కలవరపెడుతున్న కొత్త వేవ్‌

ABN , First Publish Date - 2021-03-28T08:15:03+05:30 IST

కొవిడ్ సెకండ్ వేవ్ కలవరపరుస్తోంది. తొలిసారికంటే ఈ మారు ఇది తీవ్రంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్‌ పుంజుకుంటున్న వేగం చూస్తే...

కలవరపెడుతున్న కొత్త వేవ్‌

కొవిడ్ సెకండ్ వేవ్ కలవరపరుస్తోంది. తొలిసారికంటే ఈ మారు ఇది తీవ్రంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్‌ పుంజుకుంటున్న వేగం చూస్తే నిజమేనని అనిపిస్తున్నది. ఈ మారు అత్యధికులు ఈ సెకండ్ వెవ్ గురించి భయపడటం లేదు. మంచిదే కానీ, కనీస రక్షణలు పాటించకపోవడమే కొంపముంచుతోంది. ఎక్కడ చూసినా ఎక్కువమంది మాస్క్ లేకుండానే కనపడుతున్నారు. కొందరు ఎటూ కాకుండా గడ్డం కిందుగా వేసుకుంటున్నారు. ఇక జన సమ్మర్ద ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనలవి కాదు. వైరస్‌ లేని రోజుల్లో ఉన్నంత స్వేచ్ఛగా ఉంటున్నారు. దుకాణాల ముందు ‘నో మాస్క్ నో ఎంట్రీ’ బోర్డులున్నా ఎవరూ పట్టించుకున్నది లేదు. కరోనాపై పోరాటానికి ధైర్యమే మందు అంటారు నిజమే కానీ, నిర్లక్ష్యం కూడదు కదా? ధైర్యానికి కూడా అర్థం ఉండాలి. మన నిర్లక్ష్యంతో అవతలివారిని ప్రమాదంలోకి నెట్టేయడం సరికాదు. మాస్క్ పెట్టుకోవడమే బరువైతే ఎలా? ప్రభుత్వాలు కూడా ఈమారు చాలా నిర్లక్ష్యంగా ప్రజలను వదిలేశాయి. ప్రకటనలూ హెచ్చరికలూ మానివేశాయి. మునిసిపల్ , పోలీస్ వాహనాల ద్వారా మాస్కులు, సామాజిక దూరాలకు సంబంధించిన హెచ్చరికలు చేయిస్తే వ్యాప్తినీ, వేగాన్నీ కాస్తంత నివారించవచ్చు. మాస్క్ లేని వారు కనపడితే వారినుంచి ఐదో, పదో వసూలు చేసి మాస్క్ ఇచ్చే ఏర్పాట్లు జరగాలి. జరిమానాలతో తప్ప జనం దారికి రారు. విచ్చలవిడిగా గుంపు గుంపులుగా తిరుగుతూ రోగవ్యాప్తికి కారణమవుతున్నవారిని నయానో భయానో నియంత్రించక తప్పదు. చదువుకున్న వారు కూడా కొవిడ్‌ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరికాదు. 

కనుమ ఎల్లారెడ్డి

Updated Date - 2021-03-28T08:15:03+05:30 IST