కొవిడ్‌ మృతుల కుటుంబాలను గాలికొదిలేశారు

ABN , First Publish Date - 2021-06-17T07:10:01+05:30 IST

కరోనాతో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట బుధవారం టీడీపీ ఆందోళనలను చేపట్టింది.సమర్థవంతంగా పాలన చేయలేకపోతే ముఖ్యమంత్రి పదవినుంచి జగన్‌ తప్పుకోవాలని టీడీపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

కొవిడ్‌ మృతుల కుటుంబాలను గాలికొదిలేశారు
తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ ధర్నా

జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ ఫైర్‌

తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన


తిరుపతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : కరోనాతో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట బుధవారం టీడీపీ ఆందోళనలను చేపట్టింది.సమర్థవంతంగా పాలన చేయలేకపోతే ముఖ్యమంత్రి  పదవినుంచి జగన్‌ తప్పుకోవాలని  టీడీపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన  ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ కరోనా బాధితుల, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవకపోవడం బాధాకరమన్నారు.  కొవిడ్‌తో చనిపోయినవారందరికీ పరిహారం ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చి లెక్కలు చూపుతోందన్నారు. కరోనా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన చెందారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో కరోనా కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటుంటే రాష్ట్రంలో మాత్రం గాలికొదిలేశారని ఆరోపించారు. మరణాల లెక్కల్లో కూడా తేడాలున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బాధితులకు న్యాయం జరిగేవరకూ వారం పాటు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే చూడాల్సి ఉందన్నారు. అసమర్థ సీఎం జగన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి జోన్‌ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో పోరాడుతున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి ఆదుకోవాలన్నారు. తెలుగు యువత తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు రవినాయుడు మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌లో యువత ఎక్కువగా చనిపోతున్నారని ఆవేదన చెందారు. అన్న క్యాంటీన్లు ఉంటే ఇప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉండేవన్నారు. ఈసందర్భంగా ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేసి అఽధికారులకు వినతిపత్రం అందజేశారు.టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి, సూరా సుధాకర్‌ రెడ్డి, డాక్టర్‌ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, బుల్లెట్‌ రమణ, మహేష్‌ యాదవ్‌, చినబాబు, మునిశేఖర్‌ రాయల్‌, కేవీ రమణ, నాగరాజు, తిరుమల వెంకీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T07:10:01+05:30 IST