రైతు కష్టం నేలపాలు

ABN , First Publish Date - 2021-04-21T05:25:40+05:30 IST

గిట్టుబాటు ధరలేక ఆరుగాలం శ్రమించిన పంటలు నేలపాలవుతున్నాయి.

రైతు కష్టం నేలపాలు
పొలాల్లోనే పండిపోతున్న టమోటా పంట

-గిట్టుబాటు ధరలేక

-టమోటా రైతు కుదేలు 

- పంట మొత్తం పొలాల్లోనే 

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 20: గిట్టుబాటు ధరలేక ఆరుగాలం శ్రమించిన పంటలు నేలపాలవుతున్నాయి. మార్కెట్‌లో గిట్టుబాటుధరలేక సాగుచేసిన పంటలు చెట్లలోనే కాయ లు మగ్గిపోయి రాలిపోవడం చూసి టమోటా రైతులు నష్టపోతున్నారు. మండల వ్యాప్తంగా రబీ సీజనలో వ్యవసాయ బోరుబావుల కింద బిందు సేద్యం ద్వారా వంద ఎకరాలకుపైగా రైతులు టమోటాసాగుచేశారు. ఎకరా టమోటా సాగుకు రూ.30వేల నుంచి రూ.40వేలు పెట్టుబడి పెట్టారు. పంట కాపు వచ్చే వరకు అష్టకష్టాలు పడి పంట దిగుబడి సాధించారు. అయితే మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండు నెలలుగా 12 కేజీల బాక్సు రూ.30 పలుకుతుండటంతో కనీసం కూలీ ఖర్చులు కూడ ఆ రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరతో పంటను మార్కెట్‌కు తరలిద్దామంటే కూలీ ఖర్చులు కూడా గిట్టవని వాపోతున్నారు. పంటలు పొలాల్లోనే వదిలేసే పరిస్థితి నెలకొందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ యేటా టమోటా సాగుచేసిన రైతులు పూర్తీగా నష్టపోయామని ప్రభుత్వం స్పందించి టమోటా సాగుచేసిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

టమోటాసాగుతో రూ.లక్ష నష్టం : రామకృష్ణారెడ్డి, కొండంపల్లి 

రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుచేశా. పంట సాగు దాదాపు రూ.80వేలు ఖర్చుచేశాం. ప్రస్తుతం ధర పడిపోయింది. వారపుసంతలో టమోటాలను తరలిస్తే కనీసం ఆటో బాడుగ కూడా రాలేదు. ఒక బస్తా 10 కేజీల బ్యాగుకు రూ.20 ఇస్తామంటున్నారు. కాయలు తొలగించేందుకు కూలీల ఖర్చుకూడా రాకపోవడంతో రూ.లక్షదాకా నష్టపోయాను. ప్రభుత్వమే ఆదుకోవాలి 

పొలంలోనే వదిలేశా : నరసింహారెడ్డి, శెట్టిపల్లి 

నేను రెండెకరాల్లో టమోటా పంటను సాగుచేశాను. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. తీరా పంట చేతికొచ్చాక మార్కెట్‌లో ధర పూర్తీగా పడిపోయింది. ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టుబడి కూడా గిట్టుబాటు అయ్యేలా లేదు. దీంతో పంటను పొలంలోనే వదిలేశా. 


Updated Date - 2021-04-21T05:25:40+05:30 IST