పూల పర్వం సంస్కృతికి చిహ్నం

ABN , First Publish Date - 2022-09-23T05:47:39+05:30 IST

పూలతో దేవతలను కొలవడం సర్వసాధారణం. కానీ పూలనే దేవతగా భావించి పూజించడం ఒక్క బతుకమ్మ పండుగకే చెల్లు. అందుకే ఇది పూల వేడుక. అన్ని వయసుల మహిళలు...

పూల పర్వం సంస్కృతికి చిహ్నం

ఎల్లుండి నుంచి బతుకమ్మ సంబరాలు


పూలతో దేవతలను కొలవడం సర్వసాధారణం. కానీ పూలనే దేవతగా భావించి పూజించడం ఒక్క బతుకమ్మ పండుగకే చెల్లు. అందుకే ఇది పూల వేడుక. అన్ని వయసుల మహిళలు... ఎలాంటి వివక్షలూ లేకుండా ఒక్కటై... ఆటపాటలతో చేసుకొనే ఈ పండుగ... సామాజిక సమైక్యతకు ప్రతీక. 


పరాశక్తికి ప్రతిరూపం ప్రకృతి. ఆ ప్రకృతిని దైవంగా కొలిచే సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. పరాశక్తిని తెలంగాణలో గౌరిగా ఆరాధిస్తే, ఆంధ్రప్రాంతంలో దుర్గగా పూజిస్తారు. భాద్రపద బహుళ అమావాస్యనాడు బతుకమ్మ సంబరాలు ప్రారంభమై.. ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకూ, దుర్గాపూజ ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకూ... తొమ్మిదిరోజుల పాటు జరుగుతాయి.  ఈ వేడుకలు జరిగే కాలంలో... ప్రకృతిమాత ఆకుపచ్చని చీర కట్టినట్టు కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. శరత్కాల చంద్రుడు షోడశ కళలతో చల్లని వెన్నెల కురిపిస్తాడు. ఇలా బతుకమ్మ సంబరాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే ఈ సమయం... ఆరాధనలకు, ఉపాసనలకు అనువైన కాలం. 


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరం శతాబ్దాలనాటిది. పండుగకు పక్షం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకుంటారు. కైలాసపతి సతి గౌరమ్మను (పార్వతిని) తమ పెద్దక్కగా భావించి, స్వాగతించడానికి ఎదురుచూస్తారు. ‘పితర అమావాస్య’ (మహాలయ అమావాస్య) నాడు ఈ వేడుకలు మొదలవుతాయి. ఆ రోజున ‘ఎంగిలి బతుకమ్మ’గా గౌరీదేవిని సంభావించి... ఆరాధిస్తారు. అలా రోజుకొక్క పేరుతో అమ్మవారిని పూజిస్తారు.


బతుకమ్మల రూపు, కూర్పు, పేర్పు విలక్షణంగా ఉంటుంది. రకరకాల పూలను కింది నుంచి శిఖరం వరకూ వరుసల్లో పేరుస్తారు. త్రికోణాకారంలో పేర్చిన బతుకమ్మ పైన పసుపు ముద్దను... గౌరమ్మకు ప్రతీకగా ఉంచి... ధూప, దీప, నివేదనలతో పూజిస్తారు. తొలిరోజున ‘ఎంగిలిపూల బతుకమ్మ’, రెండో రోజున ‘అటుకుల బతుకమ్మ’, మూడో రోజున ‘ముద్దపప్పు బతుకమ్మ’, నాలుగో రోజున ‘నానుబియ్యం బతుకమ్మ’, అయిదో రోజున ‘అట్ల బతుకమ్మ’, ఆరో రోజున ‘అలిగిన బతుకమ్మ’, ఏడో రోజున ‘వేపకాయల బతుకమ్మ’, ఎనిమిదో రోజున ‘వెన్నముద్దల బతుకమ్మ’, తొమ్మిదో రోజున ‘సద్దుల బతుకమ్మ’... ఇలా రోజుకో పేరుతో అమ్మవారిని కొలుస్తారు. ఆరో రోజున... ‘అలిగిన బతుకమ్మ’కు నివేదన ఉండదు. మిగిలిన రోజుల్లో రకరకాల పదార్థాలను అమ్మకు నైవేద్యంగా పెడతారు.



సంబరాల్లో చివరి రోజైన అష్టమి (దుర్గాష్టమి) నాడు... ప్రతి ఇంటి నుంచి బతుకమ్మలను ఊరేగిస్తూ.. చెరువుల వద్దకు చేరుకుంటారు. విశాలమైన ప్రదేశంలో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతారు, నృత్యాలు చేస్తారు. ‘మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా... మళ్లీ నాటికి తోలుకొత్తుమాయమ్మా’ అని వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేస్తారు. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ పాటలు... సంగీత, సాహిత్యాల పరంగానూ విలువైనవే. సామాజిక, చారిత్రక అంశాలెన్ని టినో అవి ప్రతిబింబిస్తాయి. 

Updated Date - 2022-09-23T05:47:39+05:30 IST