2.28 లక్షల మంది కట్‌!

ABN , First Publish Date - 2022-05-17T08:27:06+05:30 IST

‘‘దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 2022 ఖరీఫ్‌ పంటకు పెట్టుబడిగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందిస్తున్నాం. ఇప్పుడు

2.28  లక్షల మంది కట్‌!

రైతు భరోసాలో భారీగా కోతలు

ఈసారి 50.10 లక్షలకే పరిమితం

సుమారు 85 వేల మంది రైతులు..

1.43 లక్షల కౌలు రైతులకు ‘కోత’

‘మొత్తం తామే’ ఇస్తున్నట్లు గొప్పలు

కేంద్ర సహాయానికీ వైసీపీ స్టిక్కర్‌

మీట నొక్కినా కౌలు రైతులకు పడని డబ్బు

మరికొన్నాళ్లు ఆగాలంటున్న అధికారులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 2022 ఖరీఫ్‌ పంటకు పెట్టుబడిగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందిస్తున్నాం. ఇప్పుడు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన వెంటనే ప్రతి రైతుకూ రూ.5500 నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి’’ అని సోమవారం ఉదయం ఏలూరు జిల్లా గణపవరంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు. కానీ... ఏకంగా 2.28 లక్షల మంది రైతులకు ‘భరోసా’ను ఎగరగొట్టారు. ఈసారి రైతు భరోసాలో భారీ కోతలు పెట్టినట్లు ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెల్లడించింది. గ్రామాల్లో జాబితాలను ప్రదర్శించి, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని సర్కారు కోరింది. కానీ... చివరికి ‘కోతలే’ మిగిలాయి.


వరుసగా కోతలు...

 ‘ఈ పథకం కింద 64.07 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. వీరిలో 15.37లక్షల కౌలురైతు కుటుంబాలు కూడా ఉన్నాయి’ అని 2019-20 వ్యవసాయ బడ్జెట్‌లో జగన్‌ సర్కారు స్పష్టంగా పేర్కొంది. కానీ... ఈ సంవత్సరం మొత్తం రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 50.10 లక్షలకు పడిపోయింది. ఇందులో భూమి ఉన్న రైతు కుటుంబాలు 47.85 లక్షలు కాగా, అటవీ భూమి హక్కుదారులు 92 వేల మంది, కౌలు రైతులు లక్షా 43 వేల మందికే రైతు భరోసా వర్తింపచేస్తోంది. 2021-22లో 52.38లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఆ సంఖ్య 50.10లక్షలకు తగ్గింది. అంటే... ఏడాదిలో 2.28లక్షల మందికి భరోసా లేకుండా చేసింది. వీరిలో 1.43 లక్షల మంది కౌలు రైతులే అని అధికారిక గణాంకాల ద్వారానే తెలుస్తోంది.


కేంద్రం సొమ్ములూ తన ఖాతాలోనే...

అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు రూ.12,500 పెట్టుబడి సహాయం అందిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చివరికి... కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి 13,500 వేలు మాత్రమే ఇస్తున్నారు. కానీ... ఈ మొత్తం డబ్బులను తామే ఇస్తున్నట్లుగా సోమవారం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేశారు.   దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ‘పీఎం కిసాన్‌ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలకోసారి రూ.2వేల చొప్పున చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో రూ.5500, అక్టోబరులో రూ.2వేల చొప్పున విడుదల చేస్తుంది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5500లకు ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కారు. ఈ నెలాఖరుకు కేంద్రం రూ.2 వేలు జమ చేస్తుంది. కానీ... ఈ రెండువేలను కూడా కలుపుకొని  రూ.3758 కోట్లు తామే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు.


