రక్షణ లేని రారాజు

ABN , First Publish Date - 2022-04-26T06:13:19+05:30 IST

నల్లమల పులిరాజు ఆవాసం. పెద్ద పులుల స్థావరంగా నల్లమలకు దేశంలోనే గుర్తింపు ఉంది.

రక్షణ లేని రారాజు

 నల్లమలలో తరచూ రైలు ప్రమాదాల్లో మృతి చెందుతున్న పెద్దపులులు 

వన్యప్రాణుల సంరక్షణలో  అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం  

రైల్వే ట్రాక్‌ వెంట ఫెన్సింగ్‌ ఏర్పాటు ఎప్పుడు?  


రుద్రవరం, ఏప్రిల్‌ 25: నల్లమల పులిరాజు ఆవాసం. పెద్ద పులుల స్థావరంగా నల్లమలకు దేశంలోనే గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు రారాజుకు తన కోటలోనే రక్షణ లేకుండాపోయింది. అభయారణ్యం పెద్దపులులకు, చిరుతలకు మృత్యుశిలగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవిలోని రైల్వే ట్రాక్‌ వన్యప్రాణులకు శాపంగా మారింది. రైళ్లు ఢీకొని పెద్దపులులు, చిరుత పులులు పదే పదే మృత్యువాత పడుతున్నాయి. రోడ్డు మార్గంలో కూడా వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి. 


 వన్యప్రాణుల సంరక్షణలో నిర్లక్ష్యం 


నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నల్లమలలో రైలు, రోడ్డు ప్రమాదాల్లో పెద్దపులులు,  చిరుత పులులు మృతి చెందడానికి  అధికారుల నిర్లక్ష్యమే కారణం అనే విమర్శలు ఉన్నాయి. 4 నెలల కాలంలో ఒక పెద్దపులి, రెండు చిరుత పులులు అటు రైళ్లు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందాయి. అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. 


నల్లమలలో రైళ్లు ఢీకొని.. 


నల్లమలలో తరచూ రైలు ప్రమాదాలు జరిగి చిరుత పులులు, పెద్ద పులులు మరణిస్తున్నాయి. తాజాగా 2022 మార్చి 30వ తేదీన గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజిలోని ముస్తాఫా రోడ్డులో మరో చిరుత పులి మృతి చెందింది. నల్లమలలో  రైళ్లు ఢీకొని 2022 ఫిబ్రవరి 26వ తేదీన ఆడ చిరుత పులి, 27న వాహనం ఢీకొని ఏడాదిన్నర వయసు ఉన్న మగ చిరుత పులి మృతి చెందాయి. 2021 నవంబరు 12న ఆడ పెద్దపులి రైలు ఢీకొని మృతి చెందింది. 2018లో చెలిమ సమీపంలో రైలు ఢీకొని పెద్దపులి మృతి చెందింది. అదే సంవత్సరం రైలు ఢీకొని మరో చిరుత పులి మృతి చెందింది.


నివేదికలకే పరిమితమైన  రైల్వే ట్రాక్‌ ఫెన్సింగ్‌


నల్లమలలోని రైల్వే ట్రాక్‌  ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు నివేదికలకే  పరిమితమయ్యాయి. దీని వల్ల తరచూ పెద్దపులులు, చిరుత పులులు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులు వేగంగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.  


రోడ్డు బర్గర్లు ఏం చేస్తున్నట్లు.. 


రుద్రవరం ఫారెస్టు సబ్‌ డివిజన్‌లోని చెలిమ రేంజిలో నంద్యాల-ఒంగోలు రహదారిలో ఫారెస్టు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులో సుమారు 10 మంది పని చేస్తున్నారు. వీరు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు సేకరించాల్సి ఉంది. అలాగే వన్యప్రాణులు ప్రమాదాలకు గురి కాకుండా వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచనలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవేవీ జరగడం లేదు. వన్య ప్రాణుల ప్రమాదాలకు ఇదీ కారణమనే విమర్శలు ఉన్నాయి. 


నివేదిక పంపించాం

 

నల్లమలలో పెద్దపులులు, చిరుత పులులు రైల్వే ప్రమాదంలో  మృతి చెందుతున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ ప్రదీప్‌కుమార్‌కు నివేదిక పంపించాం.  రైల్వేశాఖకు, ఆర్‌అండ్‌బీ శాఖకు నేషనల్‌ టైగర్‌ బెంగళూరు అథారిటీకి కూడా పంపించాం. వన్యప్రాణులు మృత్యువాత పడకుండా చర్యలు తీసుకుంటాం. 


- చీఫ్‌ కన్జర్వేటర్‌ రామకృష్ణ

Updated Date - 2022-04-26T06:13:19+05:30 IST