ఆ గ్రామస్థుల కలను...కరోనా తీరుస్తోంది!

ABN , First Publish Date - 2020-06-24T06:06:36+05:30 IST

ఆధ్యాత్మిక నిలయంగా ఒకనాడు విలసిల్లిన ఆ ఆలయం దాదాపు అరవై ఏడేళ్ళ కిందట పెన్నా నది ఉద్ధృతికి ఇసుకమేటలో కూరుకుపోయింది.

ఆ గ్రామస్థుల కలను...కరోనా తీరుస్తోంది!

ఆధ్యాత్మిక నిలయంగా ఒకనాడు విలసిల్లిన ఆ ఆలయం దాదాపు అరవై ఏడేళ్ళ కిందట పెన్నా నది ఉద్ధృతికి ఇసుకమేటలో కూరుకుపోయింది.


ఇప్పుడు... కరోనా విజృంభణతో గ్రామానికి తిరిగి వచ్చిన ఆ ఊరివారూ, స్థానికులూ కలిసి ఆ ఆలయాన్ని వెలికి తీస్తున్నారు.


ఇప్పటికే గర్భాలయం బయటపడింది. కరుణించే వేలుపు గుడికి పూర్వ వైభవాన్ని

రప్పించాలన్నది వారి తపన.


ఒకప్పుడు పెరుమాళ్ళపాడు నాగేశ్వరస్వామి ఆలయం అంటే ఎంతో ప్రసిద్ధి. ఇప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఒక చిన్న గ్రామం అది. నాగేశ్వర ఆలయం గురించి పాత తరం వాళ్ళ నుంచి వినడమే తప్ప ఈ తరంలో చూసినవాళ్ళెవరూ లేరు. ఎందుకంటే 67 ఏళ్ళ కిందటే ఆ ఆలయం కనుమరుగైపోయింది.  


వేమన వంశస్థుల ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందిన పెరుమాళ్ళపాడు ఆలయంలో కొలువైన భ్రమరాంబా సమేత నాగేశ్వరస్వామిని పిలిస్తే పలికే దైవంగా తమ పెద్దలు భావించి సేవించేవారనీ, ఆలయంలో నిత్యపూజలు ఘనంగా జరిగేవనీ పాతతరం వారు చెబుతూ ఉంటారు. 1952-53 సంవత్సరాల మధ్య ఈ ఆలయానికి చివరి తిరునాళ్ళు నిర్వహించారని చెబుతారు. ఆ తరువాత పెన్నా నదిలో వరద పోటెత్తింది. భయంతో గ్రామస్థులు రెండు కిలోమీటర్ల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వరదల వల్ల నాగేశ్వరాలయం  ఇసుకమేటల్లో కూరుకుపోయింది. అంతకు ముందే గుడిలోని పంచలోహ విగ్రహాలను సంగంలోని సంగమేశ్వరాలయంలో భద్రపరిచారు. శిలావిగ్రహాలు మాత్రం గర్భాలయంలోనే మిగిలిపోయాయి.  


చేయీ చేయీ కలిపి...

పెరుమాళ్ళపాడు దాదాపు 400 మంది జనాభా ఉన్న గ్రామం. సుమారు 32 కుటుంబాలు ఉపాధి కోసం పొరుగూళ్ళకు వెళ్లాయి. ఇప్పుడు కరోనా విజృంభణ వారిని స్వగ్రామాలకు చేర్చింది. తిరిగి సొంత ఊరు వచ్చిన వారికి నాగేశ్వరస్వామి ఆలయాన్ని వెలికి తీయాలనే ఆలోచన వచ్చింది. గ్రామ పెద్దలతో యువకులు ఈ విషయం మాట్లాడి వారు ‘సరే’ అన్నాక దేవాదాయశాఖ  అనుమతి తీసుకున్నారు. ఖర్చుల కోసం గ్రామస్థులందరూ చందాలు వేసుకున్నారు. దగ్గరలోనే ఉన్న గాలిపాళెం వెంకయ్యస్వామి ఆశ్రమ నిర్వాహకుడు శ్రీహరిస్వామి సారథ్యంలో మే 14న పనులు మొదలయ్యాయి. పెన్నా నది గర్భంలో 20 అడుగుల లోతులో ఆలయ గోపురం బయటపడింది. మరింత లోతులో గర్భాలయం వెలుగుచూసింది. దీంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేవు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి పురావస్తు, దేవాదాయ శాఖల నుంచి అధికారులూ, ఇతర ప్రముఖులూ వస్తున్నారు. 



అనుకోని అవరోధం

నాగేశ్వరుడి గుడిని పూర్తిగా బయటకు తీసి, త్వరలోనే పూజాదికాలు ప్రారంభించాలన్న గ్రామస్థుల సంకల్పానికి తాత్కాలిక అవరోధం ఎదురయింది. ఈ గ్రామంలో అయిదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. దీంతో పనులు ఆగిపోయాయి. త్వరలోనే మళ్ళీ పనులు ప్రారంభించి, ఆలయానికి పూర్వవైభవం తీసుకువస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఆలయానికి ఉన్న ఎనభై ఎకరాలకు పైగా మాన్యంలో కొంత భాగానికి రైల్వే శాఖ నుంచి పరిహారం రావచ్చనీ అంటున్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. కాగా, జిల్లాకు చెందిన ప్రముఖులు ఆలయాభివృద్ధికి సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.


పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయం

ఈ గుడి ఆవిర్భావం వెనుక పౌరాణిక గాథ ఒకటుంది. తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు తన తల్లి రేణుకాదేవిని సంహరించిన పరశురాముడు ఆ పాపాన్ని పొగొట్టుకోవడానికి గురువు ఆదేశంతో నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించాడు. వాటిలో నెల్లూరు జిల్లాలోని సంగం దగ్గర ఉన్న సంగమేశ్వర, పెరుమాళ్ళపాడులో నాగేశ్వర, కోటితీర్థంలో కొలువైన కోటీశ్వర, సోమశిలలో సోమేశ్వర లింగాలున్నాయి. పెరుమాళ్ళపాడులో మినహా మిగిలిన ఆలయాలు ఇప్పటికీ నిత్యపూజలతో వెలుగొందుతున్నాయి.


- గోళ్ల రామకృష్ణ, నెల్లూరుఫొటోలు: పెంచల హర్ష, చేజర్ల 

Updated Date - 2020-06-24T06:06:36+05:30 IST