Determined CEO Malavika Hegde : కోట్ల అప్పులలో కూరుకుపోయిన కాఫీ డే కి కొత్త ఊపిరిచ్చిందీమె!!

ABN , First Publish Date - 2022-09-11T18:23:35+05:30 IST

ఇక కాఫీ డే పని అయిపోయింది అనుకున్నారు. కాఫీ డే ని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చిన డైనమిక్ లేడి సీఈఓ‌

Determined CEO Malavika Hegde : కోట్ల అప్పులలో కూరుకుపోయిన కాఫీ డే కి కొత్త ఊపిరిచ్చిందీమె!!


ఒక గంట సేపు హాయిగా, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మంచి కాఫీతో సమయాన్ని గొప్ప జ్ఞాపకంగా మార్చుకోవడం అందరికీ ఇష్టమే. ఈ క్రమంలో కాలక్షేపం కోసం ఎక్కడ మీట్ అవుదాం అనే ప్రశ్నంటూ వస్తే ఎక్కువ మంది నోటి వెంట వచ్చే సమాధానం కాఫీ డే!! స్నేహితులతో ముచ్చట్లకైనా, ప్రేమించిన వారితో మాటలకయినా, కుటుంబమంతా సరదాగా రిలాక్స్ అవడానికి అయినా కాఫీ డే ఒక మంచి ఆప్షన్. 


దేశంలోనే ఎక్కువ బ్రాంచ్‌లు కలిగిన అతిపెద్ద కాఫీ కేఫ్ సంస్థగా వేల కోట్ల వ్యాపారంతో కాఫీ డేను నడిపించిన వ్యక్తి వి.జి సిద్దార్థ. 1996, జులై 11న బెంగళూరు సిటీలో ప్రారంభమైన కాఫీ డే.. 2011 నాటికి దేశం మొత్తం మీద 1000 ప్రాంతాలకు విస్తరించింది. అయితే ఎంతో ఇష్టంగా కాఫీ డేను స్థాపించిన వి.జి సిద్దార్థ 2019లో మంగళూరుకు దగ్గర ఉన్న నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య అందరినీ షాక్‌కు గరిచేసింది. డ్రైవర్‌తో కలసి తన కారులో సకలేష్ పూర్ వెళ్తున్న సిద్దార్థ నేత్రావతి బ్రిడ్జ్ దగ్గరకు చేరుకోగానే కారును ఆపమని డ్రైవర్‌కు చెప్పాడు. అనంతరం డ్రైవర్‌ను అక్కడే వెయిట్ చేయమని చెప్పి.. ఆయన మాత్రం నదివైపు వెళ్లాడు. అలా వెళ్లిన ఆయన ఎంతకూ తిరిగి రాలేదు.  డ్రైవర్ వెళ్లి వెతికినా కనిపించలేదు. దీంతో డ్రైవర్ ఈ విషయాన్ని సిద్ధార్థ కుమారుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా నది దగ్గరకు చేరుకుని వెతుకులాట మొదలుపెట్టారు. దాదాపు 36 గంటల తర్వాత సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో దొరికింది. 


సిద్ధార్థ.. కాఫీ డే కు వస్తున్న నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చివరి నోట్ ద్వారా బయటపడింది. ‘ఎవరినీ మోసం చేయడం నా ఉద్దేశం కాదు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు, పన్నుల శాఖ వేధింపులు, బిజినెస్ పార్ట్నర్స్ ఒత్తిడి, ఆశించినంతగా వ్యాపారం లేకపోవడం.. ఇవన్నీ నన్ను ఒత్తిడిలోకి నెట్టేశాయి. కాఫీ డే ఫౌండర్‌గా నేను ఫెయిల్ అయ్యాను’   అని సిద్దార్థ తన చివరి నోట్‌లో స్పష్టంగా వెల్లడించారు. సిద్ధార్థ మరణంతో ఇతర కంపెనీల సీఈఓలు ఇక కాఫీ డే పని అయిపోయింది అనుకున్నారు. కానీ వారందరి అభిప్రాయాలను తారుమారు చేస్తూ భర్త చనిపోయిన బాధను దిగమింగుకుని, నష్టాలలో ఉన్న కాఫీ డే ని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చిన డైనమిక్ లేడి సీఈఓ‌గా మాళవికా హేగ్దే నిలిచారు. 2020 డిసెంబర్‌లో కాఫీ డే CEOగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తవకముందే కంపెనీకి ఉన్న వేల కోట్ల అప్పును తీర్చేశారు. ఇక కాఫీ డేని మూసుకోవాల్సిందేనని వాగిన నోళ్లను మూయిస్తూ.. సంస్థకు ఢోకా లేదనే సమాధానం ఇస్తున్నారు.  


సంస్థను నిలబెట్టగలిగిన మాళవిక.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ కూతురు. ఈమె తన పాఠశాల విద్య అంతా బెంగళూరులోనే పూర్తి చేశారు. ఇంజనీరింగ్ కూడా బెంగళూరు యూనివర్సిటీలోనే పూర్తి చేశారు. 22ఏళ్ల వయసులో ఈమెకు వి.జి. సిద్దార్థ‌తో 1991 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఈషాన్, అమర్థ్య అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 


సిద్దార్థ మరణం తరువాత

సిద్దార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కాఫీ డే మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధార్థ్ చనిపోయిన నాటికి కాఫీ డే అప్పులు 7200కోట్లు. ఇక దాన్ని నిలబెట్టడం అసాధ్యమని, అది మూతబడటం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ కాఫీ డే ఎంటర్‌ప్రైజర్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అంతకు ముందు నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్న మాళవిక.. కాఫీ డేని నిలబెట్టాలని భావించారు. అందుకోసం తనే సీఈఓగా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 


