Abn logo
Sep 15 2020 @ 00:59AM

జీవేశ్వరుల అభేదం

జీవుడెవరు? ఈశ్వరుడెవరు? జీవేశ్వరులు వేరని 

సామాన్యంగా అందరి భావన. కానీ, కాదు.


ఈశజీవయో ర్వేషధీ భిదా

సత్స్వభావతో వస్తు కేవలం


ఈశ్వరుడికి, జీవుడికి భేదం కేవలం ఉపాధుల దృష్ట్యా చూసినప్పుడే. కానీ, శుద్ధ చైతన్యం దృష్ట్యా చూసినప్పుడు అక్కడ నిజంగా ఉన్నది ఒక్కటే అయిన పరబ్రహ్మమేనని ఈ శ్లోకం అర్థం.


భగవాన్‌ రమణులు మానవాళికి అందించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన బోధ ‘ఉపదేశసారం’లోని 24వ శ్లోకమిది. సాధకులు తమ సాధనతో ఇదం భావనలన్నీ వదిలినా అహం భావన మాత్రం ఉంటుందని, ఆ అహం భావన కూడా వదిలి మనోనాశనం చేసుకోవాలంటే.. ఆ అహం భావన పుట్టే చోటును వెతికితే అది పడిపోతతుందని, అది పడిన చోట ‘నేను నేను’ అంటూ పరిపూర్ణ సత్‌ రూప ఆత్మ చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుందని, అట్టి ఆత్మయైున ‘నేను’ ఎప్పటికీ లయం కాని శాశ్వత సత్యమని రమణులు దీనికి ముందున్న శ్లోకాల ద్వారా తెలిపారు.


మరి ఎన్నో కథల్లో.. భగవంతుడు స్వయంగా వచ్చి భక్తుల ఎదుట ప్రత్యక్షమైనట్లు, భక్తులను కాపాడినట్లు చదువుతున్నాం. దాని ప్రకారం జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు కదా? పైగా జీవుడు చావుపుట్టుకలు గలవాడు. ఈశ్వరుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. జీవుడికి ముసలితనం, రోగాలు ఉన్నాయి. ఈశ్వరుడికి అలాంటివేవీ ఉండవు. జీవుడు కోరికలు కోరుకుంటాడు. భగవంతుడు వాటిని తీరుస్తాడు. ఇలా ఎన్నో తేడాలు కనిపిస్తాయి కదా!


మరి ఇద్దరూ ఒకటే ఎలా అవుతారు? అనే సందేహానికి మహర్షి ఈ శ్లోకం ద్వారా సమాధానమిచ్చారు. జీవునికి, ఈశ్వరుడికి భేదం అంతా ఉపాధులలోనే అంటున్నారు. యథార్థంగా జీవేశ్వరులు ఇద్దరూ ఒకే ఒక సద్‌రూప చిద్రూప ఆనంద రూప చైతన్యమే. పరమాత్మయే. పరమాత్మ ‘శరీర మనోబుద్ధులు’ అనే వేషం వేసుకుని వ్యష్టిగా ఉన్నప్పుడు జీవుడు అన్నారు. అదే పరమాత్మ అన్ని శరీర మనోబుద్ధులనే వేషం వేసుకుని సమిష్టిగా ఉన్నప్పుడు అంతటా ఉన్న ఈశ్వరునిగా చలామణీ అవుతున్నాడు.


కానీ, ఇరువురూ స్వభావరీత్యా ఒక్కరే. పరమాత్మే. చైతన్యమే. నిజంగా జీవుడి స్వభావం సత్‌-చిత్‌-ఆనందమే. ప్రతి వ్యక్తీ.. అందరూ పోయినా తాను మాత్రం పోకూడదనుకుంటాడు. ఇదే సత్‌ స్వభావం. అలాగే ప్రతివాడూ తనకు తెలిసన దానితో తృప్తి చెందడు. ఇంకా, ఇంకా తెలుసుకోవాలనుకుంటాడు. ఇదే చిత్‌ స్వభావం.  అలాగే.. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఇదే ఆనంద స్వభావం.నిజంగా మన స్వభావం ఆనంద స్వభావం గనక ఆనందం వస్తే హాయిగా ఉంటున్నాం. దుఃఖం వస్తే పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నాం. అదే మన స్వభావం దుఃఖమే అయితే.. ఎప్పుడూ దుఃఖంలో ఉండడానికి ప్రయత్నిస్తాం. దుఃఖం వస్తే హాయిగా ఉంటాం. కనుక సత్‌-చిత్‌-ఆనందమే జీవుడి స్వభావం. ఈశ్వరుడి స్వభావమూ అదే కదా!


మరి జీవేశ్వరులకు భేదమెక్కడ? అంటే.. స్వభావరీత్యా భేదం లేనే లేదు. భేదమంతా ఉపాధులకు చెందినదే. దేహంతో, మనసుతో తాదాత్మ్యం చెంది వాటికి పరిమితమైనప్పుడు ‘నేను’ జీవుడు. ఆ ఒక్క దేహానికి, మనసుకు చెందిన విషయాలే జీవుడికి తెలుసు. అదే ఈశ్వరుడైతే అన్ని దేహాలకు, మనస్సులకు చెందిన విషయాలు, ఆలోచనలు, అనుభవాలు అన్నీ తెలుస్తాయి. నేను వ్యష్టి. ఆయన సమిష్టి. ఇదే భేదం. 

- దేవిశెట్టి చలపతిరావు, [email protected]


Advertisement
Advertisement
Advertisement