సమైక్య ప్రతిపక్షం తథ్యం

ABN , First Publish Date - 2021-07-28T08:21:20+05:30 IST

బీజేపీకి వ్యతిరేకంగా సమైక్య ప్రతిపక్ష కూటమి ఆవిర్భావం దానంతట అదే జరుగుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

సమైక్య ప్రతిపక్షం తథ్యం

పెగాసస్‌ వివాదంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: మమత

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీకి వ్యతిరేకంగా సమైక్య ప్రతిపక్ష కూటమి ఆవిర్భావం దానంతట అదే జరుగుతుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రతిపక్షాల ఐక్యత కోసం ఇప్పటినుంచే  సన్నాహాలు ప్రారంభం కావాలన్నారు. ప్రజలే ప్రతిపక్షాలను ఏకం చేస్తారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పెగాసస్‌ స్పైవేర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్రం పాత్రపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు.


ప్రధానితో తన భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని. రాజ్యాంగం ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులను తాను పాటించానని  చెప్పారు. బెంగాల్‌కు వాక్సిన్లు, మందుల సరఫరా గురించి చర్చించానని, పశ్చిమబెంగాల్‌ మార్చాలని కోరినట్లు చెప్పారు. ప్రధానమంత్రి తనతో మాట్లాడిన అన్ని విషయాలను బయటికి వెల్లడించకూడదన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కూడా తాను కలుసుకోవాలనుకున్నానని, కానీ, వారు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలన్నారని మమత చెప్పారు. తాను ఇప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకున్నానని తెలిపారు. కాగా, మమతను కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, అభిషేక్‌ సింఘ్వీ, ఆనంద్‌శర్మ కలుసుకుని దేశ రాజకీయ పరిస్థితులను వివరించారు. బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని మమత కలుసుకోనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సమాజ్‌ వాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ను కూడా కలుసుకుంటానన్నారు. 

Updated Date - 2021-07-28T08:21:20+05:30 IST