ఉపాధి దూరం...అప్పుల భారం

ABN , First Publish Date - 2020-03-27T11:12:06+05:30 IST

కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది రోజు కూలీలు...చిరు వ్యాపారులు...స్వయం ఉపాధిని ఎంచుకున్న వారిపై తీవ్ర ప్రభావం

ఉపాధి దూరం...అప్పుల భారం

పనులు లేక కార్మికులకు కష్టాలు

చిరు వ్యాపారుల పరిస్థితి  దయనీయం

కుటుంబ జీవనం కష్టం

వడ్డీ వ్యాపారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి

ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు


(విజయగనరం-ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది రోజు కూలీలు...చిరు వ్యాపారులు...స్వయం ఉపాధిని ఎంచుకున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరికి రోజు గడవడమే కష్టమవుతోంది. దీనికి తోడు వ్యాపారాలు... ఇతరత్రా అవసరాల కోసం డైలీ ఫైనాన్స్‌ వారితో పాటు ఇతరుల నుంచి చేసిన అప్పులు తీర్చడం కష్టమవుతోంది.  తోపుడు బండ్ల వ్యాపారులు, టీ దుకాణాల నిర్వాహకులు, ఫుట్‌పాత్‌పై నిత్యావసరాలు విక్రయించేవారు..ఇలా అందరిదీ ఇదే పరిస్థితి.


స్వయం ఉపాధి షాపులు సైతం మూతపడడంతో వారి కుటుంబ జీవనానికి పెద్ద అవరోధంగా మారింది. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 1.20 లక్షల మంది వరకూ అసంఘటిత కార్మికులు ఉన్నారు. వ్యవసాయ కూలీలు కూడా అధికం. ఖరీఫ్‌, రబీ సమయంలో వ్యవసాయ పనులతో పాటు ఖాళీ సమయాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తేనే వారి కుటుంబాలకు స్వాంతన లభిస్తుంది. కానీ గత 15 రోజులు కరోనా ఆంక్షలు నేపథ్యంలో వీరంతా ఉపాధికి దూరమయ్యారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా..మరికొద్దిరోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు పనులకు దూరమై కుటుంబాలతో ఎలా నెట్టుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


వడ్డీ వ్యాపారుల వేధింపులు

ఉపాధి లేక కార్మికులు, చిరు వ్యాపారులు విలవిల్లాడుతుంటే వడ్డీ వ్యాపారుల వేధింపులు అధికమవుతున్నాయి. ఇంటి అవసరాలతో పాటు చిరు వ్యాపారాలకు చాలామంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వీరి ఆవసరాలను ఆసరాగా చేసుకొని సూక్ష్మ రుణ సంస్థలు సైతం రుణాలిస్తుంటాయి. ప్రస్తుతం పనిలేదని తెలిసినా..వారు ఊరుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చెల్లింపులు చేయాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. అవకాశం ఉన్నవారు అప్పు చెల్లిస్తుంటే..మరి కొందరు ఏంచేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. అప్పు తీర్చే మార్గం తెలియక వీరంతా తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం స్పందించి అప్పుల వారి భారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

Updated Date - 2020-03-27T11:12:06+05:30 IST