నెరవేరని నిరుపేదల కల

ABN , First Publish Date - 2022-01-19T05:44:10+05:30 IST

గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

నెరవేరని నిరుపేదల కల
పెద్దమాసాన్‌పల్లి గ్రామంలో నిర్మించిన జీ ప్లస్‌ వన్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

 నత్తనడకన డబుల్‌ ఇళ్ల నిర్మాణం 

 లబ్ధిదారుల ఎంపికలో జాప్యం


తొగుట, జనవరి18: తొగుట మండలంలోని 10 గ్రామాలకు మొత్తం 345 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 65 ఇళ్లు జీ ప్లస్‌ వన్‌ కావడం గమనార్హం. వెంకట్రావ్‌పేటకు 90 ఇళ్లు మంజూరు కాగా అందులో 60 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన 30 ఇళ్ల నిర్మా ణం ప్రారంభంకాలేదు. గోవర్ధనగిరి గ్రామంలో 45 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. పెద్దమాసాన్‌పల్లికి 20, ఎల్లారెడ్డిపేటకు 25, బండారుపల్లికి 20 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. అయితే స్థలం లేదనే సాకుతో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు జీ ప్లస్‌ వన్‌ నిర్మించేందుకు అనుమతిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. బండారుపల్లి పంచాయితీ పరిధిలోని మెట్టులో 10 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. గుడికందుల గ్రామానికి 50 ఇళ్లు మంజూరు కాగా 20 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 30 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. కానుగల్‌లో 20 ఇళ్లు మంజూరు కాగా 12 ఇళ్ల నిర్మాణం స్లాబ్‌ వరకు వచ్చింది. మిగిలిన 8 ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. జప్తిలింగా రెడ్డిపల్లి గ్రామానికి 25 ఇళ్లు మంజూరు కాగా 13 స్లాబ్‌ లెవల్‌లో ఉండగా 12 ఇళ్లను ప్రారంభించలేదు. అదే విధంగా చందపూర్‌కు 15, వర్ధరాజ్‌పల్లి గ్రామానికి 25 ఇళ్లు మంజూరు కాగా పనులు ప్రారంభించలేదు. 


అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా 


గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి సమయాల్లో మందుబాబులు మద్యం సేవించడంతో ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి బూత్‌ బంగ్లాలను తలపిస్తున్నాయి. భవనాలు ప్రారంభించక ముందే డబుల్‌ ఇళ్లకు పగుళ్లు ఏర్పడి, లీకేజీలతో గోడలు పాకురు పడుతున్నాయి. 


లబ్ధిదారుల ఎంపికలో జాప్యం


అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సొంతింటి కలను నిజం చేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అవేమి పట్టించుకోకపోవడంతో ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు జాబితాను సిద్ధం చేసినప్పటికీ ఇంకా పేదలకు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని గ్రామాల్లో తమ అనునయులకు కేటాయించేలా పైరవీలు ప్రారంభించినట్లు ప్రచారం.

Updated Date - 2022-01-19T05:44:10+05:30 IST