పండగనూ పట్టించుకోలేదు!

ABN , First Publish Date - 2022-01-15T05:58:25+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించాల్సిన సంక్రాంతి సంబరాలను అధికారులు తూతూమంత్రంగా కానిచ్చేశారు.

పండగనూ పట్టించుకోలేదు!

అధికారిక సంక్రాంతి సంబరాలు మొక్కుబడిగా నిర్వహణ

కలెక్టర్‌ గుర్తుచేసేంత వరకు కదలని అధికారులు

బాధ్యులను ప్రభుత్వానికి సరండర్‌ చేస్తానని హెచ్చరిక

దీంతో భోగి రోజు మధ్యాహ్నం తరువాత ఆదరాబాదరాగా నిర్వహణ

కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రెండు వారాల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు

ప్రణాళిక, ప్రచారంలో పర్యాటక శాఖ విఫలం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించాల్సిన సంక్రాంతి సంబరాలను అధికారులు తూతూమంత్రంగా కానిచ్చేశారు. సంబరాలు నిర్వహించాలని రెండు వారాల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగా, భోగి రోజు ఉదయం వరకు వీటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున గుర్తుచేస్తే తప్ప...అధికారులకు గుర్తుకు రాలేదు. సంక్రాంతి సంబరాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఉన్నతాధికారులను ప్రభుత్వానికి సరండర్‌ చేస్తానని కలెక్టర్‌ హెచ్చరించడంతో మధ్యాహ్నం రెండు గంటల తరువాత పర్యాటక శాఖ అధికారులు పరుగులు పెట్టారు. కొన్ని శాఖల ఉన్నతాధికారులను ఆహ్వానించి వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనా వద్ద మొక్కుబడిగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఆ శాఖ అధికారులు ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.


ప్రభుత్వపరంగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది కూడా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో సంబరాలను ఘనంగా నిర్వహించాలంటూ గత నెల 29న ఏపీ స్టేట్‌ క్రియేటివిటీ అండ్‌ కల్చర్‌ కమిషన్‌ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాల్లోని పర్యాటక శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖకు ప్రభుత్వం అప్పగించింది. సంబరాల నిర్వహణకు సంబంధిత అధికారులు వెంటనే ప్రణాళికను రూపొందించుకోవాలి. జిల్లా స్థాయిలో నిర్వహించే వేడుకలకు వేదిక, కార్యక్రమాల నిర్వహణ గురించి ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలి. ముగ్గుల పోటీలు నిర్వహించాలి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు-సన్నాయి మేళాలు, తప్పెట గుళ్లు, కోలాటాలు, ఆట-పాటలు, తదితర కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. పలు విద్యా సంస్థలకు కబురు పంపి విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని యాజమాన్యాలను కోరాలి. కానీ భోగి పండగ రోజైన శుక్రవారం ఉదయం వరకు పర్యాటక శాఖ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున చెప్పేంత వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్న విషయం సంబంధిత అధికారులకు గుర్తుకు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ఉన్నతాధికారులను సరండర్‌ చేస్తానని కలెక్టర్‌ హెచ్చరించడంతో పర్యాటక శాఖ అధికారులు పరుగులు పెట్టారు. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనా వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియా ప్రతినిధులకు సమాచారం పంపారు. అప్పటికప్పుడు అందుబాటులో వున్న అధికారులను పిలిచి..సంక్రాంతి సంబరాలను తూతూమంత్రంగా నిర్వహించారు. 


పెద్ద దిక్కులేని పర్యాటక శాఖ

సాధారణంగా విశాఖ ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌, భీమిలి ఉత్సవ్‌, సంక్రాంతి సంబరాలు వంటి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖ చూస్తుంది. అయితే జిల్లా పర్యాటక శాఖకు పెద్దలేకుండాపోయింది. ఇతర శాఖలకు చెందిన అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పర్యాటక శాఖ పనితీరు మందగించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో విజిలెన్స్‌ అధికారిగా పనిచేస్తున్న పూర్ణిమాదేవి..జిల్లా పర్యాటక శాఖ అధికారిగా, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రమణ.. పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు శాఖల్లో పనిభారం కారణంగా సంక్రాంతి సంబరాలపై దృష్టిసారించలేకపోయామని తోటి అధికారుల ఎదుట వాపోయినట్టు తెలిసింది.

Updated Date - 2022-01-15T05:58:25+05:30 IST