మందు మరింత ప్రియం

ABN , First Publish Date - 2022-05-20T05:44:19+05:30 IST

మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం ఝల క్‌ ఇచ్చింది. రాత్రికి రాత్రే మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 10గంటల తర్వాత షాపులన్నింటినీ సీజ్‌ చేయడమేగాక అంతకముందు ఉన్న స్టాక్‌ను ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఇకపై పెరిగిన ధర ల ప్రకారం పాత స్టాక్‌ను కూడా విక్రయించేలా ఏర్పాట్లు చేశారు.

మందు మరింత ప్రియం

ఒక్కో బ్రాండ్‌పై రూ.20 నుంచి రూ.40 పెంపు

బీరుపై రూ.10 అదనం

అమలులోకి వచ్చిన కొత్త ధరలు

నల్లగొండ, మే 19: మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం ఝల క్‌ ఇచ్చింది. రాత్రికి రాత్రే మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 10గంటల తర్వాత షాపులన్నింటినీ సీజ్‌ చేయడమేగాక అంతకముందు ఉన్న స్టాక్‌ను ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఇకపై పెరిగిన ధర ల ప్రకారం పాత స్టాక్‌ను కూడా విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. బెల్ట్‌షాపుల్లో సైతం ధరలను పెంచి విక్రయిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 155 వైన్స్‌లు ఉండగా, సూర్యాపేటలో 99, యాదాద్రిలో 82 వైన్స్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీ నెల సుమారు రూ.300కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. పెరిగిన ధరలతో అదనంగా మరో 15శాతం అంటే ప్రతినెల రూ.350కోట్లు ప్రభుత్వానికి సమకూరనున్నాయి. 

పెరిగిన ధరలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం ప్రియులపై రూ.50కోట్ల అదనంగా భారం పడనుంది. మద్యం దుకాణాల్లో ఒక్కో బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.40వరకు ధర పెరిగింది. చీప్‌ లిక్కర్‌తో పాటు మధ్యతరగతి ప్రజలు తాగే కొన్ని బ్రాండ్ల ధరలు రూ.20 పెరగ్గా, అధిక ధరలు ఉన్న బ్రాండ్లపై రూ.40 ధర పెరిగింది. బీరు ధర రూ.10 అదనంగా పెంచారు. వేసవి మరో 15 రోజులు మాత్రమే ఉండనుండడంతో బీర్ల ధరను అధికంగా పెంచలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 350ఎంఎల్‌ ఉన్న బీరు ధర రూ.90 ఉండగా, పెరిగిన ధరతో రూ.100 కానుంది. 650ఎంఎల్‌ ఉన్న బీరు ధర రూ.140 ఉండగా, రూ.150 కానుంది. రూ.150 ఉన్న బీరు రూ.160 అయింది. అదే విధం గా స్ట్రాంగ్‌ బీర్లతో పాటు ఇతర బీర్లు రూ.200 ఉంటే రూ.210కి పెంచారు. మద్యం ధరల పెంపుతో పేద, మధ్యతరగతికి చెందిన మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాత్రికి రాత్రే మద్యం స్టాక్‌ను సీజ్‌ చేయడాన్ని వైన్స్‌ నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. పాత ధరల ప్రకారం సొమ్ము చెల్లించి బఫర్‌ స్టాక్‌ తీసుకున్నామని, కొత్త రేట్ల ప్రకారం చెల్లించాలనడం సరైన విధానం కాదని వాపోతున్నారు.

Updated Date - 2022-05-20T05:44:19+05:30 IST