Advertisement
Advertisement
Abn logo
Advertisement

కమ్యూనిస్టుల కర్తవ్యం

సమాజంలో, వేలాది సంవత్సరాలుగా, ‘శ్రమ దోపిడీ’ జరుగుతూ వుందనీ; దాని వల్లనే మానవులు శ్రామిక వర్గం గానూ, యజమాని వర్గం గానూ, విడిపోయి వున్నారనీ; మానవ సమాజానికి అసలు సమస్య ఇదేననీ; ‘శ్రమ దోపిడీ’ పోతే, ‘అసమాన శ్రమ విభజన’ మారితే, మానవులు సమానత్వంతో జీవించే సమాజం ఏర్పడుతుందనీ; మార్క్సిజం చెపుతుంది. ఈ విధంగా చెప్పిన మార్క్సిజం మీద వ్యతిరేకంగా, రకరకాల విమర్శలు వున్నాయి!


ఆ విమర్శలన్నిటికీ ప్రధానమైన కారణం, ‘శ్రమ దోపిడీ’నే నిలబెట్టుకోవాలని ఆశించే విమర్శకుల ప్రయత్నమే. కొందరు విమర్శకులు, వ్యతిరేక దృష్టి లేకపోయినా, మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకోకపోవడం వల్ల, విమర్శలు చేస్తారు. ఆ విమర్శకులకు బలంగా కనపడే విమర్శ, ‘సోవియట్ రష్యా’ దేశపు పరిస్తితి. ‘రష్యా దేశం, శ్రామిక వర్గ పోరాటం అనే దాన్ని ఎంతో కొంత చేసింది కదా? కానీ, ఆ దేశంలో వర్గ భేదాలు పోయే మార్పు జరగనే లేదు. మార్క్సిజం చెప్పే మార్పు ఎక్కడైనా, ఇంకేం జరుగుతుంది? వర్గ భేదాల్ని తీసి వేసే మార్పు ఎప్పటికీ జరిగే విషయం అవదు.’ – ఇదీ, విమర్శకుల వాదం.


‘మానవులు, ఎక్కువ – తక్కువ స్తాయీ భేదాలతో వుండడమే సహజం. ఆ సహజత్వం మారడం జరగదు. వెనకటి కాలాల్లో బానిసల కాలం లోనూ, భూస్వాముల కాలం లోనూ వర్గ భేదాలు వున్నాయి; ఇప్పుడు పెట్టుబడిదారుల కాలం లోనూ అవే భేదాలు వున్నాయి. ఆ వర్గ భేదాల్ని తీసి వేస్తామని ఆడంబరంగా చెప్పుకున్న రష్యా, చైనా దేశాల్లోనూ, ఆ భేదాలు వున్నాయి. ఇదంతా చూస్తే, మానవ సమాజం, వర్గ భేదాలు లేని సమాజంగా మారడం గానీ, మార్చడం గానీ, ఎప్పటికీ జరిగే మార్పు కాదు. ఈ సహజత్వాన్ని గ్రహించే దృష్టి మార్క్సిజానికి లేదు.’ – ఇదీ, ఆ విమర్శల సారాంశం. 


‘సమాజంలో వేరు వేరు వర్గాలు వున్నాయి’ అని అయితే, విమర్శకులు అంటారు. ఆ వర్గ భేదాలు ఎందుకు వున్నాయని వాళ్ళు అనుకుంటున్నారో, ఆ కారణాలు చెప్పరు. ఆ భేదాలన్నీ సహజమే – అంటారు. ఆ భేదాలు పోవడం, ఏ సిద్ధాంతం వల్లయినా జరిగితే, అది వాళ్ళకి అంగీకారం కాదు. స్వంత శ్రమలు లేకుండా, దోపిడీ శ్రమల ద్వారా తర తరాలుగా సుఖ భోగాలతో బ్రతకడం అలవాటైపోయిన వర్గపు వ్యక్తులే, మార్క్సిజాన్ని వ్యతిరేకించే వారిలో ఎక్కువ మంది. తాము కూడా శ్రమలు చేయవలిసిన మార్పు ఎప్పుడూ జరగరాదని భావిస్తారు వారు. 


నిత్యం, ప్రతి రోజూ 10 గంటల సేపు రాత్రింబవళ్ళూ మూడేసి షిఫ్టులలో, గొడ్డు చాకిరీలతో, సతమతమయ్యే శ్రామికులు, అదే రకపు జీవితాల్ని నిలబెట్టుకోవాలా, ఆ బాధల్ని వదిలించుకోవాలా? మొదట, మార్క్సిజం ఏం చెపుతోందో దాన్ని తెలుసు కోవాలి. వేలాది సంవత్సరాలుగా సాగుతోన్న శ్రమ దోపిడీని గ్రహించిన సిద్ధాంతం మార్క్సిజమే కాబట్టి అది చెప్పిన కార్యక్రమాలతో నడవాలి, శ్రామిక వర్గం. 


