Advertisement
Advertisement
Abn logo
Advertisement

సజావుగా లేని సామాన్యుల ఆర్థికం

ఆర్థికవ్యవస్థలో కొన్ని రంగాల పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఆమ్‌ఆద్మీ అవస్థలు యథాతథంగా ఉన్నాయి. స్వల్ప ఆదాయపరులు అయిన సగటు పౌరులకు ఆర్థిక సహాయమందించడం ప్రభుత్వ విధ్యుక్తధర్మం. ఈ కర్తవ్య నిర్వహణకు గాను వారికి నేరుగా నగదు బదిలీ చేయాలి.


మనబ్యాంకింగ్ రంగం పరిస్థితి ఇప్పుడు భవ్యంగా ఉంది. భావి పరిణామాలపై నిర్దిష్ట హెచ్చరికలూ స్పష్టంగా ఉన్నాయి. నిర్మాణరంగం, చిన్న పరిశ్రమలు, పౌర విమానయానరంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నివేదిక పేర్కొంది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్‌ల వ్యాపారం నిలిచిపోయిందని ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక దుకాణదారుడు చెప్పాడు. రుణగ్రహీతలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసివస్తుందనే భయంతో తమ వ్యక్తిగత వ్యయాలను తగ్గించుకుని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు విశేష ప్రాధాన్యమిస్తున్నారని మరొకరు చెప్పారు. అప్పు తీసుకున్న సమయంలో భావి తేదీ వేసి ఇచ్చిన చెక్‌లను రుణగ్రహీతలు సొమ్ము చేసుకోలేకపోతున్నారని ఇంకొకరు చెప్పారు. తన క్లయింట్‌ల వ్యాపారం 30 శాతం తగ్గిపోయిందని ఫరీదాబాద్‌కు చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ పేర్కొన్నాడు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రిటర్న్స్ దాఖలు చేసేందుకు గతంలో రూ.1000 చెల్లించిన చిన్న వ్యాపార సంస్థల వారు ఇప్పుడు ఆరు లేదా ఏడు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఇంచుమించు 10 శాతం తగ్గిపోతుందని పలు అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 


ఏతావాతా మన ఆర్థికవ్యవస్థ పరిస్థితి విషయమై రెండు ప్రతికూల సూచకాలను మనం ఎదుర్కొంటున్నాం. ఒకపక్క ప్రపంచ సంస్థల, క్షేత్రస్థాయి నివేదికలు మన ఆర్థికమూ, బ్యాంకింగ్ రంగమూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. మరో పక్క మన ప్రధాన బ్యాంకులు లాభాలను ఆర్జిస్తున్నాయి. సెన్సెక్స్ రికార్డుస్థాయిలో ఊర్థ్వదిశలో దూసుకుపోతోంది. 


ఈ ఆర్థిక పరిణామాలు నిగూఢంగా ఉన్నాయి కదూ. రుణాల మంజూరు తీరుతెన్నులు ఈ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. మన బ్యాంకులు తాము మంజూరు చేసిన మొత్తం రుణాలలో 33 శాతం బడా కార్పొరేట్ సంస్థలకు, 33 శాతం వేతన ఆదాయపరులకు, 33 శాతం అంతర్జాతీయ రుణగ్రహీతలకు, 12 శాతం చిన్న వ్యాపార సంస్థలకు, 9 శాతం వ్యవసాయరంగానికి ఇచ్చాయి. కరోనా మహమ్మారి ఉపద్రవంలోనూ బడా కార్పొరేట్ సంస్థలూ, అంతర్జాతీయ రుణగ్రహీతలూ, వ్యవసాయరంగం పరిస్థితి సజావుగా ఉన్నందునే రుణాల మంజూరులో ఆ రంగాలకు ప్రాధాన్యం లభించింది. చిల్లర వర్తకమూ, చిన్న పరిశ్రమల రంగాలకు ఎలాంటి రుణ సదుపాయం లభించిందో నిశితంగా పరిశీలించవలసిన అవసరమున్నది. 


వేతన ఆదాయపరులకు మంజూరు చేసిన రుణాలలో ప్రధానమైనవి వాహన రుణాలు. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఈ రుణాలలో 80 శాతం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ఇచ్చారు. వేతన ఆదాయపరులకు ఇచ్చిన రుణాలలో వ్యక్తిగత రుణాలూ రెండోస్థానంలో ఉన్నాయి. ఈ రుణాలలోనూ 94 శాతం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకే ఇచ్చారు. గృహరుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. యాభై శాతం గృహ రుణాలను ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకే ఇచ్చారు. బడా కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు 20 శాతం గృహరుణాలు ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల సిబ్బంది సంఖ్య ఇంచుమించు రెండు కోట్లు. వారి కుటుంబసభ్యులనూ పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిదికోట్లుగా ఉంటారు. మరి దేశ జనాభా 135 కోట్లలో వీరిని మినహాయిస్తే మిగతా 127 మంది కోట్లలో అత్యధికుల పరిస్థితి సంతృప్తికరంగా లేదని చెప్పక తప్పదు. 


