కొన్నది కొంతే!

ABN , First Publish Date - 2022-06-23T04:29:10+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసింది.

కొన్నది కొంతే!

  • ఈసారి సేకరించిన ధాన్యం 20,936 టన్నులే
  • ప్రతీ సంవత్సరం తగ్గుతున్న ధాన్యం లక్ష్యం
  • ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్న రైతులు
  • వరి కొనుగోళ్ల లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  • ధాన్యం అమ్మిన డబ్బులు సకాలంలో అందకపోవటమే కారణం


జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ధాన్యం సేకరణ లక్ష్యంలో నిర్లక్ష్యం అలుముకుంది. ఏటేటా ధాన్యం సేకరణ అనుకున్న మేరకు సేకరించలేకపోతున్నారు. లక్ష్యం కొండంత... సేకరణ గోరంత అన్న చందంగా మారింది. 


రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 22 : గతేడాది యాసంగిలో 2.20లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకోగా.. 74వేల టన్నులు మాత్రమే సేకరించారు. ఈసారి 1.18లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. కానీ.. 45వేల టన్నులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 42కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ.. 40 కేంద్రాలను తెరిచారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 20,936.400 టన్నులు సేకరించారు. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా సేకరించలేకపోయారు. ఇందుకుకారణం.. తూకంలో మోసం.. తాలు పేరిట దోపిడీ... టార్పాలిన్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచకపోవడం... అలాగే సకాలంలో డబ్బులు అందక పోవడం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకురావడానికి అనాసక్తి చూపించారని తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతుధర కంటే.. ప్రైవేట్‌ వ్యాపారులు ఎక్కువగా చెల్లించడం... కల్లాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని సేకరిచడంతో రైతన్నలు ఈసారి ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకున్నారు. దీంతో చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు వెలవెలబోయాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరుచున్నాయి. త్వరగా మూసి వేశారు. 


ధాన్యం డబ్బులు రాక ఇక్కట్లు

వరి కొనుగోలు కేంద్రాలను మూసివేసి ఐదు రోజులవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై 20రోజులు గడుస్తున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వేసవి దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు కావాల్సిన పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని విక్రయించి నెల రోజులు అవుతున్నా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. జిల్లాలో 4,895 రైతుల నుంచి రూ. 41 కోట్ల విలువ చేసే 20,936.400టన్నుల ధాన్యం సేకరించారు. ఇప్పటివరకు 9.19 కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 32 కోట్ల వరకు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రైతులు అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 


ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రైవేట్‌ వాళ్ళకు అమ్ముకున్నాను. ఈసారి ఎకరా 20 గుంటల్లో వరి సాగు చేశాను. 35 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే ప్రతి సంచికి 5కిలోల ధాన్యం తరుగు తీస్తూ దోపిడీ చేస్తున్నారు. ప్రతి సంచికి రూ.30, హామాలీ కూలి రూ.40 వసూలు చేస్తున్నారు. ధాన్యం అమ్మినా డబ్బులు రావడానికి  కనీసం రెండు నెలలు పడుతుంది. ప్రైవేట్‌ వ్యాపారులు పొలం వద్దకు వచ్చి ధాన్యం తీసుకుపోతున్నారు. డబ్బులు కూడా త్వరగా ఇస్తున్నారు. 

- కె. రమేష్‌ రైతు, చెన్నారెడ్డిగూడ గ్రామం


ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మడమే బెటర్‌

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మేకంటే ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మడమే బెస్ట్‌. డబ్బులు కూడా త్వరగా ఇస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేటకు చెందిన ఓ వ్యక్తికి ధాన్యం అమ్మాను. క్వింటాకు రెండు వేలు చెల్లించారు. మంచి లాభం వచ్చింది. 4 ఎకరాలల్లో వరి వేస్తే 200 సంచులు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్తే సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద ఉండాల్సి వస్తుంది. అందుకే ప్రైవేట్‌ వ్యాపారికి ధాన్యం అమ్ముకున్నాను. 

- సురేష్‌ రైతు, ముష్ఠిపల్లి గ్రామం


కొనుగోలు చేసిన బ్యాగ్‌ల సంఖ్య

గ్రేడ్‌-1ఏ :  51,2461

సాధారణ రకం : 10,949

----------------------

ఐపీఎంఎస్‌ ప్రకారం

ఓపీఎంఎస్‌ ఎంట్రీలు (టన్నులు) : 17103.440

రైతులకు చెల్లింపులు : 9.19 కోట్లు

-----------------------------

కొనుగోలు కేంద్రాల ప్రారంభ తేది : 24-04-2022

కేంద్రాల మూసివేత : 15-06-2022

-------------------------------------

ప్రతిపాదిత కేంద్రాల సంఖ్య : 42

తెరిచిన కేంద్రాలు : 40

మూసి వేసిన కేంద్రాలు : 39

--------------------------------------------

మద్దతు ధర ఇలా (క్వింటాకు)

రకం 2020-21 2021-22

గ్రేడ్‌-ఏ రకం 1,888 రూ. 1,960

సాధారణ రకం 1,868 రూ. 1,940

యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో)

సంవత్సరం సాధారణ సాగు సాగైంది

2020-21 46,555 35,550

2021-22 41,016 47,232

--------------------------------------------

గతేడాది, ఈసారి యాసంగి సీజన్లలో 

అంచానా, సేకరించినధాన్యం వివరాలు (టన్నుల్లో)

సీజన్‌ సంవత్సరం ధాన్యం అంచనా సేకరించింది

రబీ 2020-21 2,20,831 74,278.240

రబీ 2021-22 1,18,078 20,936.400

Updated Date - 2022-06-23T04:29:10+05:30 IST