‘మునుగోడు’ ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉండదు

ABN , First Publish Date - 2022-08-10T09:41:36+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉండదని, అభ్యర్థి ఎంపిక కీలక అంశమని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

‘మునుగోడు’ ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉండదు

బీజేపీ ఒత్తిడితోనే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

కాంట్రాక్టులిచ్చాం.. పార్టీ మారాలని బలవంతం 

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి


నల్లగొండ,  ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉండదని, అభ్యర్థి ఎంపిక కీలక అంశమని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అనేక పరిణామాలు, అప్పటి పరిస్థితులను బట్టి ఉప ఎన్నిక ఫలితాలు ఉంటాయని, సాధారణ ఎన్నికలు ఇందుకు భిన్నమని పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. కాంట్రాక్టు అవసరాల కోసం రాజగోపాల్‌ బీజేపీలో చేరారని, పని పూర్తి చేశామని బీజేపీ ఒత్తిడి చేయడంతో రాజీనామా చేశాడని తాను భావిస్తున్నట్లు గుత్తా తెలిపారు. ‘‘రాజగోపాల్‌ రాజీనామాకు బలమైన కారణం లేదు. ఉప ఎన్నికలో గెలవలేనని ఆయనకు స్పష్టంగా తెలుసు. నిన్నటిదాకా రాజగోపాల్‌రెడ్డి స్వేచ్ఛా జీవి.


ఈ నెల 21 తర్వాత అన్నీ బంద్‌. ఇప్పటివరకు వేదికలపైనే కూర్చున్న ఆయన కాషాయ కండువా కప్పుకొన్న తర్వాత వేదిక కిందే కూర్చోవాల్సి వస్తుంది’’ అని గుత్తా పేర్కొన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ ఓట్లను 20 నుంచి 30 శాతం వరకే రాజగోపాల్‌ ప్రభావితం చేయగలరని.. వామపక్షాలకు నికరంగా 15 వేల ఓట్లు ఉంటాయని సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ‘‘కోమటిరెడ్డి సోదరులు వారికి వారు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యేగా వెంకట్‌రెడ్డి ఓడిపోయారు. ఇన్నాళ్లూ కాంగ్రె్‌సలో ఉన్నవారికి వారసత్వ రాజకీయాలు,  అభివృద్ధి గుర్తుకు రాలేదా?’’ అని గుత్తా ప్రశ్నించారు. ఎంపీ వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ‘కుటుంబం కలిసే ఉంటుంది, మా బంధం బలమైనదని’ రాజ్‌గోపాల్‌ పదేపదే చెబుతున్నారు కదా? అని సమాధానమిచ్చారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ నుంచి వెళ్లిపోవాలని రేవంత్‌రెడ్డి కోరుకున్నారు. ఆయన తీరును ఆ పార్టీ సీనియర్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రాస్‌ కట్‌లో వచ్చిన రేవంత్‌  గురించి దాసోజు శ్రవణ్‌ వాస్తవాలు మాట్లాడారు’’ అని గుత్తా పేర్కొన్నారు.


రేవంత్‌, సంజయ్‌ ఎవరొచ్చినా ఘోరాలే

రేవంత్‌ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఘోరాలు జరుగుతాయని రాజగోపాల్‌ చెబుతున్నారో బండి సంజయ్‌ వచ్చినా అదే జరుగుతుందని గుత్తా అన్నారు. మరోసారి కేసీఆర్‌ సీఎం అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా దేశం లౌకికంగా ఉంటుందన్నారు. 

Updated Date - 2022-08-10T09:41:36+05:30 IST