మరి ‘సామాన్య మానవుని’ (ఆమ్‌ఆద్మీ) మాటేమిటి? ఆ మాటకొస్తే ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగుల మాటేమిటి? ఈ వర్గాల వారికి బ్యాంకులు మంజూరు చేసిన రుణాల శాతం సాపేక్షంగా తక్కువే. మహమ్మారి కాలంలోనూ ప్రభుత్వరంగ సంస్థల సిబ్బంది ఆదాయాలు నిలకడగా ఉండడం వల్లే రుణాల మంజూరులో వారికి ప్రాధాన్యం లభించింది. వేతన ఆదాయపరులకు ఇచ్చిన రుణాల వల్ల బ్యాంకులు ఎటువంటి దురవస్థకు లోనుకాలేదు. 


క్షేత్రస్థాయి నివేదికలకు విరుద్ధంగా చిన్న పరిశ్రమలకు రుణాల మంజూరు వల్ల బ్యాంకులు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాలేదు. సాధారణంగా నిర్మాణరంగం, పర్యాటకం, కోచింగ్ రంగాలలోని చిన్నసంస్థలు బ్యాంకు రుణాల చెల్లింపును ఎగవేసే అవకాశముందనే అభిప్రాయం ఒకటి గట్టిగా ఉంది. అయితే ఈ రంగాలకు చెందిన చిన్న సంస్థలు ఏవీ అలా వ్యవహరించలేదు. ఇందుకు కారణాలు ఏమిటో చూద్దాం. ఒకటి- ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు బ్యాంకు రుణాల పునఃచెల్లింపులపై ప్రభుత్వం ఉదారంగా మారటోరియం విధించింది. రుణగ్రహీతలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని, ఆ కాలంలో తమ ఆర్థికాన్ని మెరుగుపరచుకున్నారు. ఆ తరువాత తమ రుణాలను సంపూర్ణంగా చెల్లించగలిగారు. రెండు- రుణాల పునఃచెల్లింపు గడువు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని రిజర్వ్ బ్యాంకు సూచించింది. దీంతో చెల్లింపు గడువును పొడిగించడం జరిగింది. మూడు- చిన్న వ్యాపార సంస్థలకు అదనపు బ్యాంకురుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చింది. ప్రభుత్వ భరోసాతో చిన్న వ్యాపారసంస్థలు అదనపు రుణాలు తీసుకుని తమ వ్యాపారాలను చక్కదిద్దుకోవడం, పటిష్ఠపరచుకోవడం జరిగింది. ఈ చర్యల కారణంగా స్వల్ప రుణాల గ్రహీతలు సక్రమంగా తిరిగి చెల్లించకపోవడమనే పరిస్థితి సమస్యాత్మకంగా పరిణమించలేదు. 


ఈ చర్చ విశదం చేస్తున్నదేమిటి? భారత ఆర్థిక వ్యవస్థ రెండు విభాగాలుగా విభజితమయింది. ఒక విభాగంలో మంచి ఫలితాలను సాధిస్తున్న రంగాలు ఉన్నాయి. కార్పొరేట్‌సంస్థలు, అంతర్జాతీయ రుణ గ్రహీతలు, వ్యవసాయరంగం ఈ విభాగంలోకే వస్తాయి. వాటి వృద్ధిరేట్లు ప్రగతిశీ లంగా ఉన్నాయి. చిల్లర వర్తకరంగం పరిస్థితి సజావుగా ఉంది. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల ఆదాయాలు నిలకడగా ఉండడం ఈ రంగం సజావుగా విలసిల్లేందుకు విశేషంగా దోహదం చేసిందని చెప్పవచ్చు. చిన్న పరిశ్రమలరంగం చిక్కులను ఎదుర్కోవడం లేదని చెప్పలేము. అయితే ఆ చిక్కులేవీ ప్రస్తుతానికి సమస్యాత్మకంగా పరిణమించలేదు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు చేపట్టిన వివిధ చర్యల వల్ల చిన్న పరిశ్రమల రంగం ప్రస్తుతానికి సంక్షోభ రహితంగా కన్పిస్తోంది. ఇంతకూ సామాన్య మానవుని పరిస్థితి మాటేమిటి? ఆమ్ ఆద్మీ అవస్థలు యథాతథంగా ఉన్నాయని అంగీకరించక తప్పదు. ప్రభుత్వ కర్తవ్యమేమిటి? తమ దురవస్థలను ఎటువంటి ఆక్షేపణ లేకుండా అంగీకరించేలా ఆమ్ ఆద్మీని ప్రభుత్వం ఒప్పించగలుగుతుందా? ఒప్పించలేదు. అసలు ప్రభు త్వపరంగా అలాంటి ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధమేకాదు, అనైతికం కూడా. స్వల్ప ఆదాయపరులు అయిన సగటు పౌరులకు ఆర్థిక సహాయమందించాలి. ఇది ప్రభుత్వ విధ్యుక్త ధర్మం. ఈ కర్తవ్యనిర్వహణకు గాను వారికి నేరుగా నగదు బదిలీ చేయాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త,బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...