సినిమా కూడా పాటంత హిట్టవ్వాలి!

ABN , First Publish Date - 2021-03-14T05:56:35+05:30 IST

‘‘దర్శకుడు శ్రీనివాస్‌ కథను క్షుణ్ణంగా చెప్పారు. నాలోని నటిని ఆవిష్కరించే పాత్ర అని భావించి ‘శశి’ సినిమా అంగీకరించా. ‘ఒకే ఒక లోకం...

సినిమా కూడా పాటంత హిట్టవ్వాలి!

‘‘దర్శకుడు శ్రీనివాస్‌ కథను క్షుణ్ణంగా చెప్పారు. నాలోని నటిని ఆవిష్కరించే పాత్ర అని భావించి ‘శశి’ సినిమా అంగీకరించా. ‘ఒకే ఒక లోకం...’ పాటంత బాగుంటుంది ఈ సినిమా. ప్రేమకథతో పాటు ఫ్యామిలీ యాంగిల్‌ కూడా ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ప్రేమ, తండ్రీ కూతుళ్ల మధ్యన ఉండే బలమైన అనుబంధాలను దర్శకుడు కొత్తగా ఆవిష్కరించారు. అందుకే ఇదొక సాదాసీదా ప్రేమకథ కాదు అని చెబుతున్నా. నాకే కాదు, ప్రతి అమ్మాయి జీవితానికి దగ్గరగా ఉంటుందీ సినిమా. పతాక సన్నివేశాలు భావోద్వేగంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని కథానాయిక సురభి అన్నారు. ఆది సాయికుమార్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్‌ నాయుడు దర్శకత్వంలో ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, సి. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. 


ఈ సందర్భంగా సురభి శనివారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘స్నేహితులతో కలసి అల్లరిచేసే కాలేజ్‌ అమ్మాయిగా, తండ్రీ కూతుళ్ల అనుబంధంలో భావోద్వేగాలను పలికించే అమ్మాయిగా నా పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. ఇందులో ఆది పాత్రకు ప్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. దానివల్ల మనుషులపై నమ్మకం కోల్పోయిన యువకుడిగా కనిపిస్తారు. రాజీవ్‌ కనకాల నాకు తండ్రిగా నటించారు. కూతుర్ని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రను పోషించారు. కొన్ని సన్నివేశాల్లో మా నాన్నగారు గుర్తుకొచ్చారు. వెన్నెల కిషోర్‌, వైవా హర్ష కాంబోలో వచ్చే హాస్య సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రస్తుతం కన్నడలో ఓ చిత్రం అంగీకరించాను. నటిగా నిరూపించుకునే పాత్ర కోసం చూస్తున్నా. సీత లాంటి పురాణ పాత్రల్లో నటించాలనేది నా కోరిక. ఒకే ఒక లోకం..పాట ఇప్పటికే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. మా ‘శశి’చిత్రాన్ని కూడా ఆ రేంజ్‌ హిట్‌ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను. గ్లామర్‌ పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’’ అని సురభి చెప్పారు.

Updated Date - 2021-03-14T05:56:35+05:30 IST