స్వర్ణ కాంతుల విద్యుత్ వాహిని

ABN , First Publish Date - 2020-10-29T06:23:47+05:30 IST

పెను సంక్షోభాలను, మౌలిక సంస్కరణలను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచి జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు పొందిన...

స్వర్ణ కాంతుల విద్యుత్ వాహిని

సిరిసిల్లలోని ఐదు దశాబ్దాల ‘సహకార విద్యుత్ సరఫరా సంఘం’ ( సెస్) ఒక అద్వితీయ విజయ గాథ. ఈ సంస్థ సాధన, స్థాపన వెనుక అప్పటి సిరిసిల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు దీక్షాదక్షతలు ఎన్నదగినవి. సెస్ సేవల మూలంగా రైతుల, రైతుకూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. రెండో షోలాపూర్‌గా ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల పట్టణంలోని చేనేత, అనుబంధ రంగాలూ విశేషంగా లబ్ధి పొందాయి. పవర్ లూమ్ పరిశ్రమలకు 50 శాతం విద్యుత్ రాయితీ కల్పించడం వల్ల నేతన్నల కుటుంబాల బతుకులు సుభిక్షంగా ఉన్నాయి. 


పెను సంక్షోభాలను, మౌలిక సంస్కరణలను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచి జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు పొందిన సంస్థ సిరిసిల్లలోని ‘సహకార విద్యుత్ సరఫరా సంఘం’ (కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ-సెస్). ఈ నవంబర్ 1న 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సెస్ సహకార రంగంలో విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేయడంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. 1969 అక్టోబర్‌లో సహకార సంఘాల చట్టం పరిధిలో సెస్‌ను రిజిస్టర్ చేశారు. 1970 నవంబర్ 1 నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సెస్ ఆవిర్భావ నేపథ్యం, సమున్నత సేవాచరిత్ర తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. ప్రజల సహకార స్ఫూర్తికి తలమానికంగా నిలిచిన సంస్థ గురించి చెప్పడం ఒక అనివార్య అవసరమని భావిస్తున్నాను.


భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నదని, దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అని గాంధీజీ చెప్పారు. మహాత్ముడి స్ఫూర్తితో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాల ఉన్నతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ’ (ఆర్.ఇ.సి)ను ప్రారంభించింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 5 గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలను స్థాపించారు. ఈ సహకారోద్యమంలో భాగంగా సిరిసిల్లలో ‘సహకార విద్యుత్ సరఫరా సంఘం’ ఏర్పాటయింది. ఇది అప్పటి సిరిసిల్ల తాలూకా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13 మండలాలు 2 మునిసిపాలిటీలలో తన కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఈ ప్రాంతం 2019 చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగి సముద్ర మట్టానికి 322 మీటర్ల ఎత్తులో ఉంది. కరీంనగర్ జిల్లాలో అత్యంత ఎత్తైన ప్రదేశం కావడంతో సిరిసిల్లలో సెస్‌ను ప్రారంభించడం సజావుగా జరిగింది.


