ఉపాధి లక్ష్యం రూ.771 కోట్లు

ABN , First Publish Date - 2021-04-14T05:42:29+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఉపాధి లక్ష్యం రూ.771 కోట్లు

1.88 కోట్ల పనిదినాలు కల్పన

వార్షిక లక్ష్యం ఖరారు


కడప, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 771.09 కోట్లు ఖర్చు చేయాలని వార్షిక నివేదికను లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.581.19 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం కాగా 668.83 కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూర్లకు రావడంతో గత ఏడాది స్థానికంగా వారికి ఉపాధి కల్పించారు.


1.88 కోట్ల పనిదినాలు

జిల్లాలో 5.78 లక్షల జాబ్‌కార్డులున్నాయి. 3,63,135 జాబ్‌కార్డులు మాత్రమే యాక్టివేషన్‌లో ఉన్నాయి. 30,130 శ్రమశక్తి సంఘాల్లో ఉండగా వాటిలో 5,31,069 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,88,084 పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది 1,49,081 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధి కూలీలకు రోజూ ఇచ్చే రేట్లు కూడా పెరిగాయి. రూ.245 ఇవ్వనున్నారు. వేసవి దృష్ట్యా ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా అలవెన్స్‌ ఇస్తారు. 


కూలీల సమీకరణ పై దృష్టి

ఉపాధి నిధులను వీలైనంతగా ఉపయోగించుకోవాలంటే ఏప్రిల్‌, మే మాసాలు కీలకం. వ్యవసాయ పనులు పూర్తవడంతో రోజుకు 1.50 లక్షల నుంచి 2 లక్షల మధ్య కూలీలకు పని కల్పించాల్సి ఉంది. ఎంత  పెద్ద సంఖ్యలో కూలీలు రోజూ పనికి హాజరైతే నిధులు బాగా వినియోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, పాఠశాల ప్రహరీగోడల నిర్మాణాలు ఉపాధి నిధులతోనే చేపడుతున్నారు. దీంతో పాటు జల సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. మండలాల వారీగా ఏ మండలాల్లో ఎంత ఖర్చు చేయాలో లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 


లక్ష్యాన్ని సాధిస్తాం 

- యధుభూషణ్‌రెడ్డి, డ్వామా పీడీ

సమిష్టి కృషితో గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి ఖర్చు చేశాం. ఈ సంవత్సరంలో కూడా కలిసికట్టుగా పనిచేసి లక్ష్యం పూర్తి చేసి జిల్లాలో ప్రగతి చూపుతాం. జాబ్‌కార్డు ఉన్న వారికి, ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం. మండల స్థాయిలో కూలీల హాజరుపై టార్గెట్‌ ఇచ్చాం.





Updated Date - 2021-04-14T05:42:29+05:30 IST