నిర్ణయాలు, పరిష్కారాలు

కాఫీ డే CEOగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే మాళవిక కంపెనీ అప్పులు.. కంపెనీ ఖర్చులు.. ఆదాయం.. ఎక్కడ నష్టం జరుగుతోంది అనే విషయాలపై దృష్టి సారించారు.  2020లో కాఫీ డే ఎంటర్‌ప్రైజర్స్ లిమిటెడ్ వారికి చెందిన ఒక సంస్థ.. మరొక సంస్థకు రూ. 2,693 కోట్లు అప్పు పడినట్టు ఒక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో విషయం తెలిసి కంపెనీ ఉద్యోగుల్లో గందరగోళం ఏర్పడకూడదని ఆమె భావించారు. అనంతరం కొన్ని గంటలకే మాళవిక తన కంపెనీలో పనిచేసే 25,000 మంది ఉద్యోగులకు ఒక ఉత్తరాన్ని రాశారు. ఆ ఉత్తరంలో ‘ఈ కంపెనీని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. కంపెనీ పెట్టుబడులను అమ్మడం ద్వారా అప్పులను వీలయినంత తొందరగా తీర్చి సమస్యలను పరిష్కరిస్తాను’ అని తెలియజేశారు.


ఆమె తీసుకున్న నిర్ణయాలు కాఫీ డే కి కొత్త ఊపిరి పోశాయనడంలో సందేహం లేదు. సరిగ్గా వ్యాపారం జరగని ప్రాంతాలలో ఉన్న షాపులను తొలగించమని ఆదేశాలు ఇచ్చారు. ఐ.టి పార్కులు ఇతర కంపెనీల వద్ద ఉన్న కాఫీ వెండింగ్ మిషన్‌లను తొలగింపచేశారు. కొత్త పెట్టుబడిదారులను సంపాదించడంలో గొప్ప తెలివితేటలు ఉపయోగించారు. ఫలితంగా సంస్థ మూలధనాన్ని పెంచారు.


2021 నాటికి తగ్గిన అప్పులు..

2019 మార్చి నాటికి కాఫీ డే సంస్థకు రూ.7200 కోట్ల అప్పులు ఉండగా.. 2021 మార్చి నాటికి ఈ అప్పు రూ.1731 కోట్లకు తగ్గింది. అప్పుల్లో కూరుకుపోయిన కాఫీ డేను తన సమర్థతతో సేఫ్ జోన్‌లోకి తీసుకొచ్చారు మాళవికా హేగ్దే. 


కరోనా సమయంలో....

అప్పుల ఊబి నుండి బయటకొస్తున్నామని ఆనందపడేలోపు.. కరోనా రూపంలో విధి పెద్ద సవాలు విసిరింది. ఆ సమయంలో ఎన్నో వ్యాపార సంస్థలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. కొన్ని మూతబడ్డాయి కూడా. అయితే కరోనా సమయంలో మాళవిక నిర్ణయాలు కాఫీ డే వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేశాయి. కోవిడ్ ప్రొటోకాల్‌ను అన్ని కాఫీ డే బ్రాంచులలో చాలా జాగ్రత్తగా అమలు చేయడం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కాఫీ డేను ఇష్టపడేవారు ఎలాంటి అనుమానాలు లేకుండా బ్రాంచులను సందర్శించారు. వ్యాపార దిగ్గజాలే ఘోరంగా దెబ్బతిన్న కరోనా కాలంలో కాఫీ డేను సమర్థవంతంగా నడపడం మాళవికలో ఉన్న వ్యాపార ప్రతిభకు నిదర్శనం. మరొక విషయం ఏంటంటే.. కరోనా కాలంలో అన్ని ధరలు పెరిగిపోతే కాఫీ డేలో ఒక రుపాయి కూడా పెంచలేదు. 


ప్రస్తుతం 36,000 కాఫీ వెండింగ్ మెషిన్లతో దేశవ్యాప్తంగా 572 కాఫీ కేఫ్ లు ఉన్నాయి. వీటి ద్వారా 47% నికర ఆదాయం ఉంది. కేఫ్ కాఫీ డే రాబడులు బాగానే ఉన్నాయి. వీరికున్న 20,000 ఎకరాల సొంత కాఫీ తోటలో ఎంతో మేలురకం కాఫీ విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి యూ.ఎస్, యూరప్, జపాన్ లతో పాటు ఇతర దేశాలకు రవాణా అవుతాయి.


మాళవిక ఏమంటుందంటే...

‘నా భర్త సిద్దార్థ చనిపోయిన తరువాత ఈ కాఫీ డే ను నిలబెట్టుకోవడం నా లక్ష్యం మాత్రమే కాదు, అది నా బాధ్యత కూడా. సిద్దార్థ ఎక్కడ ఉన్నా ఆయన గర్వపడేలా చేశానని అనుకుంటున్నాను. ఆయన తన పనిని నాకు వదిలి వెళ్ళాడు. నేను దాన్ని పూర్తి చేస్తాను. కాఫీ డేని అప్పుల నుంచి పూర్తిగా బయటకు తెస్తాను. కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాను. అని ఎంతో ఆత్మశ్వాసంతో చెబుతారు. కష్టానికి, ప్రతిభకు ఫలితం తప్పకుండా లభిస్తుంది కదా...

Updated Date - 2022-09-11T18:23:35+05:30 IST