నరసన్నపేట: హాలహాలేశ్వర స్వామి జాతరలో పోటెత్తిన జనం
నరసన్నపేట/జలుమూరు, జనవరి 17: నరసన్నపేట, జలుమూరు మండలాల్లో సోమవారం నిర్వహించిన జాతరలకు భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చి జాతరలో పాల్గొన్నారు. నరసన్నపేట మండలం అంపలాం హాల హాలేశ్వర స్వామి, కంబకాయి స్వయంభీమేశ్వర ఆలయాల్లో సోమవారం ముక్కనుమను పురస్కరించుకుని జాతరలు నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కంబకాయలో నాయు డు ఆర్కెస్ట్రాను నిర్వహించారు. అలాగే జలుమూరు మండలం రాణ గ్రామంలో ముఖలింగేశ్వరస్వామి జాతర వైభవంగా నిర్వహించారు. ముఖలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను నంది వాహనం పై వేంచేపుచేసి తిరువీధిగా షిర్డీ సాయిబాబా మందిరం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 33 ఏళ్లుగా తర్ర బప్పాయి నాయుడు వంశానికి చెందినవారు ఈ జాతర నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జాతరల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.