మార్క్సిజాన్ని తెలుసుకోవడమూ, నేర్చుకోవడమూ, ఎలాగ? అది రాసి వున్న పుస్తకాలు చదవడమే. అయితే, సిద్ధాంతంతో నిండిన పుస్తకాలు చదవడం శ్రామిక వర్గంలో ప్రతీ వారికీ సాధ్యం కాదు. కానీ, శ్రామిక వర్గంలో మేధా శ్రమల శ్రామికుల సెక్షన్లు అనేకం వుంటాయి. ఆ సెక్షన్ల శ్రామికులు చదవగలరు, నేర్చుకోగలరు. వారి కోసం వారు చదవడం మాత్రమే కాదు, ఆ మేధా శ్రామికులు చేయవలిసింది. తోటి నిస్సహాయుల కోసం, తమ శ్రామిక వర్గ చైతన్యంతో, ఆ బాధ్యతతో, వారి కృషి వారు చేయాలి. కమ్యూనిస్టు పార్టీ నాయకులూ, కార్యకర్తలూ, తరచుగా, ఎప్పుడు వీలైతే అప్పుడు అధ్యయన తరగతులు నిర్వహిస్తే ఉపయోగంగా ఉంటుంది. పది మంది శారీరక శ్రమల వారినీ, కొందరు విద్యార్ధుల్నీ, కొందరు శ్రామిక స్త్రీలనీ, అధ్యయన తరగతుల ద్వారా, సమీకరించడం, అత్యవసరం. 1883లో విప్లవ పూర్వపు రష్యాలో, ప్లెహనోవ్ నాయకత్వాన, ‘శ్రామిక విమోచన సమితి’ అని ఒకటి ఏర్పాటయింది. దాని ముఖ్య ఉద్దేశం, శ్రామిక జనాలలో, మార్క్సిజం భావాలని ప్రచారం చెయ్యడం. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమం అలా మొదలైందని చెప్పొచ్చు. 


పార్టీ నాయకులూ, కార్యకర్తలూ, మొదట వారు, మార్క్సిజం చెప్పిన దాన్ని గ్రహించగలిగితే, శ్రామిక జనాలకు వర్గ చైతన్యం కలిగించగలరు. అది చాలా అవసరం. ఈ విషయాన్ని మార్క్సూ ఎంగెల్సులు తమ సమకాలిక ఉద్యమకారులకు సూచించారు. 


ఎంగెల్సు: ‘ప్రత్యేకంగా, నాయకుల కర్తవ్యం ఏమిటంటే, సిద్ధాంత సమస్యలన్నిటిని గురించీ అంతకంతకూ స్పష్టమైన అవగాహన సంపాయించడమూ; పాత ప్రపంచ దృక్పధం నుండి సంక్రమించిన సాంప్రదాయిక నుడికారాల ప్రభావం నుంచి అంతకంతకూ విముక్తి చెందడమూ; సోషలిజం ఒక శాస్త్రం అయింది గనుక, దానిని శాస్త్రంగా అనుసరించాలని, అనగా దానిని అధ్యయనం చేయాలని, అది డిమాండు చేస్తుందనే విషయం నిత్యం మనసులో వుంచుకోవడమూ! అలా గ్రహించినట్టి అంతకంతకూ స్పష్టమైన అవగాహనను మరింత పట్టుదలతో కార్మిక జనాలలో వ్యాప్తి చేయడమూ; పార్టీ యొక్కా, ట్రేడ్‌యూనియన్ల యొక్కా నిర్మాణాన్ని, అంతకంతకూ దృఢంగా కట్టుదిట్టం చేయడమూనూ; ఇది కర్తవ్యంగా వుంటుంది.’


మార్క్స్‌: ‘పాలక వర్గాల రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంస్తాపరంగా పురోగమించి వుండకపోతే, ఆ అధికారానికి వ్యతిరేకంగా, నిరంతర ప్రచారం ద్వారానూ, పాలక వర్గాల విధానాల పట్ల శతృపూరిత వైఖరిని ప్రదర్శించడం ద్వారానూ, మనం కార్మిక వర్గానికి శిక్షణ ఇచ్చి తీరాలి. లేకపోతే, కార్మిక వర్గం పాలక వర్గాల చేతిలో ఆట వస్తువుగా వుండిపోతుంది.’


(రంగనాయకమ్మ కొత్త పుస్తకం

‘మార్క్సిజం మీద, విమర్శలకు జవాబులు’ నించీ కొన్ని మాటలు)

Advertisement
Advertisement