కల సాకారం!

ABN , First Publish Date - 2021-07-31T05:08:30+05:30 IST

కల సాకారం!

కల సాకారం!

  • ఉమ్మడి జిల్లాలో 4 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
  • పరిగి, వికారాబాద్‌, 
  • ఉప్పల్‌, మహేశ్వరంలో
  •  ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఈ విద్యా సంవత్సరం నుంచి 
  • తరగతులు ప్రారంభించేలా చర్యలు 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): దశాబ్దాల కాలంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కావాలన్న డిమాండ్‌ సాకారమయ్యేందుకు ఎట్టకేలకు ముందడుగు పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌ జిల్లాలో వికారాబాద్‌, పరిగి, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిజిల్లాలో ఉప్పల్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈవిద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలల్లో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వికారాబాద్‌, పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ రెండు దశాబ్దాలుగా జేఏసీలు, వీడీడీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు,ఉద్యమాలు కొనసాగాయి.ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహే్‌షరెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వారి కృషి ఫలితంగా ఎట్టకేలకు కొత్త డిగ్రీ కళాశాలల ఏర్పాటు కాబోతున్నాయి. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగాఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ డిగ్రీ చదువులు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాలల్లో చేరడానికి ప్రత్యేక అడ్మిషన్ల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. 

మౌలిక వసతులు, అధ్యాపకులు ఎలా?

కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ డిగ్రీకళాశాలలను ప్రారంభించేందుకు భవనసమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోనే డిగ్రీ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రతిపాదించారు. అయితే ఆ కళాశాలలో ప్రస్తుతం ఇంటర్‌ విద్యార్థులు కలిపి 800 మంది వరకు ఉంటారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైతే ఉన్న విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక  కళాశాల నిర్వాహకులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలను ఏదైనా ప్రైవేట్‌ భవనంలో ప్రారంభిస్తారా, లేక అక్కడే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. పరిగిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనే డిగ్రీ కళాశాల కొనసాగించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న కళాశాలల్లో విద్యాబోధన చేసేందుకు ఇతర కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులను డిప్యుటేషన్‌పై ఇక్కడకు పంపిస్తారా? లేక తాత్కాలిక పద్ధతిలో నియామకం చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మౌలిక వసతులు, అధ్యాపకులు, సిబ్బంది నియామకాలపై ఇంకా స్పష్టత లేదు. త్వరలో ఈ విషయమై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2021-07-31T05:08:30+05:30 IST