5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే

ABN , First Publish Date - 2022-08-16T06:20:40+05:30 IST

మరో ఆరేళ్లలో (2028-29 ఆర్థిక సంవ త్సరం నాటికి) భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం పెద్ద కష్టంకాదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే

జీడీపీ ఏటా 9% చొప్పున పెరిగితేనే..

ఉపాధి కల్పనకు ‘తయారీ’ రంగమే మేలు

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు


హైదరాబాద్‌: మరో ఆరేళ్లలో (2028-29 ఆర్థిక సంవ త్సరం నాటికి) భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం పెద్ద కష్టంకాదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కాకపోతే ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో మన జీడీపీ ఏటా 9 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్‌ ఎనిమిది సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. పెట్టుబడులు, ఉత్పాదకత, విద్య, వైద్య సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, స్థూల ఆర్థిక స్థిరత్వం, పాల నా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, అంతర్జాతీయ ఆటుపోట్ల నిర్వహణ ఈ ప్రధాన సవాళ్లు అన్నారు.


కొలువుల కల్పనే కీలకం: దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఉద్యోగాల కల్పన ప్రాధాన్యతను సుబ్బారావు నొక్కి చెప్పారు. ఏటా 1.2 కోట్ల మంది యువకులు కొత్తగా జాబ్‌ మార్కెట్లోకి వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంతమందికి ఉపాధి కల్పించాలంటే తయారీ రంగానికే సాధ్యమన్నారు. సేవలు, వ్యవసాయ రంగంలో అయితే పెద్దగా ఉపాధి కల్పనకు అవకాశం లేదన్నారు. 


ఉచితాల పాపం అందరిదీ: ప్రభుత్వాల ‘ఉచితా’లపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సున్నితమైన విమర్శ చేశారు. ఈ పాపం అన్ని పార్టీలకూ వర్తిస్తుందన్నారు. మనకేమీ మిగులు బడ్జెట్‌ లేదనే విషయాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. అప్పులు చేసి ఇచ్చే ఉచితాలను ఎంపిక చేసిన కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం మంచిదన్నారు. లేకపోతే భవిష్యత్‌ తరాలపై అనవసరమైన మోయలేని రుణ భారం పడుతుందని హెచ్చరించారు. ఏదేమైనా సబ్సిడీలపై ప్రధాని మోదీ చర్చను ప్రారంభించడం మంచి పరిణామం అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా మన జనాభాలో ఇంకా 20 కోట్ల మంది నిరుపేదుల ఉండడంపైనా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌  ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-16T06:20:40+05:30 IST