భయపెడుతున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-21T05:46:57+05:30 IST

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

భయపెడుతున్న కరోనా
గద్వాల మార్కెట్‌యార్డులో మాస్కు ధరించకుండా గుంపులుగా ఉన్న జనం (ఫైల్‌)

- రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి 

- 16 రోజుల్లో 37,444 పరీక్షలు, 588 కేసులు

- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలు 

- అప్రమత్తంగా ఉండాలన్న వైద్య సిబ్బంది

గద్వాల క్రైం, జనవరి 20 : ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల నాలుగవ తేదీ నుంచి ఇప్పటి వరకు 588  కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ మొదటి, రెండవ వేవ్‌ సందర్భంగా ప్రజల్లో ఉన్నంత భయం ఇప్పుడు లేకపోవడంతో వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్యు లు, అధికారులు ఎంతగా చెప్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం మాస్కులు కూడా సరి గా ధరించడం లేదు. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమైక్రాన్‌ బాధితులే ఉన్నట్లు తెలుస్తోంది. 


జనవరి నాలుగు నుంచి ...

గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈనెల నాలుగో తేదీ నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. మొదట ఒక్కటితో ప్రారంభమైన కేసుల సంఖ్య ప్రస్తుతం రోజూ 150 వరకు నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు 37,444 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 588 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో ఏడుగురు ఐసోలేషన్‌ వార్డులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశ మున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కావా లని చెప్తున్నారు. అలాగే అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచిస్తున్నారు. 


26 లోగా లక్ష్యం పూర్తి

ఈ నెల 26 లోగా వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ తెలిపారు. మొదటిడోస్‌ వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్త య్యిందని, రెండవడోస్‌ 3,11,833 మంది వేయించుకు న్నారని, 68 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని తెలిపారు. అలాగే టీనేజర్లు (15-18) 28,838 మంది టీకా వేయించుకున్నారని, వ్యాక్సినేషన్‌ 74.94 శాతం పూర్తయ్యిందని తెలిపారు. అలాగే బూస్టర్‌ డోస్‌ ఇప్ప టివరకు 3,806 మంది వేయించుకున్నారని తెలిపారు. 


ప్రజలందరు మాస్కులు ధరించాలి 

    కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. మొదటి డోసు, రెండవ డోసుతో పాటు సకాలంలో బూస్టర్‌ డోస్‌ వేయించుకోవడం మరచిపోవద్దు. విందులు, వినోదాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలి. జిల్లాలో కరోనా నివారణకు ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలి.

- డాక్టర్‌ చందూనాయక్‌, డీఎంహెచ్‌వో


Updated Date - 2022-01-21T05:46:57+05:30 IST