భయం గుప్పిట నేలకొండపల్లి

ABN , First Publish Date - 2020-06-02T10:00:57+05:30 IST

ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణవడంతో నేలకొండపల్లి వాసులు భయం గుప్పిట బిక్కుబిక్కుమంటున్నారు. అయితే నేల

భయం గుప్పిట నేలకొండపల్లి

వ్యాపారి కేసులో దొరకని లింకు

‘కట్టడి’ని సమీక్షిస్తున్న అధికారులు

నేలకొండపల్లి, చింతకాని మండలాల్లో పలువురి క్వారంటైన్

నేలకొండపల్లి, జూన్‌ 1: ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణవడంతో నేలకొండపల్లి వాసులు భయం గుప్పిట బిక్కుబిక్కుమంటున్నారు. అయితే నేల కొండపల్లిలో తొలి కరోనా కేసు నమోదైన వ్యక్తికి సంబంధించిన లింకు ఇప్పటికీ దొరక్కపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే కరోనా వచ్చిన తొలి వ్యక్తి తానెవరినీ కలవలేదని, ఎక్కడకు వెళ్లలేదని, భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఒక్కరోజు కూసుమంచి వెళ్లానని మాత్రమే చెబుతున్నట్టు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇక ఆయన మొబైల్‌ కాల్‌లిస్టులో కూడా ఏమీ దొరకలేదని తెలుస్తోంది. దీంతో సదరు వ్యక్తి ప్రైమరీ కాంటాక్టును కనుగొనటం అధికారులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో కరోనా వచ్చిన వ్యాపారితో సంబంధాలున్న వారు భయంతో వణికి పోతున్నారు.


బోదులబండకు చెందిన ఓప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యాపారిని కలిసి షాపులో కరెంటు సామగ్రి కొనుగోలు చేశాడని, ఆఎలక్ట్రీషియన్‌కు కూడా వారం రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నాయని సమాచారం. అయితే సదరు ఎలక్ట్రీషియన్‌ తనను పరీక్షించి క్వారంటైన్‌కు తరలించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కట్టడి ప్రాంతమైన నేలకొండపల్లిలో తహసీల్దార్‌ వీరభద్రం, ఎంపీడీవో రవికుమార్‌, వైద్యాధికారి డాక్టర్‌ రాజేష్‌ తమ సిబ్బందితో కలిసి పర్యటించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కట్టడి ప్రాంతాల్లోని ప్రజలు అధికారులకు సహకరించాలని, నిత్యావసరాలను గ్రామ పంచాయతీ ద్వారా  విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సదరు వ్యాపారి దుకాణంలో పనిచేసే ఓ గుమస్తా ఇటీవల అమ్మగూడెంలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైనట్లు వచ్చిన సమాచారంతో ఫంక్షన్‌ చేసిన వారితో పాటు గ్రామంలో హాజరైన వారిని, అదే ఫంక్షన్‌కు హాజరైన ఆరెగూడేనికి చెందిన రెండు కుటుంబాలను హోమ్‌ క్వారంటైన్‌ చేశారు.


లక్షణాలున్న వారినే క్వారంటైన్‌కు పంపండి : డీఎంహెచ్‌వో 

కరోనా వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు పంపొద్దని, కరోనా లక్షణాలున్న వారినే క్వారంటైన్‌కు పంపాలని మిగిలిన వారిని హోమ్‌ క్వారంటైన్‌ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి పేర్కొన్నారు. సోమవారం నేలకొండపల్లి వచ్చిన ఆమె సీహెచ్‌సీలో వైద్యులతో సమీక్షించారు. ప్రాథమికంగా పరీక్షించి.. కరోనా లక్షణాలుంటేనే క్వారంటైన్‌కు పంపాలని, అనుమానం ఉన్న వ్యక్తులను హోంక్వారంటైన్‌ చేయాలన్నారు. కట్టడి ప్రాంతంలోని వ్యక్తులు బయటకు రాకుండా చూడాలని, నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్‌ అధికారులను కోరారు. ఈ సమీక్షలో వైద్యాధికారి డాక్టర్‌ రాజేష్‌, డాక్టర్‌ సురేష్‌నారాయణ్‌, సీఐ మురళి, సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2020-06-02T10:00:57+05:30 IST