ఎంత మాయ.. తన గుట్టు తానే రట్టు చేసుకున్న Jagan Sarkar..

ABN , First Publish Date - 2021-09-12T08:32:16+05:30 IST

ఎవరో గిట్టని వారు కాదు.. తన చర్యలతో సర్కారే తన గుట్టు తానే రట్టు చేసుకోవడం గమనార్హం. ...

ఎంత మాయ.. తన గుట్టు తానే రట్టు చేసుకున్న Jagan Sarkar..

  • కోర్టు కోసమే ఈ-గజిట్‌ డ్రామా
  • దీనిపై జీవో 100 విడుదలచేసి.. దాన్నీ రహస్యంగా ఉంచిన వైనం
  • ఆ జీవో తర్వాత ఒక్కటే అప్‌లోడ్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కోర్టు కళ్లకు గంతలు కట్టాలనుకున్న సర్కారు డ్రామా అధికారికంగా బయటపడింది. ఎవరో గిట్టని వారు కాదు.. తన చర్యలతో సర్కారే తన గుట్టు తానే రట్టు చేసుకోవడం గమనార్హం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) ఈ-గజిట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు ఆ సమాచారాన్ని పొందవచ్చంటూ ఈనెల 7వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తో జీవో 100 జారీ చేయించారు. 72 గంటలు గడిచినా ఆ జీవోని ఈ-గజిట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. గురువారం రాత్రి వరకు ఆ జీవోని రహస్యంగానే ఉంచారు. అంతేనా...ఆ జీవో ఆధారంగా ప్రజలకు తెలియాల్సిన రెగ్యులర్‌ ఉత్తర్వులను కూడా అందులో అప్‌లోడ్‌ చేయడం లేదని తేటతెల్లం అయింది. గురువారం మొత్తం మీద సర్కారు ఒకే ఒక్క గజిట్‌ నోటిఫికేషన్‌ 414ని అప్‌లోడ్‌ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ఈనెల 8న జారీ చేసిన జీవో 1468ని గజిట్‌గా నోటిఫై చేస్తూ ప్రకటించినదే అది.


ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారుల ఎంపిక సంవత్సరాన్ని, వారి క్వాలిఫై సర్వీసును ప్రకటిస్తూ కేంద్ర సర్కారు ఇచ్చిన ఆదేశాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఈ అంశంపై ఎలాగూ గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ-గజిట్‌లో అప్‌లోడ్‌  చేశారు. ఇక ఇంతకుమించి ఒక్క జీవోను కూడా కొత్తగా పొందుపరచలేదు. వారాంతపు గజిట్‌లో హైకోర్టులో రిజిస్ట్రార్‌ పోస్టుల గజిట్‌ను అప్‌లోడ్‌చేశారు. ఇదీ గజిట్‌గా తప్పనిసరిగా ప్రకటించి అప్‌లోడ్‌ చేయాల్సిన అంశమే. కానీ, గురువారం జారీ చేసిన ముఖ్యమైన జీవోలను అందులో అప్‌లోడ్‌ చేయలేదు. ఈ చర్య ప్రభుత్వం జారీ చేసిన 100కు పూర్తి విరుద్దమైనదే. తాను ఇచ్చిన ఉత్తర్వులను సర్కారే ఉల్లంఘించడంతో తన డ్రామాను బయటపెట్టేసుకున్నట్లయింది. ఇది కాదా మోసం? ఇది కాదా మాయా? అని సమాచార హక్కు ప్రతినిధులు నిలదీస్తున్నారు.

 

ఇది కాదా మోసం!

గత నెల 17 నుంచి ప్రభుత్వం జీఓఐఆర్‌లో జీవోలను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. సర్కారు చర్య సమాచార హక్కు చట్టాలను ఉల్లంఘిస్తోందని కొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై విచారణ సాగుతోంది. బుధవారం ఈ అంశంపై విచారణ జరిగింది. అందుకు ఒక రోజు ముందు రాత్రి అంటే మంగళవారం రాత్రి పొద్దుపోయాక సర్కారు జీవో100ని జారీ చేసింది. సమాచార హక్కు చట్టానికి భంగం కలగనీయమని, ప్రజలకు ప్రభుత్వ ఉత్తర్వులను ఈ-గజిట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే అంటే, బుధవారం  ఆ జీవోని హైకోర్టుకు సమర్పించారు. ప్రజలు తెలుసుకోదగ్గ ప్రభుత్వ జీవోలను ఇకపై క్రమంతప్పకుండా ఈ-గజిట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా...ఇక వివాదం లేదని, జీవోల గురించి ఆందోళన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేసింది.  కానీ అదంతా కోర్టు కళ్లకు గంతలు కట్టే డ్రామా అని, జీవోలను అప్‌లోడ్‌ చేయడం సర్కారుకు ఇష్టం లేదని ముందుగానే ‘ఆంధ్రజ్యోతి’ గురువారం ప్రచురించింది. ఈ వార్త అక్షరసత్యమని, తన చర్యలతో సర్కారు నిరూపించుకుంది. 

Updated Date - 2021-09-12T08:32:16+05:30 IST