Abn logo
Apr 10 2020 @ 00:36AM

గాలి హోరు..వాన జోరు!

అకాల వర్షంతో జిల్లా అతలాకుతలం

తడిసి ముద్దయిన వరి ధాన్యం

ధ్వంసమైన అరటి తోటలు

నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు

అన్నదాతలకు అపార నష్టం

నూరేళ్ల జీవితంపై పిడుగు

గాలిలో కలిసిన ఏడు నిండు ప్రాణాలు


నెల్లూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓ వైపు కరోనా విపత్తు... మరోవైపు భానుడి భగభగలకు వణికిపోతున్న జిల్లా ప్రజానీకాన్ని అకాల వర్షం ముంచెత్తింది. దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు.. ఈదురుగాలుల హోరుతో ప్రజలు భయకంపితులయ్యారు. గురువారం మధ్యాహ్నం ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. అసలే ధరల్లేక అల్లాడుతున్న రైతులను ఉన్నట్టుండి ఊడిపడిన వరుణుడు నిలువునా నిండా ముంచేశాడు.


మిల్లుల్లో, కల్లాల్లో ఆరబోసిన వేలాది టన్నుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. అదేవిధంగా వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నీట మునిగింది. అరటి తోటలను ధ్వంసం చేసింది. పెనుగాలులకు చాలా చోట్ల వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 7 గంటల సేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. నెల్లూరు నగరంతోపాటు పట్టణాల్లో వీధులు నీట మునిగాయి. జిల్లా సగటు వర్షపాతం 30.7 మి.మీ.గా నమోదుకాగా బోగోలు, ఉదయగిరి, చేజర్ల మండలాల్లో అత్యధికంగా 70 మి.మీ.కుపైగా వర్షపాతం నమోదయ్యింది. కాగా ఈ పిడుగుల వాన ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

Advertisement
Advertisement
Advertisement