సెస్ సాధన, స్థాపన వెనుక అప్పటి సిరిసిల్ల శాసనసభ్యులు రాజనీతిజ్ఞుడు చెన్నమనేని రాజేశ్వరరావు దీక్షాదక్షతలు ఎన్నదగినవి. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి సెస్ వంటి సంస్థను తీసుకురావడం అంత సులభ కార్యం కాదు. సంస్థ మనుగడలో తదనంతర శాసన సభ్యులు జె. నర్సింగరావు, గొట్టె భూపతిల పరిపాలనా సామర్థ్యాలు, అప్పటి నిస్వార్థ అధికారులు, ఉద్యోగులు కీలక భూమిక వహించారు (ఈ సందర్భంగా విధి నిర్వహణలో మరణించిన సంస్థ ఉద్యోగుల త్యాగాలను తప్పక స్మరించుకోవలసిన అవసరముంది). ఐదు దశాబ్దాలుగా సెస్ ఎదురు లేకుండా నిలబడడానికి కారణం వారి పటిష్ట కార్యాచరణ ప్రణాళికలే అని చెప్పవచ్చు. నాటి రాష్ట్ర విద్యుత్ బోర్డు నుండి కేవలం 4720 సర్వీసులు సంస్థకు దఖలుపడగా నేడు ఆ సంఖ్య వివిధ కేటగిరీలలో కలిపి 2,55,830 కనెక్షన్లకు చేరుకోవడమే దానికి నిదర్శనం. ఇందులో 76,306 వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. తొలినాళ్ళలో కేవలం 2299 వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. సెస్ విజయగాథలో సభ్యులు,- వినియోగదారులు అత్యంత కీలక పాత్ర వహించారు. నేడు సభ్యుల సంఖ్య 2,97,708. వీరి వాటా ధనం 6,14,81,587 రూపాయలు. దీన్ని బట్టి సంస్థ ఆర్థిక, హార్దిక పురోగతిలో సభ్యుల సహాయ సహకారాలు అనితర సాధ్యమైనవని స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రారంభంలో విద్యుత్ లైన్ల నిర్మాణంలో, ట్రాన్స్ ఫార్మర్ల స్థాపనలో, పని ప్రదేశాలకు సామగ్రి రవాణా చేయడంలో వీరి స్వచ్ఛంద శ్రమ దానం ఇమిడి ఉంది. దాదాపు 1995 వరకు సాగిన వారి శ్రమదానం విలువ కోటిన్నర రూపాయలకు పై మాటే. 


సహకార రంగంలో సెస్ పురోగతిని పరిశీలిస్తే– సగటు తలసరి విద్యుత్ వినియోగం దాదాపు పదహారు వందల యూనిట్లు. అదే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తలసరి విద్యుత్ వినియోగం 1268 యూనిట్లు మాత్రమే. ఉద్యోగుల విషయానికి వస్తే సంస్థ పరిధిలో 666 సర్వీసులకు ఒకే ఒక ఉద్యోగి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. అదే ఎన్‌పిడీసీఎల్‌లో 586.45 సర్వీసులకు ఒక ఉద్యోగి తన సేవలను అందిస్తున్నాడు. సంస్థ సాధించిన పురోగతిని, సేవలను, వినియోగదారుల ఔదార్యాన్ని, సౌకర్యాలను వివరించడం కోసమే ఈ పోలిక. 


సహకార రంగంలో విద్యుత్ పంపిణీ సంస్థ కాబట్టి సెస్ గతంలోనూ, ఇప్పుడూ విద్యుత్‌ను అప్పటి విద్యుత్ బోర్డు నుంచి, ఇప్పటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కొనుగోలు చేసి వివిధ కేటగిరీల్లోని  వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును విక్రయిస్తోంది. కొనుగోలు చేసే విద్యుత్ టారీఫ్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రతి సంవత్సరం నిర్ణయిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1999లో ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ నియంత్రణ మండలి (ఇ.ఆర్.సి) నిబంధనలు, ఆదేశాలకు లోబడే సెస్ పని చేస్తుంది


విద్యుత్ సరఫరా రంగంలో సెస్ సాఫల్యాలకు సంతృప్తి పడిన నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలలో 13 సహకార విద్యుత్ సరఫరా సంఘాలను స్థాపించాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక్క సంస్థ (అది సెస్ అని మరి చెప్పాలా?) మిగిలిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. నష్టాల పాలైన మిగతా 8 సంస్థలను సంబంధిత విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో విలీనం చేశారు. ఉద్యోగ వర్గాలకు, పాలక వర్గాలకు వినియోగదారులకు మధ్యన గల అవినాభావ సంబంధ బాంధవ్యాలు, సహకార మమకారాల వల్లనే సెస్ గత 50 సంవత్సరాలుగా తన విజయ యాత్రను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంస్థ చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు టారిఫ్‌ను 2019–20 సంవత్సరానికి యూనిట్‌కు రూ.4.50 రూపాయలుగా నిర్ణయించడంతో సంస్థ నిర్వహణ కొంచెం ఇబ్బంది లో పడింది. ఈ టారిఫ్‌లో వ్యవసాయ రంగంలో వినియోగించిన యూనిట్లను మినహాయించుకుని విద్యుత్ కొనుగోలు మొత్తాన్ని చెల్లించాలి. సంస్థ విద్యుత్ కొనుగోళ్లలో 75శాతం వ్యవసాయ రంగానికి వినియోగం అవుతున్నది. మిగతాది పరిశ్రమలకు, నేత కుటీర పరిశ్రమలకు, గృహాలకు, గృహేతర కేటగిరీలకు 15 శాతం విద్యుత్ వినియోగమవుతోంది. మిగతా 10 శాతం సాంకేతిక విద్యుత్ పంపిణీ నష్టాలుగా నమోదు జరుగుతున్నది. ప్రస్తుతం సంస్థ ఆర్థిక స్థితిగతులు సజావుగానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు విడుదలైతే సంస్థ జీవనం చెక్కుచెదరదు. అయితే సంస్థ చొక్కం బంగారమా అంటే కొంచెం కేటు కలిసిందనే వేదనతో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గత రెండు పాలకవర్గాల పనితీరు, ఆర్థిక వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెల్లు వెత్తాయి. కొన్నిటిపై విచారణలు కొనసాగాయి. హైకోర్టులో ఒక కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. 


