రష్యా మార్కెట్‌పై భారత ఔషధ కంపెనీల కన్ను

ABN , First Publish Date - 2022-06-24T06:47:32+05:30 IST

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా ఔషధ మార్కెట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత ఔషధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

రష్యా మార్కెట్‌పై భారత ఔషధ కంపెనీల కన్ను

త్వరలో రష్యాకు భారత బృందం

రెండు దేశాలదీ చిరకాల బంధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా ఔషధ మార్కెట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత ఔషధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రష్యాకు అవసరమైన ఔషధాలను సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుగుణంగా భారత ఫార్మా కంపెనీల ప్రతినిధుల బృందం త్వరలో రష్యా వెళ్లనుంది. అక్కడి కంపెనీలతో భారత కంపెనీల ప్రతినిధులు చర్చలు జరపనున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సిప్లా, హెటిరో, సన్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌ వంటి కంపెనీలకు రష్యా మార్కెట్‌తో బలమైన బంధాలు ఉన్నాయని ఫార్మాక్సిల్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ భాస్కర్‌ అన్నారు.


 రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం రష్యాలో తమ వ్యాపారంపై లేదని ఇటీవల డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. రష్యా మార్కెట్లో కొత్త ఔషధ బ్రాండ్‌లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రష్యా వ్యాపారం ద్వారా డాక్టర్‌ రెడ్డీ్‌సకు రూ.686 కోట్ల ఆదాయం లభించింది. ఏడాది క్రితం ఇదే కాలం తో పోలిస్తే ఇది 70 శాతం అధికం. రష్యా మార్కెట్లో డాక్టర్‌ రెడ్డీ్‌సకు మంచి వాటానే ఉంది. ఇది భవిష్యత్తులో పెరుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈఓ (ఇండియా,ఎమర్జింగ్‌ మార్కెట్స్‌) ఎంవీ రమణ వెల్లడించారు. 


గత ఏడాది రూ.4,500 కోట్ల ఎగుమతులు..

భారత ఔషధాలతో రష్యాకు చిరకాల పరిచయం ఉంది. ఔషధ రంగంలో భారత్‌ను రష్యా విశ్వనీయ భాగస్వామిగా భావిస్తుంది. భారత ఔషధాల ఎగుమతులకు రష్యా నాలుగో అతిపెద్ద మార్కెట్‌. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి రష్యాకు 60 కోట్ల డాలర్ల (దాదాపు రూ.4,500 కోట్లు) ఔషధాలు ఎగుమతి అయ్యాయి. యుద్ధానంతరం కూడా రష్యా మార్కెట్‌లో భారత ఔషధ కంపెనీలు మరింతగా విస్తరించడానికి ఈ అవకాశం దోహదం చేయగలదని సంబధిత వర్గా లు చెబుతున్నాయి. యాంటీ డయాబెటిక్‌, యాంటీ క్యాన్సర్‌, ఆటో ఇమ్యునో, యాంటీ రెట్రోవైరల్‌ ఔషధాల సరఫరాకు రష్యా కంపెనీలు ఎదురు చూస్తున్నాయని వివరించాయి. తాజా పరిణామాలతో రష్యాలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఔషధ కంపెనీలకు ట్రేడ్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా సూచించింది. 

Updated Date - 2022-06-24T06:47:32+05:30 IST