Abn logo
Feb 22 2020 @ 01:33AM

రాహువుతో పోరాటం ఆసక్తికరం

‘‘వ్యాపార రంగం నుంచి సినిమా పరిశ్రమలో నిర్మాతగా అడుగుపెట్టా. డబ్బు సంపాదన నా లక్ష్యం కాదు. మంచి సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచాలన్న సంకల్పంతో నిర్మాతనయ్యా. ఇది కేవలం వ్యాపకం మాత్రమే. కథ నచ్చితేనే సినిమాలు తీస్తా’’ అని ఏ.వి.ఆర్‌ స్వామి అన్నారు. అభిరామ్‌ వర్మ, కృతిగార్గ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకుడు. ఏ.వి.ఆర్‌ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మాతలు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన ఏ.వి.ఆర్‌ స్వామి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ కథలో హీరోయిన్‌ జీవితంలో ఒక రాహువు ఉంటాడు. కన్వర్షన్‌ డిజార్డర్‌తో బాధ పడుతున్న ఆమె రాహువుతో ఎలా పోరాడింది అన్నది ఇతివృత్తం. హై స్టాండర్డ్స్‌తో రూపొందిన న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఇది. కుటుంబ సభ్యులతో చూసే సినిమాలు తక్కువ అవుతున్న తరుణంలో మంచి కథతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘రాహు’ సినిమా తీశాం. నటీనటులు చక్కని నటన కనబర్చారు. సంగీతం, ఫొటోగ్రఫీ అన్ని కరెక్ట్‌గా కుదిరాయి. ఈ రోజుల్లో సినిమా తియ్యడం గొప్ప కాదు, మార్కెట్‌ చేసుకోగలగాలి. ఆ విషయంలో మేం సక్సెస్‌ సాధించాం అనుకుంటున్నా. సురేశ్‌బాబుకి సినిమా నచ్చి విడుదల చేస్తున్నారు. ప్రేక్షకాదరణ పొంది మా డబ్బు మాకొస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement