Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోరు ఆపేది లేదు

  • ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చేవరకు అంతే..
  • పార్లమెంటు ఉభయ సభల్లో ఏకకాలంలో జరగాలి.. 
  • రాష్ట్రానికి అనుకూల ప్రకటన వచ్చేవరకు సాగాలి
  • అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా.. 
  • టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సమావేశంలో సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చేవరకు పోరాటాన్ని ఆపేదే లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలందరూ పట్టుదలతో పోరాటం కొనసాగించాలన్నారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను పరిరక్షించేందుకు పార్లమెంటు ఉభయ సభలే వేదికలుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనతో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్‌లో పార్టీ ఎంపీలు, మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఆందోళనను మరింత ఉధృతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుకూలంగా స్పందించేవరకు పోరాడాలని అన్నారు. ఇప్పటివరకు ఎంపీలు సాగించిన పోరాటం బాగుందని, ఇకముందు కూడా ఇదే పంథా కొనసాగించాలని సూచించారు.


అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఏకకాలంలో పోరాటం కొనసాగాలన్నారు. అడుగడుగునా కేంద్రాన్ని నిలదీయాలని, ఇక్కడి రైతుల ఇబ్బందులను వివరించి చెప్పాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు ఓ విధానమంటూ ఉండాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని, పీయూష్‌ గోయల్‌ వివరణలోని లోపాలను ఎత్తి చూపాలని అన్నారు. ఇక ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ పోరాటానికి వివిధ పక్షాలు మద్దతు తెలపడం శుభసూచకమని కేసీఆర్‌ పేర్కొన్నారు. విపక్ష పార్టీలను కలుపుకొని వెళ్లాలని, ఆయా పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అవసరమైతే వారితో సమావేశాలు నిర్వహించి, రైతుల పరిస్థితిని, కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను వివరించాలని సూచించారు. తద్వారా పోరాటంలో వారిని భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే తాను కూడా ఢిల్లీకి వస్తానని అన్నారు. 

Advertisement
Advertisement