నిర్వాసితులను నిండా ముంచారు!

ABN , First Publish Date - 2021-10-06T06:21:17+05:30 IST

జాతినిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చి నిరాశ్రయులైన త్యాగధనులకు న్యాయం చేసే విషయంలో నమ్మకద్రోహానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పోలవరం నిర్వాసితుల పట్ల,  సర్వం కోల్పోయిన ఆ గిరిజనుల పట్ల...

నిర్వాసితులను నిండా ముంచారు!

జాతినిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చి నిరాశ్రయులైన త్యాగధనులకు న్యాయం చేసే విషయంలో నమ్మకద్రోహానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పోలవరం నిర్వాసితుల పట్ల,  సర్వం కోల్పోయిన ఆ గిరిజనుల పట్ల ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. నిర్వాసితులకు అదనంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటానని ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వారిని నిండా ముంచేసే నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం వాగ్దానాల వరద పారించారు. కానీ అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. అందలం ఎక్కడానికి నిర్వాసితుల ఓట్లు అవసరమయ్యాయి. కానీ వారి న్యాయమైన కోర్కెలు తీర్చాల్సి వచ్చినప్పుడు మాత్రం వారు మనుషుల్లా కనపడడం లేదు. ఇటీవ‌ల నిర్వాసిత గ్రామాల‌లో పర్యటించి వారి బాధలు స్వయంగా చూశాను. వారి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నాటి ప్రతిపక్ష నేత‌గా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల‌లో పర్యటించిన అనుభవాలను నేడు ముఖ్యమంత్రిగా జగన్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.


‘చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు రూ.19లక్షలు ఇస్తాం’ అన్నారు జగన్మోహన్ రెడ్డి. తరువాత రూ.10లక్షలు ఇస్తానని మాట మార్చారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10లక్షలు ప్యాకేజి, భూమి కోల్పోయిన వారికి భూమి, పోడు భూమి అయితే ప‌ట్టా భూమి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. భూమి లేనివారికి కూడా రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్నారు. ప్రతి కుటుంబంలో చదువుకున్నవారికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే కనీసం రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2005లో సేకరించిన భూములకు మానవతా దృక్పథంతో ఎకరాకు రూ.5లక్షలు పరిహారం ఇస్తానని, 18 సంవత్సరాలు నిండినవారికి పరిహారం ప్యాకేజీ ఇస్తాన‌ని, 39రకాల సౌకర్యాలతో నిర్వాసితులందరికీ అన్ని వసతులతో కాలనీలు నిర్మిస్తాననీ అన్నారు జగన్. జూన్ 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యడమే కాదు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తాన‌ని, గిరిజనుల న్యాయ బద్ధమైన డిమాండ్లను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. మరి ఈ రెండున్నరేళ్లలోనూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా ముఖ్యమంత్రి గారు?


నిర్వాసితుల సమస్య చిన్నదంటున్న మంత్రులు మరి ఆ చిన్న స‌మస్య ప‌రిష్కారానికి ఒక్క చిన్న ప్రయత్నమైనా ఎందుకు చేయలేదు? పోల‌వ‌రం నిర్వాసిత గ్రామాలైన 275 గ్రామాలకుగాను 9 గ్రామాల్లో మాత్రమే అరకొరగా పరిహారం అందించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణం. 41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితుల పరిహారం కోసం, పున‌రావాసం కోసం రూ.3,200 కోట్లు కావాల్సి ఉంటే రూ.550 కోట్లు విడుదల చేసి, అందులో వంద కోట్లను పక్కదారి పట్టించారు. జూన్ 2020 నాటికే 18 వేల మంది నిర్వాసితులను కాలనీల ఇళ్లలోకి పంపిస్తామన్న నీటిపారుద‌లశాఖ మంత్రి మాట‌లు నీటిమూట‌లుగా మిగిలిపోయాయి.


పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చెయ్యడానికి రూ.200 కోట్లు కేటాయించారు. కానీ వ‌ర‌ద‌ భయంతో పునరావాస శిబిరాలకు తరలి వచ్చిన నిర్వాసితుల‌కు మాత్రం కనీస వసతులు కల్పించలేదు. నిర్వాసితులకు ఒక కొవ్వొత్తి, రెండు బంగాళాదుంపలు ఇచ్చి అవమానించారు. ఉండ‌డానికి ఇళ్లు లేక‌, తాగ‌డానికి మంచి నీళ్లు లేక‌, విద్యుత్ సౌక‌ర్యం లేక, చీక‌ట్లో కంటిమీద కునుకు లేక నిర్వాసితులు నిత్యం సమస్యలతో స‌హ‌వాసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది ఎంత అన్యాయం? 


