పండుగ పట్నంలోనే!

ABN , First Publish Date - 2020-10-24T09:16:58+05:30 IST

దసరా పండుగొచ్చిందంటే కనీసం ఐదారు రోజుల సెలవులు. ఊరికి వెళ్లి అయినవాళ్ల మధ్య పండుగ జరుపుకొంటే ఆ మజాయే వేరు.

పండుగ పట్నంలోనే!

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లని జనం..

ఓవైపు కరోనా భయం..

మరోవైపు భారీ వర్షాలు

గతంలోలా రైల్వేస్టేషన్లలో కనిపించని రద్దీ

రైళ్లలో 40శాతం మంది మాత్రమే ప్రయాణం

ఆర్టీసీకి ఆదాయం పరంగా తప్పని నిరాశ

ఏపీ వైపు ఆర్టీసీ బంద్‌.. ప్రైవేటే ఆధారం 

ఆ బస్సుల్లో చార్జీల మోత.. జంకుతున్న జనం

 

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగొచ్చిందంటే కనీసం ఐదారు రోజుల సెలవులు. ఊరికి వెళ్లి అయినవాళ్ల మధ్య పండుగ జరుపుకొంటే ఆ మజాయే వేరు. ఆ రకంగా దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతాయి. హైదరాబాద్‌ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు, సొంతూళ్లకు తరలివెళతారు. కానీ.. ఈసారి రైల్వే, బస్‌ స్టేషన్లలో ఆ రద్దీ కనిపించడం లేదు. మునుపటిలా భారీ సంఖ్యలో జనం ఊర్లకు వెళ్లకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో బస్సు, రైలు ప్రయాణాలతో రిస్క్‌ ఎందుకు? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళ ఊర్లకు వెళ్లిన వారు.. రెండు నెలల క్రితమే తిరిగి నగరానికి వచ్చారు. దీంతో మళ్లీ వెళ్లేందుకు వారు అంతగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు భారీ వర్షాలతో రోడ్లు పాడైపోవడం, వాగులు, చెరువులు తెగిపోవడంతో బస్సులు, సొంత వాహనాలపై వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. పండుగ సంతోషం కన్నా ఆరోగ్యమే ముఖ్యమంటూ దసరాను నగరంలోనే చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో రైలు ప్రయాణికుల కోసం ఆన్‌లైన్‌ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. చాలా మంది సామాన్యులు, ఇది తెలియక స్టేషన్లకు వెళుతున్నారు. అక్కడ టికెట్‌ కౌంటర్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కోరైలులో 40 శాతం మాత్రమే వెళుతున్నారు. 


తక్కువ సంఖ్యలో రైళ్లు..

2019లో దసరా, దీపావళి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే 780 ప్రత్యేక రైళ్లను నడిపించింది. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి ఆయా రైళ్లలో నాలుగు స్టేషన్లలో కలిపి రోజుకు 2.80 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రయాణించారు. కానీ, ఈసారి కరోనా కారణంగా రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా జూన్‌ 10 నుంచి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాలకు నాలుగు నుంచి ఆరు వరకు రైళ్లను నడిపిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి నాలుగు నెలలుగా  గోల్కొండ, ఫలక్‌నుమా, గోదావరి, దానాపూర్‌, రాయలసీమ, రాజధాని (కేఎ్‌సఆర్‌ బెంగళూరు-నిజామాబాద్‌) రైళ్లను మాత్రమే నడిపిస్తున్నారు. పండుగను పురస్కరించుకుని గురువారం నుంచి గౌతమి, నారాయణాద్రి, చార్మినార్‌, షాలిమార్‌, రాజ్‌కోట్‌, షిరిడీ ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. అయితే గతంలో మాదిరిగా వందల సంఖ్యలో రైళ్లు నడవకపోవడంతోపాటు కొవిడ్‌ భయంతో ప్రయాణికుల సంఖ్య అంతగా కనిపించడంలేదు. 


బస్టాండ్లలో సందడి కరువు..

ఏటా దసరాకు అధిక సంఖ్యలో బస్సులను నడిపించి పెద్దమొత్తంలో ఆదాయాన్ని పొందే ఆర్టీసీకి ఈసారి నిరాశే ఎదురవుతోంది. బస్టాండ్లలో పండుగ సందడే కరువైంది. వాస్తవానికి దసరా నేపథ్యంలో నగరం నుంచి 3వేల బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయినా ఆశించిన స్పందన రావడంలేదు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఎంజీబీఎ్‌సలోని ఓ ఉద్యోగి తెలిపారు. దసరా పండుగ సమయంలో ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ వారం రోజుల ముందు నుంచే కిటకిటలాడేదని, ప్రస్తుతం రద్దీయే లేదని అన్నారు. ఇక హైదరాబాద్‌ నుంచి ఏపీకి గతంలో ప్రత్యేక బస్సులు నడపగా.. ఈసారి ఇరు రాష్ట్రాల మధ్య సరైన ఒప్పందం లేక బస్సు సర్వీసులకు బ్రేక్‌ పడింది. మరోవైపు ప్రైవేటు బస్సుల పరిస్థితీ అలాగే ఉంది. దసరా సందర్భంగా ప్రైవేటు బస్సులు 70 శాతం వరకు అందుబాటులో ఉన్నా ప్రయాణానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.


భారీ చార్జీలతో బెంబేలు

సాధారణంగా దసరా సెలవులకు హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వారిలోనూ ఎక్కువగా సొంతూళ్లకు వెళుతుంటారు. కరోనా ప్రభావం, వర్షాల కారణంగా ప్రయాణాలు మానుకోవడం ప్రధాన కారణాలైతే.. ప్రైవేటు బస్సులు ఎక్కువ చార్జీలు వసూలు చేయడమూ బెంబేలెత్తిస్తోంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు బస్సులే ఆధారమవుతు న్నాయి. వారేమో చార్జీలు పెంచేశారు. దూరాన్ని బట్టి రూ.2-3వేల దాకా చార్జీలు ఉండడంతో ఒక కుటుంబానికి రూ.10-15వేల దాకా ఖర్చవుతుంది. ఆ డబ్బుతో ఇక్కడే పండుగ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లడం లేదు. 

Updated Date - 2020-10-24T09:16:58+05:30 IST