మద్దతు ధర చట్టం తెచ్చేవరకు పోరాటం ఆగదు

ABN , First Publish Date - 2021-11-26T09:36:30+05:30 IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన పాక్షిక విజయమేనని, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన మిగతా చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని టీఎ్‌సకేఎస్‌ రైతు సంఘం నాయకులు అతుల్‌కుమార్‌ అంజన్‌ అన్నారు.

మద్దతు ధర చట్టం తెచ్చేవరకు పోరాటం ఆగదు

ధర్నాచౌక్‌ వేదికపై రైతు సంఘాల నేతలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన పాక్షిక విజయమేనని, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన మిగతా చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని టీఎ్‌సకేఎస్‌ రైతు సంఘం నాయకులు అతుల్‌కుమార్‌ అంజన్‌ అన్నారు. నగరంలోని ధర్నాచౌక్‌లో గురువారం నిర్వహించిన రైతు సమాఖ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి వ్యవసాయ చట్టాల రద్దు గురించి మాట్లాడారు కానీ, మద్దతు ధరపై పెదవి విప్పలేదన్నారు. కేంద్రం మద్దతు ధర చట్టం ప్రకటించే వరకు పోరు కొనసాగుతుందన్నారు. విత్తన, విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా, అన్ని పంటలకు మద్దతు ధర కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన నిరసనను, త్వరలో ఢిల్లీ వీధుల్లోకి తీసుకెళ్తామన్నారు. ఢిల్లీలో రైతులు పోరాటం ప్రారంభించి ఏడాది పూర్తి కావస్తోందని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటం గడిచిన 70 ఏళ్లలో జరగలేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలన్నారు. ఏఐటీఎంఎస్‌ నేత ఆశీష్‌ మిఠల్‌ మాట్లాడుతూ... ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రోత్సహించడం ద్వారా రైతులను, వ్యాపారులను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. తెలంగాణలో ఆదివాసీలపై దాడులు పెరిగాయని, సహజంగా ఉన్న చెట్లను నరికి, ఫ్యాక్టరీలకు పనికొచ్చే చెట్లను పెంచుతున్నారన్నారు.

Updated Date - 2021-11-26T09:36:30+05:30 IST