కనుమరుగవుతున్న సామ్యవాద స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-01-26T06:49:23+05:30 IST

ప్రతి రాజ్యాంగానికి ఒక తత్వం ఉంటుంది. భారత రాజ్యాంగ తత్వాన్ని స్పష్టంగా వ్యక్తీకరించేది ప్రవేశిక లేక పీఠిక. ప్రవేశిక భారత రాజ్యాంగానికి...

కనుమరుగవుతున్న సామ్యవాద స్ఫూర్తి

ప్రతి రాజ్యాంగానికి ఒక తత్వం ఉంటుంది. భారత రాజ్యాంగ తత్వాన్ని స్పష్టంగా వ్యక్తీకరించేది ప్రవేశిక లేక పీఠిక. ప్రవేశిక భారత రాజ్యాంగానికి పరిచయం వంటిది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆకాంక్షలను, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు మూలాధారం. 1976లో భారత రాజ్యాంగం 42వ సవరణ చట్టం తరువాత ప్రవేశికలో ఉన్న వాక్యములు ఇవి: ‘భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి  పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేర్చుకోవడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి హామీ ఇస్తూ 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగ పరిషత్తులో చర్చించి ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము’. ఈ ప్రవేశిక వల్ల భారత రాజ్యాంగం బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చే దానం కాదనీ, దీనిని భారత ప్రజల తరఫున రాజ్యాంగ పరిషత్ సభ్యులు రూపొందించారనీ, దీన్ని ‘భారత ప్రజలమైన మేము మాకు మేము... సమర్పించుకుంటున్నాము’ అనీ అర్థం వస్తుంది. ఇది మన సార్వభౌమాధికారాన్ని చాటుతుంది.


ప్రవేశికలోని పదజాలంలో ‘సామ్యవాదం’ ఒక ముఖ్యమైన భాగం. ఆర్థికంగా సామాజికంగా అసమానతలు లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం, సమ సమాజాన్ని స్థాపించడమే సామ్యవాదం. 1955లో నెహ్రూ చెన్నైకి సమీపాన గల ఆవడి భారత జాతీయ కాంగ్రెస్‌లో సామ్యవాద సమాజాన్ని లక్ష్యంగా పేర్కొన్నారు. సామ్యవాదం పట్ల ఆకర్షితులైన జాతీయ నాయకులలో నెహ్రూ ప్రముఖులు. రాజ్యాంగ రచనలోనూ ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద స్ఫూర్తి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో  బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, గరీబీ హటావో లను అమలు చేయడం జరిగింది. నేటి కాలంలో సామ్యవాద స్ఫూర్తి ఇసుమంతయినా కనిపించడం లేదు. ప్రైవేటీకరణ, సరళీకరణ, కార్పొరేటీకరణల విజృంభణ కొనసాగుతుంది. దీంతో ధనవంతులు ప్రపంచ ధనవంతుల జాబితాలో పైపైకి ఎగబాకుతుంటే పేదవారు తినడానికి తిండిలేక మరింత పేదవారిగా మారుతున్నారు. పాలకులు రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి సామాన్య ప్రజల సంక్షేమం గురించి ఎటువంటి చర్యలు చేపట్టకుండా, కార్పొరేట్ల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయడం బాధాకరం.


సామ్యవాదం మాత్రమే కాదు; ప్రవేశికలో ప్రధానంగా కనిపించే సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం... ఇవన్నీ కేవలం పదాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. రాజ్యాంగ భావనలుగా దేశంలో అమలుకు నోచుకోవటం లేదు. ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ చైతన్యాన్ని పెంపొందించుకొని, రాజ్యాంగ విలువల అమలును పరిశీలిస్తూ, సక్రమంగా అమలు జరిగేందుకు తనవంతు కృషి చేయాలి. అప్పుడే నిజమైన గణతంత్రం దినోత్సవం.

తండా సదానందం

Updated Date - 2021-01-26T06:49:23+05:30 IST