాయుడు తన దళముతో విడిసియుండెను. సెలయేరులో ముఖము కడుగు కొనుచున్న రాజును పోలీసులకు నీరు తెచ్చుటకు వెళ్ళిన వారు చూచిరి. వెంటనే వారు ఆ సమాచారాన్ని జాగ్రత్తగా ఆళ్వారు నాయుడుకు చెప్పిరి. అప్పటికే ఏజెన్సీ ప్రజలు పితూరీ వలన అలసిపోయిరి. ఈ రెండు సంవత్సరాలు వారి గృహములు తగులబెట్ట బడినవి. వారికి వ్యవసాయం లేదు. మలబారు దళముల అమానుష చర్యలకు స్త్రీలు గురిచేయబడిరి. అందువలన రాజు ఆచూకీని వారు ఇన్‌స్పెక్టర్‌కు చెప్పివేసిరి. వెంటనే ఇన్‌స్పెక్టర్ ఆళ్వారునాయుడు, మలబారు పోలీసులు బయలుదేరి వెళ్లి రాజును చుట్టుముట్టి బంధించిరి. ఇన్‌స్పెక్టర్ మకాముకు తీసుకువెళ్లిరి. రాజు తాగుటకు నీరు అడిగెను. ఇన్‌స్పెక్టర్ పాలను ఇచ్చెను. తరువాత ఇన్‌స్పెక్టర్, ఆయన మనుషులు రాజునకు గల మానవాతీత శక్తుల వల్ల వెడలిపోవునేమోనని భయపడి, రాజును మంచంపైపరుండబెట్టి శరీరం ఒక అంగుళముకూడ కదుపుటకు వీలులేని విధంగా కట్టివేసి అక్కడకు ఆరుమైళ్ల దూరంలో కొయ్యూరు గ్రామం వద్ద వున్న మేజర్ గుడాల్ మకామునకు తీసుకొనిపోయిరి. వీరుడగు రాజును అలా మంచానికి కట్టివేసి తీసుకొనివచ్చినందుకు ఇన్‌స్పెక్టర్‌ను మందలించి గుడాల్ కట్లు విప్పించెను. రాజు మంచంపై కూర్చుండెను. గుడాల్ చేయిజాపి రాజుతో కరచాలనము చేయజూచెను. రాజు నిరాకరించి బ్రిటిషు వాని చేతిని తాకుటను తాను అసహ్యించుకొందునని చెప్పెను. అంతట గుడాల్ ‘నీవు కనుక బ్రిటిష్ సైన్యంలో నున్నచో కల్నల్‌వు కాగలవు’ అని నవ్వుతూ రాజు బాల్య వైఖరిని మందలించు ధోరణిలో శాంతముగనే మాటాడెను. రాజు తన వైఖరి మార్చుకోలేదు. గుడాల్ వైఖరి మారిపోయినది. కోపము పట్టలేకపోయెను. గుడారంలోకి వెళ్లి బైబిల్ తీసుకొని మోకాళ్ళపై నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసెను. తరువాత బయటకువచ్చి జమాదారుని పిలిచి ‘కోర్టు మార్షల్’కు ఆజ్ఞనిచ్చెను. మలబారు పోలీసులు రాజును చేతులు విరిచి కట్టివేసి ముఖమును కప్పివేసిరి. గుడాల్ రాజు వద్దకు వెళ్లి ‘నీ రక్త బంధువులకు ఏమైనా చెప్పుదువా?’ అనెను. ‘నేను చెప్పునదేదియులేదు. కాని నన్ను కోర్టులో న్యాయవిచారణకు ఎందుకు హాజరుపెట్టవు’ అని ప్రశ్నించెను. ‘నిన్ను తుదముట్టించుటకు నిశ్చయించితిని. ఐదు నిమిషాలు ప్రార్థించుకొనుము’ అనెను. రాజు ప్రార్థన చిహ్నముగా తలను ఎత్తి తరువాత తల దించెను. అప్పుడు గుడాల్ కాల్పులకు ఆజ్ఞనిచ్చెను. జమాదారు మొదట కాల్చెను గానీ గుండు ఎడమచెయ్యి పై భాగమున తగిలెను. గురి తప్పినందులకు జమాదారుపై గుడాల్ మండిపడెను. అంతట స్వయంగా గుడాల్ ముందుకు నడిచి రాజు గుండెపై గురి చూచి తన రివాల్వరు కాల్చి కిరాతక చర్యకు పాల్పడెను. రాజు తల ఒరిగిపోయినది. అతడు విగత జీవుడయ్యెను’.

Updated Date - 2022-06-24T07:07:09+05:30 IST