దుర్గం చెరువు కొండల్ని కాపాడాలి

ABN , First Publish Date - 2021-07-23T09:37:36+05:30 IST

దుర్గం చెరువు దక్షిణభాగంలో ఉదయం నడక నూతనోత్సాహాన్ని నింపుతుంది. చెరువు వెంబడి సృష్టించిన కాలిబాటలో సంచరించడం ఆహ్లాదకరమైన అనుభవం...

దుర్గం చెరువు కొండల్ని కాపాడాలి

దుర్గం చెరువు దక్షిణభాగంలో ఉదయం నడక నూతనోత్సాహాన్ని నింపుతుంది. చెరువు వెంబడి సృష్టించిన కాలిబాటలో సంచరించడం ఆహ్లాదకరమైన అనుభవం. చెరువు పరిసర ప్రాంతాలలో ప్రజోపయోగ సదుపాయాలను అభివృద్ధిపరచడంలో ప్రభుత్వం ప్రశంసనీయమైన కృషి చేసింది. ఈ అందమైన సరస్సు దక్షిణ భాగంలో మినహా మిగతా అన్ని వైపులా కాంక్రీట్ కట్టడాలు వెలిశాయి. దక్షిణ భాగంలో పచ్చదనంతో నిండిఉన్న కొండలపై ఎలాంటి భవన నిర్మాణం జరగకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఈ కొండల శ్రేణి సహజసౌందర్యం ధ్వంసమవుతుంది. చెరువుకు నష్టం వాటిల్లకుండా కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించడం అభినందనీయం. అదేరీతిన దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న కొండల పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం అటువంటి సున్నితత్వాన్ని, శ్రద్ధాసక్తులను చూపాలి. గత ఏడాది వరద బీభత్సం వంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలి. హైదరాబాద్ మహానగరంలోని చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, వృక్షాలు, కొండలు మొదలైన వాటి పునరుద్ధరణ, పరిరక్షణకు దుర్గం చెరువు విషయంలో వలే ప్రభుత్వం విశేష శ్రద్ధాసక్తులు చూపాలి. 

సూరపనేని సుబ్రమణ్య ప్రసాద్

హైదరాబాద్

Updated Date - 2021-07-23T09:37:36+05:30 IST