ఆశల భారతం – ఆకలి వాస్తవం

ABN , First Publish Date - 2020-10-22T06:09:53+05:30 IST

భారత్ చాలా విషయాల్లో ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నది. వైజ్ఞానికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతూ, ఆధునికీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే అతి ముఖ్యమైన విషయాల్లో మాత్రం తడబాటు తప్పడం లేదు. దేశానికి ఉన్న...

ఆశల భారతం – ఆకలి వాస్తవం

భారత్ చాలా విషయాల్లో ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నది. వైజ్ఞానికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతూ, ఆధునికీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే అతి ముఖ్యమైన విషయాల్లో మాత్రం తడబాటు తప్పడం లేదు. దేశానికి ఉన్న వనరుల్లో విలువైనవి మానవ వనరులు. ప్రజలు ఆరోగ్యంగా, విద్యా వంతులుగా ఉన్నప్పుడు వారికి వారే కాక సమాజం అభివృద్ధికీ తోడ్పడతారు. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి, ప్రగతి పథంలో దూసుకుపోవడం అంటే అర్థం లేని మాట. అసలు అభివృద్ధికి కొలమానం ప్రజల జీవన ప్రమాణాల మీదే ఆధారపడి ఉండాలి. జీడీపీ లెక్కల కన్నా మానవ అభివృద్ధి సూచీలే ముందుండాలి. ఆ సూచీల్లో భారత్ చాలా వెనుకబడి ఉందన్నది చేదు నిజం. 




ఈ సంవత్సరం కూడా ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ఆసియా దేశాల్లో సైతం వెనకే ఉంది. 107 దేశాల్లో 94 వ స్థానంలో వుండి, కేవలం మరో 13 పేద దేశాల కన్నా ముందు నిలిచింది. పిల్లలు తమ ఎత్తుకు తగ్గ బరువు లేరంటే అది తక్షణ పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. వయసుకు తగ్గ ఎత్తు లేరంటే దీర్ఘకాలిక పోషకాహార లోపంతో గిడస బారినట్టు. ఈ రెంటిలో భారత్ దయనీయంగా ఉంది. అంటే ఎప్పటి నుంచో వస్తున్న తప్పుడు విధానాలు కొనసాగుతున్నట్టే. అరకొర ప్రయత్నాలు మాత్రమే ఈ ముఖ్య విషయంలో అమలౌతున్నట్టే. ఈ దేశంలో 14 శాతంమంది ఆకలితోనే రోజు గడుపుతున్నారు. గర్భిణీ స్త్రీలు సగం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురిలో ముగ్గురు పోషకాహారం స్వీకరించగలిగే ఆర్థిక స్థోమతతో లేరు. వివిధ గణాంకాలు రుజువు చేస్తున్న ఈ వాస్తవాలు అభివృద్ధి లెక్కల్ని వెక్కిరిస్తున్నాయి. పేదల వరకూ పౌష్టికాహారం చేరేలా ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దాలి. ప్రజలకు ఆ ఆహారం చవకగా దొరకాలి. ప్రభుత్వ విధానాలు ఆ దిశగా సాగకపోతే అభివృద్ధి నిజమైన అర్థంలో జరగదు. ఆహార భద్రత అభివృద్ధికి మొదటి మెట్టు.


– డా.డి.వి.జి.శంకరరావు

మాజీ ఎంపీ, పార్వతీపురం

Updated Date - 2020-10-22T06:09:53+05:30 IST