కాన్పుకోసం వెళ్లి కోమాలోకి

ABN , First Publish Date - 2021-10-26T08:31:12+05:30 IST

: కాన్పుకోసం ఆస్పత్రికి వెళ్లిన ఆ గర్భిణి.. అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లింది. అంతే.. ఎనిమిది రోజులుగా కోమాలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..

కాన్పుకోసం వెళ్లి కోమాలోకి

  • ఆపరేషన్‌ తర్వాత విషమించిన బాలింత ఆరోగ్యం
  • ఎనిమిది రోజులుగా అపస్మారక స్థితిలోనే
  • వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆరోపణ


ఆళ్లపల్లి, అక్టోబరు 25: కాన్పుకోసం ఆస్పత్రికి వెళ్లిన ఆ గర్భిణి.. అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లింది. అంతే.. ఎనిమిది రోజులుగా కోమాలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సంతోష్‌, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో కాన్పుకోసం భాగ్యలక్షిని ఈ నెల 17న ఉదయం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిజేరియన్‌ చేయాల్సి ఉండడంతో.. వైద్యులు మరో పేషెంట్‌ కూడా వస్తారని, ఆ తర్వాత ఆపరేషన్‌ చేస్తామని చెప్పారు. అలా అర్ధరాత్రి ఒంటిగంట వరకు జాప్యం చేశారు. ఆ తర్వాత తీరిగ్గా.. కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగాడని, తల్లిని మాత్రం కాపాడవచ్చని చెప్పారు. అప్పటికప్పుడు సిజేరియన్‌ చేయగా.. బాబు పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాబు మృతిచెందాడు. భాగ్యలక్ష్మి ఆ తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు కూడా స్పృహలోకి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు సిబ్బందిని నిలదీశారు. దాంతో.. ఆపరేషన్‌ సమయంలో మత్తు ప్రభావం ఇంకా ఉందంటూ సర్దిచెప్పారు. ఉదయం 11 గంటల సమయంలో.. బాలింత పరిస్థితి విషమంగా ఉందని.. ఖమ్మం లేదా వరంగల్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.


108కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను సంప్రదించారు. దాంతో మధ్యాహ్నం 3 గంటలకు 108 వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని నిర్ధారించారు. మూడు రోజులు దాటినా ఆమె కోమా నుంచి బయటపడకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎనిమిది రోజులుగా భాగ్యలక్ష్మి కోమాలోనే ఉండగా.. ఆమె ఇద్దరు కూతుళ్లు తల్లి రాకకోసం ఎదురు చూస్తున్నారు. సిజేరియన్‌ చేయడంలో కొత్తగూడెం ఆస్పత్రి వైద్యుల జాప్యం, నిర్లక్ష్యమే భాగ్యలక్ష్మి ప్రాణాలపైకి తెచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-10-26T08:31:12+05:30 IST