సెస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా వినియోగదారుల సహకారంతో దిగ్విజయంగా సాగిపోతున్నది. ఈ సంస్థ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తత్కారణంగా సెస్‌కు తగిన వనరులు, సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. వేములవాడ నియోజకవర్గానికి సంస్థ వ్యవస్థాపకులు చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాక్షికంగా ఒక్కొక్క మండలం మాత్రమే మిగతా ఇద్దరు శాసనసభ్యుల పరిధిలో ఉన్నాయి. అందువలన సిరిసిల్ల, వేములవాడ శాసనసభ్యులు సంస్థకు కండ్లు చెవులుగా జాగరూకతతో పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌కు సెస్ విషయమై మంచి అవగాహన ఉండడం అదనపు మేలు. రాష్ట్ర టెస్కాబ్ అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు సిరిసిల్ల ప్రాంతం వారు కావడం సంస్థకు విశేష ప్రత్యేక ఆకర్షణ. సెస్ విజయసోపానాల అధిరోహణలో ప్రధాన భూమిక వినియోగదారులది. అయితే రాజకీయ నాయకులూ ప్రభావశీల పాత్ర వహించారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సెస్ ఐదు దశాబ్దాల విజయపరంపరను దృష్టిలో ఉంచుకొని ఆ సంస్థ సేవలను మరి కొన్ని ప్రాంతాల కు విస్తరింపచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రాకృతిక, సాంకేతిక, విద్యుత్ అంతరాయాలను ఉద్యోగులు ఎప్పటికప్పుడు వేయి కళ్లతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పరిష్కరిస్తుంటారు. అందుకని సంస్థ గత పనితీరును దృష్టిలో ఉంచుకొని, శాసనసభ్యులు ముఖ్యంగా మంత్రి కేటీఆర్ శ్రద్ధ వహిస్తే సంస్థ సేవలను ఇరుగు పొరుగు ప్రాంతాలకూ అందించడం సుసాధ్యమవుతుంది. దీనివలన వినియోగదారులకు, ఉద్యోగులకు మరింత ఉత్సాహం కలగడమే కాక సెస్ ఆర్థిక పరిస్థితులు పరిపుష్టమయ్యేందుకు అనుకూల వాతావరణం సుగమం అవుతుంది. సెస్ సేవల మూలంగా రైతుల, రైతు కూలీల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. రెండో షోలాపూర్‌గా ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల పట్టణంలోని నేత రంగం, అనుబంధ రంగాలూ విశేషంగా లబ్ధి పొందాయి. పవర్ లూమ్ పరిశ్రమలకు 50 శాతం విద్యుత్ రాయితీ కల్పించడం వలన చేనేత కుటుంబాల బతుకులు మరింత సుభిక్షంగా ఉన్నాయి. సెస్ మనుగడ మరో రెండు యాభైల పాటు అద్వితీయంగా కొనసాగాలి

జూకంటి జగన్నాథం

(నవంబర్ 1: ‘సెస్’‌కు యాభై వసంతాలు)


Updated Date - 2020-10-29T06:23:47+05:30 IST