ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని పక్కాగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T06:17:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని డీఎంహెచ్‌వో శ్రీహరి ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని పక్కాగా అమలు చేయాలి
వైద్యులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో శ్రీహరి

తిరుపతి సిటీ, అక్టోబరు 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని డీఎంహెచ్‌వో శ్రీహరి ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యులతో శుక్రవారం సమీక్షించారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో ఒక డాక్టరు ఓపీ విధులకు.. మరో డాక్టరు కుటుంబ వైద్యుడి భావన కింద క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. క్షేత్రస్థాయి వైద్యులకు కేటాయించిన రోజున తప్పక మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎం.ఎం.యూ)లో వెళ్లి సచివాలయాలను సందర్శించి.. వైద్యసేవలను అందించాలన్నారు. ప్రతి ఎం.ఎం.యూలో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశాలతోపాటు వలంటీరు ఉండాలన్నారు. అలాగే సచివాలయాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ క్షేత్రస్థాయి వైద్య బృందం పేర్లను ప్రదర్శించాలన్నారు. ఈ బృందం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. మధ్యాహ్న సమయంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగుల  ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. అనంతరం పీహెచ్‌సీ వైధ్యాధికారులకు ప్రభుత్వం అందజేసిన మొబైల్‌ ఫోన్లను  పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ డీసీ డాక్టర్‌ రాజశేఖర్‌, డిప్యూటీ జిల్లా వైద్యాధికారులు హనుమంతరావు, సుధారాణి, వికాస్‌, డీఐవో శాంత కుమారి, పీవో హర్షవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T06:17:06+05:30 IST