లాక్‌డౌన్‌ 100

ABN , First Publish Date - 2020-07-02T11:29:31+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ విధించి గురువారంతో వంద రోజులు పూర్తవుతోంది. ప్రారంభంలో జిల్లాలో కరోనా వైరస్‌

లాక్‌డౌన్‌ 100

అన్ని వర్గాలూ ఛిన్నాభిన్నం

కరోనాతో వలస కూలీలకు తీరని కష్టాలు

ఉపాధి లేక విలవిల

లాక్‌డౌన్‌ తర్వాత అమాంతం పెరిగిన కేసులు

291 మందికి పాజిటివ్‌.. ఇద్దరి మృతి

 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ విధించి గురువారంతో వంద రోజులు పూర్తవుతోంది. ప్రారంభంలో జిల్లాలో కరోనా వైరస్‌  ప్రభావం ఏమాత్రమూ చూపలేదు. పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో కేసులు లేని జిల్లాగా విజయనగరాన్ని చాలా రోజులు ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. దీంతో జిల్లా సేఫ్‌ అని అందరూ భావించారు. కానీ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వలసజీవులు స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


ఈ క్రమంలో జిల్లాకు మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, చత్తీస్‌ఘడ్‌, తదితర రాష్ట్రాలు, విదేశాల నుంచి వలస కూలీలు తరలివచ్చారు. శ్రామిక్‌రైళ్లలో కూడా చాలా మంది జిల్లాకు చేరుకున్నారు. వీరందరినీ అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి.. కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో మే నెల నుంచి జిల్లాలో ‘కరోనా’ కేసులు మొదలయ్యాయి. ప్రస్తుతం సామాజిక వ్యాప్తి కూడా ప్రారంభం కావడంతో అటు అధికారులు.. ఇటు ప్రజల్లో అలజడి రేగుతోంది. జిల్లాలో ఇప్పటివరకూ 291 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం మరో నలుగురికి వైరస్‌ ప్రబలినట్లు నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో జిల్లావాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వంద రోజుల్లో జిల్లాలో పరిస్థితులను గమనిస్తే కరోనా వైరస్‌ కారణంగా చాలా రంగాలు నష్టపోయాయి. 


 కార్మిక రంగానికి ఉపాధి దెబ్బ తగిలింది. పరిశ్రమలు మూతపడడంతో వారంతా వీధిన పడ్డారు. నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది. జిల్లా వ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడి 20వేల మంది కార్మికులు బతుకుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన జిల్లా కార్మికులంతా నేడు పని లేక విలవిల్లాడుతున్నారు. కరోనా కలవరంతో కుటుంబాల సమేతంగా జిల్లాకు తరలివచ్చారు. ప్రయాణంలోనూ అగచాట్లు పడ్డారు. రైళ్లు, బస్సులు లేక వందల కిలోమీటర్లు కాలి నడకన సాహసయాత్ర చేశారు. ఇంతా కష్టపడి స్వగ్రామాలకు వస్తే ఇక్కడ చేయడానికి పని ఉండడం లేదు. 


కరోనా పాజిటివ్‌ కేసుల విషయానికొస్తే ఈ ఏడాది మార్చి 22 నుంచి మే నెల 6వ తేదీ వరకు జిల్లాలో కరోనా కేసులు లేవు. తరువాత మెల్లగా ప్రారంభమై ఇప్పటి వరకు 291కి చేరుకున్నాయి. అంతే కాకుండా ఈ మహమ్మారి బారిన పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు వైద్య, పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగులకు గత నాలుగు నెలలుగా కరోనా కేసుల విధులతోనే కాలం గడిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్‌ సెంటర్లు, కొవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


వాణిజ్య రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. గత వంద రోజులుగా వ్యాపారాలు లేవు. కొద్ది వారాలుగా గాడిలో పడుతున్న సమయంలో కేసుల పెరుగుదలతో మళ్లీ కుదేలవుతున్నాయి. జిల్లాలో గత రెండు వారాలుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్కెట్‌పై మళ్లీ ప్రభావం చూపుతోంది. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీల్లో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నారు. విజయనగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేసుల పెరుగుదలతో షాపులు తెరవటం లేదు. ఇలా వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లా వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. నాలుగు నెలలుగా వస్త్ర వ్యాపారం కుదేలైంది. వెయ్యి కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయని వాణిజ్య రంగాలు వెల్లడిస్తున్నాయి.


నాయకులు, ఎమ్మెల్యే వంటి ప్రజా ప్రతినిధులపైనా కరోనా పంజా విసురుతోంది. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలోని ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి కంటే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్‌ భారీగా సోకింది. 490 మంది ఇతర దేశాల నుంచి రాగా ముగ్గురికి మాత్రమే కరోనా వైరస్‌ కనిపించింది. 


పెరిగిన కేసులతో మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా ఈ విషయమై కఠినంగా ఉంటున్నారు. మాస్క్‌లు ధరించకుంటే ఫైన్‌ వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధరించేందుకు వీలుగా ప్రభుత్వం ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేసింది. అయితే పూర్తిస్థాయిలో అందలేదు. 


కరోనా వైరస్‌ కారణంగా మత్స్యకారులు తీవ్ర ఆవస్థలు పడుతున్నారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌లోని వీరావల్‌కు వలస వెళ్లారు. వీరు తిరిగి వస్తున్న సమయానికి కరోనా మహమ్మారి వచ్చి పడింది. దీంతో 480మంది మత్స్యకారులు అక్కడే చిక్కుకున్నారు. వీరిని ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో తీసుకు వచ్చి క్వారంటైన్‌ చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఒక మత్స్యకారుడు మృత్యువాత పట్టాడు. మిగతా వారి జీవనాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేసింది. 


విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం పడింది. ఏకంగా పరీక్షలనే నిర్వహించలేని పరిస్థితి తీసుకు వచ్చింది. ఇపుడు విద్యా సంవత్సరాన్ని సకాలంలో ప్రారంభించేందుకు వీలు లేకుండా చేసింది. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేయాలని నిర్ణయించింది. అన్ని తరగతులదీ ఇదే పరిస్థితి. 


కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి పేదలు తినేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఉచిత రేషన్‌ ప్రకటించింది. మనిషికి ఐదు కిలోల బియ్యం. కార్డుకు కిలో కంది పప్పు ఉచితంగా ప్రకటించింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నాలుగు నెలలుగా నెలకు రెండు పర్యాయాలు ఉచిత రేషన్‌ను అందించాయి. తాజాగా కేంద్రం నవంబరు వరకు ఉచిత రేషన్‌ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల నుంచి ఉచితంగా సరకులు అందించాలని నిర్ణయించింది. ఇది కొంత ఊరట కలిగించే అంశం. 

Updated Date - 2020-07-02T11:29:31+05:30 IST