మార్చురీలో మృతదేహం మాయం

ABN , First Publish Date - 2020-05-23T10:07:26+05:30 IST

పోస్టుమార్టం కోసమని మార్చురిగదిలో ఉంచిన బాలుడి మృతదేహం తెల్లారిపాటికల్లా మాయమైన సంఘటన

మార్చురీలో మృతదేహం మాయం

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఘటన

కాసులకు కక్కుర్తిపడిన ఓ ఉద్యోగి

నిబంధనలు మీరి కుటుంబసభ్యులకు ఇచ్చిన వైనం

దవాఖానా నిర్వహణపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఖననం చేసిన బాలుడి మృతదేహం వెలికితీత 

వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు 


కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌/జూలూరుపాడు, మే 22 : పోస్టుమార్టం కోసమని మార్చురిగదిలో ఉంచిన బాలుడి మృతదేహం తెల్లారిపాటికల్లా మాయమైన సంఘటన కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం జరిగింది. జూలూరుపాడు మండలం బోజ్యాతండాలో శుక్రవారం జరిగింది. మండలంలోని బోజ్యాతండా గ్రామానికి చెందిన గుగులోత్‌ రాందాస్‌, మంగీ దంపతులకు శ్రీహరి, శివ అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే గురువారం తన చెప్పులను శివ వేసుకోవడంతో తన చెప్పులు ఎందుకు వేసుకున్నావంటూ అన్న శ్రీహరి మందలించాడు.


దీంతో వారిద్దరి మధ్య వివిదం జరిగి.. మనస్తాపానికి గురైన గుగుళోత్‌ శివ(13) మధ్యాహ్నం 12  గంటల సమయంలో పురుగుల మందు తాగాడు. శివ అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివ గురువారం మఽధ్యాహ్నం 2 గంటలకు మృతి చెందాడు. దీంతో వైద్యసిబ్బంది పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు గాను మృతదేహాన్ని మార్చురీకి తరలించగా.. రాత్రి సమయంలో మృతుడి కుటుంబసభ్యులు అక్కడి సెక్యూరిటీగార్డుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సదరు స్వీపర్‌ శివ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా.. కుటుంబసభ్యులు రాత్రికిరాత్రి బోజ్యాతండాకు తీసుకొచ్చి ఖననం చేశారు.


విషయం తెలుసుకున్న పోలీసులు బోజ్యాతండా వెళ్లి తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ సమక్షంలో శివ మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించి.. మళ్లీ మృతదేహాన్ని పూడ్చి పెట్టించారు. ఈ మొత్తం వ్యవహారంపై పాపకొల్లు వీఆర్వో ఈసాల రవీందర్‌ ఫిర్యాదుతో జూలూరుపాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే బాలుడి తల్లిదండ్రుల బాధను చూడలేకే తాను మానవతా దృక్పథంతో మృతదేహాన్ని వారికి అప్పగించినట్టు సదరు ఉద్యోగి అధికారులకు తెలిపినట్టు సమాచారం. 


ఆసుపత్రి వర్గాల్లో కలవరం.. 

తెల్లారితే పోస్టుమార్టం చేయాల్సిన బాలుడి మృతదేహం మార్చరీ గదిలో కనబడకపోవడంతో ఆసుపత్రి వర్గాల్లో కలవరం మొదలైంది. అయితే విచారణ చేస్తున్న క్రమంలో బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బందే కాసులకు కక్కుర్తి పడి కుటుంబ సభ్యులకే అందజేశారని తెలిసింది. ఇలా అనధికారిక చర్యకు పాల్పడిన ఆ ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. ఆసుపత్రిలో సరైన పర్యవేక్షణ, నిఽఘా లేవడానికి ఈ ఘటనే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  


సూపరింటెండెంట్‌ ఏమన్నారంటే.. 

ఈ ఘటనపై స్పందించిన కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ మాట్లాడుతూ బాలుడి మృతదేహం మాయమైన సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. అనంతరం ఈచర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-05-23T10:07:26+05:30 IST