పండగ వచ్చె.. సందడి తెచ్చె

ABN , First Publish Date - 2022-01-15T06:04:46+05:30 IST

పల్లెలు.. పట్టణాలు.. కోలాహలంగా మారాయి. ప్రతి ఇంటా మామిడి తోరణాల అలంకరణ.. అందమైన రంగవల్లులు కనువిందు చేస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరి ముఖాల్లో చూసినా ఆనందం వెల్లువిరుస్తోంది. ఇంతటి సరదాలు.. సందడిని తెచ్చి పెట్టింది సంక్రాంతి. భోగి నుంచి కనుమ వరకు మూడు రోజులపాటు తెలుగువారి లోగిళ్లలో ఈ సంబరాలు అంబరాన్నంటు తాయి.

పండగ వచ్చె.. సందడి తెచ్చె
భోగి మంటలో జీవోల ప్రతులు వేస్తున్న మాజీ మంత్రి అయ్యన్న

 ఆనందోత్సాహాల నడుమ భోగి వేడుక   

 వీధి వీధిన వేకువజామున మంటలు 

 అంతా ఓ చోట చేరి.. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు  

 సంక్రాంతికి ఏర్పాట్లు పూర్తి

నర్సీపట్నం/రూరల్‌/ గొలుగొండ/ మాకవరపాలెం/ నాతవరం, జనవరి 14 : పల్లెలు.. పట్టణాలు.. కోలాహలంగా మారాయి. ప్రతి ఇంటా మామిడి తోరణాల అలంకరణ.. అందమైన రంగవల్లులు కనువిందు చేస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరి ముఖాల్లో చూసినా ఆనందం వెల్లువిరుస్తోంది. ఇంతటి సరదాలు.. సందడిని తెచ్చి పెట్టింది సంక్రాంతి. భోగి నుంచి కనుమ వరకు మూడు రోజులపాటు తెలుగువారి లోగిళ్లలో ఈ సంబరాలు అంబరాన్నంటు తాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం మండలాల్లోని వీధి వీధిన భోగిమంటలు వేశారు. అంతా అక్కడికి చేరి చలిమంట కాగుతూ.. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక పిల్లల సందడికి హద్దులేదు. ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని, నూతన వస్త్రాలు ధరించి భోగి మంట వద్దకు చేరారు. వీరి కళ్లలోని ఆనందాన్ని చూసిన పెద్దలు మురిసిపోయారు. ఇదిలావుంటే, శనివారం జరగనున్న పెద్ద పండగకు అంతా ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. పుణ్య కాలంలో పూజకు అవసరమై సామగ్రిని సమకూర్చుకున్నారు. ఈ వేడుకకు దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ ఇళ్లకు చేరడంతో ఎటు చూసినా కన్నులపండువగా ఉంది. ఇదిలావుంటే, పండగను పురస్కరించుకుని పలుచోట్ల వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. 

 భోగి మంటలో ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులు

ప్రజావ్యతిరేక జీవో కాపీల ప్రతులను మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు శుక్రవారం భోగి మంటలో వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం తన స్వగృహం వద్ద ఉదయం భోగి మంట వేశారు. అనంతరం రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌ ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్న తరుణంలో వీరిని మరింత కృంగదీసేలా  చెత్తపై పన్ను, ఆస్తి పన్ను, ఓటీఎస్‌ పేరిట మరింత భారాలు వేయడాన్ని నిరసిస్తూ సదరు జీవోల కాపీలను భోగి మంటలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీవోలు ప్రజలను బాధపెట్టే విధంగా ఉండడం వల్లే ఈ విధంగా నిరసన తెలిపినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు చింతకాయల విజయ్‌  తదితరులు పాల్గొన్నారు.

మకరజ్యోతి ఉత్సవాలు రద్దు

  కరోనా కేసులు పెరుగుతున్నందున స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించ తలపెట్టిన మకరజ్యోతి ఉత్సవాలను రద్దు చేశామని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అయితే శనివారం స్వామివారి రథ యాత్ర, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

Updated Date - 2022-01-15T06:04:46+05:30 IST