తప్పు నాదే

ABN , First Publish Date - 2021-01-25T06:12:39+05:30 IST

ఎప్పటి నుంచో తింటూ ఉన్నా కదా అతను ఎందుకు గుర్తుకు రాలేదు...

తప్పు నాదే

ఎప్పటి నుంచో

తింటూ ఉన్నా కదా

అతను

ఎందుకు గుర్తుకు రాలేదు


ఎండకు చెట్టు కిందకెళ్లి

ఇంటికొచ్చి చెట్టును మర్చిపోయినట్టు

దాహం అయినప్పుడు

ఆబగా నీళ్లు తాగి

నీటిని

మర్చిపోయినట్టు

అతన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోకపోవడం

మూడు పూటలా

తప్పుచేసినట్టే


ఇప్పుడు

చలికి వణుకుతూ 

బాగా తడిసి వాలిన పంటలా ఉన్నాడు

ఎండకు కాగుతూ

ముట్టుకుంటే కాలిపోయే కర్రులా ఉన్నాడు

అతడిది

కయ్య గుండె

బువ్వ పెట్టిన చెయ్యి

వానపాముల

జెర్రిగొడ్డుల

ఎండ్రకాయల

ఎలుక పిల్లల

చెలికాడు


జొన్నకంకుల పూత పాడే 

కుశాల పాట

అవును

అతను ఎందుకు గుర్తుకు రాలేదు


మట్టికి

పురుడుపోస్తున్నవాడు

సేద్యం అంటే

వ్యాపారం కాదనుకున్నవాడు


వాడు ఇప్పుడు

కుతకుత ఉడికే మెతుకులా ఉన్నాడు

పోరాటాన్ని చల్లి

సేద్యానికి సిద్ధమౌతున్నాడు

అవును

ఇంత కాలం

అతను ఎందుకు గుర్తుకు రాలేదు

సుంకర గోపాలయ్య

94926 38547


Updated Date - 2021-01-25T06:12:39+05:30 IST