పోలవరం నిర్వాసితుల సమస్యలపై సానుభూతి చూపించాలని ‘పరిహారం, పునరావాస జాతీయ పర్యవేక్షణ కమిటీ’ ప్రభుత్వానికి సూచించింది. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించిన ‘జాతీయ ఎస్టీ కమిష‌న్’ ప‌రిహారం ఇవ్వటంలోనూ, పునరావాసం కల్పించటంలోనూ ప్రభుత్వం విఫలమైందని, ఇది గిరిజ‌నుల రాజ్యాంగ‌ హ‌క్కుల్ని కాల‌రాయ‌డ‌మేన‌ని ఆక్షేపించింది. నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్నారని ఆ కమిటీ పేర్కొన్నది. పోలవరం ముంపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కళ్ళముందే మునిగిపోతుంటే ప్రజలు ఎంత ఆవేదన చెందుతారో ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించింది. నిర్వాసితులను ఆదుకోవడంపై గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తాము చేసిన మేలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి.


పోలవరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైనది పునరావాసం. నిర్వాసితులు ఎక్కువమంది గిరిజనులే. ప్రాజెక్టు కింద 373 జనవాసాలు, లక్షకు పైగా జనాభా, లక్షన్నర ఎకరాలకు పైన పంటభూములు మునుగుతున్నాయి. పునరావాసం కల్పించడం, కోల్పోయిన భూమికి పరిహారం ఇవ్వడం, గిరిజనులకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం, పునరావాస కాలనీల్లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం రోడ్లు, మంచి నీరు, విద్యుత్తు, గుడి, బడి, శ్మశానం వంటి 39 రకాల సౌకర్యాలను కల్పించడం చేయాల్సి ఉంది. జీఓ641 ప్రకారం గిరిజనుల ఇళ్లకు రూ.4.55 లక్షలు కేటాయించాలి. కానీ ప్రభుత్వం 2.84 లక్షలతో సరిపెడుతున్నది. పునరావాస ప్రాంతాల్లో ఉపాధి కూడా ప్రశ్నార్థకం అయింది. వ్యవసాయ పనులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయేతర పనులు కూడా లేవు. నిర్వాసితులు ఉపాధి లేక అల్లాడి పోతున్నారు. 


2013 భూసేకరణ చట్టప్రకారం పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాస వ్యయం భారీగా పెరిగిన అంశాన్ని గుర్తించకుండా, అంచనాలు పెంచి అవినీతికి పాల్పడారని ప్రతిపక్షంలో వుండగా జగన్ చేసిన ఆరోపణలు, కేంద్రానికి రాసిన లేఖలు కూడా నిర్వాసితుల పుట్టి ముంచాయి. జగన్ అధికారంలోకి వచ్చాక భూ సేకరణ పరిహారానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం తగ్గించినా జగన్ నోరు మెదపలేదు. ఈ ప్రాజెక్టుకు పునరావాసం, భూసేకరణ వ్యయమే అధికం. ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని తెగ్గోసిన ఆర్థికశాఖ అందులో భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చులను పూర్తిగా తగ్గించింది. 


నిర్వాసితులకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, వాగ్దానం చేసిన విధంగా పునరావాసం, నష్టపరిహారం అమలు చేయటంపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే ప్రభుత్వానికి నిర్వాసితుల ప్రాణాలు అంటే ఎంత చిన్న చూపో, గిరిజనుల జీవితాలపై ఎంత నిర్లక్ష్యమో అర్థం అవుతుంది. నిర్వాసితులకు పునరావాసం, నష్ట పరిహారం బిక్ష కాదు. న్యాయబద్ధమైన హక్కు. ఆఖరి నిర్వాసితుని వరకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాకనే ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇప్పటికైనా పోల‌వ‌రం నిర్వాసితుల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. మాట తప్పనని, మడమ తిప్పనని చేసుకునే ప్రచారానికి క‌ట్టుబ‌డి జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలి. 


నారా లోకేష్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2021-10-06T06:21:17+05:30 IST