కౌలు రైతులకు ‘మాయం’

కేంద్రం అమలు చేసే ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన’ కౌలు రైతులకు వర్తించదు. వారికి కూడా ‘రైతు భరోసా’ అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. చివరికి... మొండిచెయ్యి చూపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో  కౌలు రైతులు 15.37లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఇచ్చిన మాట ప్రకారం... వీరందరికీ రైతు భరోసా వర్తింప చేయాలి. కానీ... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అమలు చేస్తున్నారు. ఈసారి వారికి కూడా ‘కోతలు’ పెట్టారు. 2.28 లక్షల మందికి ‘రైతుభరోసా’లో కోత పడగా, అందులో 1.43 లక్షల మంది అచ్చంగా కౌలు రైతులే కావడం గమనార్హం. అంటే... కేంద్ర సహాయం అందని, పూర్తిగా తాను భరించాల్సిన భారాన్ని జగన్‌ తగ్గించుకున్నారన్న మాట!


ఎందుకీ కోతలు...

‘రైతు భరోసా’లో కోతలకు కారణమేమిటో ప్రభుత్వం అధికారికంగా చెప్పడంలేదు. భూమి ఖాతా ఉన్న రైతు  చనిపోయినా, లబ్ధిదారులు జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లిస్తున్నా, ఒకే రేషన్‌ కార్డులో ఇద్దరు రైతులు ఉన్నా,  రైతు కుటుంబంలో ఉన్నత విద్య చదువుతున్నా, నవరత్నాల్లోని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నా... రైతు భరోసాను నిలిపివేసినట్లు తెలిసింది. దీని ఫలితంగానే ఈ ఏడాది 2.28లక్షల రైతు కుటుంబాలు ‘భరోసా’కు దూరమయ్యాయి. 


వెంటనే... అంటే ఎప్పుడో!?

‘మీట నొక్కిన వెంటనే రూ.5500 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి’ అని సీఎం జగన్‌ ఏలూరు జిల్లా సభలో పేర్కొన్నారు. ఆ మీట నొక్కినప్పటి నుంచి రైతులు డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్‌ కోసం చూస్తూనే ఉన్నారు. కానీ... రాత్రి ఏడు గంటల తర్వాతే డబ్బులు రావడం మొదలైంది. అందులోనూ... సోమవారం 20 నుంచి 30 శాతం మందికి మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు... లబ్ధిదారుల్లోని 1.33 లక్షల కౌలు రైతుల్లో ఒక్కరికీ డబ్బులు పడలేదు. వీరు కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. నిజానికి... కేంద్ర పథకం వీరికి వర్తించదు కాబట్టి, రాష్ట్రమే రూ.7500 జమ చేయాలి. కౌలు రైతులకు సంబంధించి జగన్‌ మీట నొక్కింది రూ.7500లకా, లేక రూ.5500లకా అనే అంశంపై స్పష్టత లేదు. ఆ సంగతి పక్కనపెడితే... అసలు వారి ఖాతాలో సోమవారం రూపాయి కూడా పడలేదు.


జగన్‌రెడ్డి దరిద్రపాదం ఎఫెక్ట్‌

రైతు రాజ్యం దేవుడెరుగు...

బతికుంటే అదే పదివేలన్నట్లుంది

జగన్‌ని చూసి జనం పరార్‌: లోకేశ్‌

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి దరిద్రపాదం ఎఫెక్ట్‌తో రైతు రాజ్యం సంగతి దేవుడెరుగు... రైతు బతికుంటే అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. జగన్‌రెడ్డి తన పాలనలో రైతులకు జరిగిన అన్యాయం, వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లడంపై తొలుత సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల మెడకు ఉరితాడు బిగించారన్నారు. సీఎం జగన్‌రెడ్డికి 17 ప్రశ్నలు సంధిస్తూ లోకేశ్‌ సోమవారం ఒక లేఖను విడుదల చేశారు. అందులో వ్యవసాయ, రైతు సంక్షేమ ఆధారిత వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ప్రశ్నలు సంధించారు. జగన్‌ దెబ్బకు జనం పరార్‌ అని ఎద్దేవా చేశారు. రైతుల్ని దగాచేసిన జగన్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనడానికి ఇంతకన్నా అధారాలు కావాలా?...అని సీఎం సభలో ఖాళీ అయిపోయిన కుర్చీల ఫోటోలు పెట్టి ప్రశ్నించారు.

Updated Date - 2022-05-17T08:27:06+05:30 IST