అడవిలో వన్యప్రాణుల చావు కేకలు

ABN , First Publish Date - 2022-05-23T06:26:48+05:30 IST

అడవిలో వన్య ప్రాణులు చావు కేకలతో అలమటిస్తున్నాయి. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో అటవీ ప్రాంతంలో బుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.

అడవిలో వన్యప్రాణుల చావు కేకలు
అటవీ ప్రాంతంలో నీరు లేక వృథాగా ఉన్న సాసర్‌పిట్‌

- అడవులు దాటి.. జనాల్లోకి జంతువులు

- నీరు లేక మృత్యువాత పడుతున్న మూగజీవాలు

- ఆరణ్యంలో నీటి కోసం అలమటి స్తున్న అటవీ జంతువులు

- వన్య ప్రాణులకు నీటి సౌకర్యం కల్పించడంలో విఫలం

- అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఖాళీగా దర్శనమిస్తున్న సాసర్‌పిట్లు

- నీటి కోసం గ్రామాల్లోకి వస్తూ మృత్యువాత పడుతున్న అటవీ జంతువులు

- నీటి సౌకర్యం కల్పించాలంటున్న జంతు ప్రేమికులు


కామారెడ్డి, మే 22(ఆంధ్రజ్యోతి): అడవిలో వన్య ప్రాణులు చావు కేకలతో అలమటిస్తున్నాయి. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో అటవీ ప్రాంతంలో బుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. తాగునీటి సమస్య జనాలకే కాకుండా మూగజీవాలకు సైతం తప్పడం లేదు. అడవి ప్రాంతంలో ఉండే చెరువులు, కుంటలు అడుగంటిపోవడంతో వన్య ప్రాణులకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. కామారెడ్డి జిల్లాలో 1,92,349 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వీటికి వేసవిలో దప్పిక తీర్చేందుకు సంబంధిత అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వన్యప్రాణులకు గుక్కెడు నీళ్లు కోసం జనావాసాల్లోకి వస్తుండగా మరికొన్ని నీళ్లు దొరకక అడవిలోనే మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణులు నీటి కోసం అడవిని దాటి జనావాసాల్లోకి రావడంతో వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి  చెందుతున్నాయి. ఇటీవల రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌ వద్ద ఎలుగుబంటి నీటికోసం వచ్చి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. శుక్రవారం మాచారెడ్డి మండలంలో నీటికోసం వచ్చిన జింకపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. కుక్కలు దాడి చేయడంతో స్థానికులు గమనించి జింకకు ప్రాథమిక చికిత్సను అందించారు. గతంలో కామారెడ్డి మండలం, నస్రుల్లాబాద్‌, మద్నూర్‌, లింగంపేట్‌ మండలాల్లో జింకలు, దుప్పిళ్లు నీటి కోసం గ్రామాలకు వచ్చి వేటగాళ్ల చిక్కులో పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా వేసవిని దృష్టిలో పెట్టుకోని సంబంధితశాఖ అధికారులు వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు నీటి సౌకర్యం కల్పించాలంటూ జంతు ప్రేమికులు కోరుతున్నారు. 

అటవీ ప్రాంతంలో ఎండిపోతున్న చెరువులు, కుంటలు

కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, గాంధారి, సదాశివనగర్‌, మాచారెడ్డి, పిట్లం, జుక్కల్‌, తాడ్వాయి, లింగంపేట్‌, మద్నూర్‌ మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగానే ఉంటాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 1,92,349 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అడవులలో జింకలు, నెమళ్లు, కొండ గొర్రెలు, దుప్పిలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, కోతులు, కుందెళ్లతో పాటు క్రురమృగాలైన చిరుత పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేసవిలో రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు సైతం ఎండకు అడుగంటిపోతున్నాయి. అడవిలోని పచ్చదనం మొక్క ఎండిపోయింది. దీంతో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు నిండా నీడ కాదు కదా దప్పిక తీర్చుకోవడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులకు తాగునీటి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం కల్పించడంలో విఫలం

ఎండ వేడిమికి జనాలే అలమటించిపోతున్నారు. ఇక అటవీ ప్రాంతంలోని మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అభయారణ్యంలో ఉండే వన్యప్రాణులు నీటి కోసం తహతహలాడుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నందున వన్యప్రాణుల కోసం ఆటవీ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అటవీ ప్రాంతంలో వేసవి కాలంలో వన్యప్రాణులకు తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ఆధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ అవి ఎక్కడా కనిపించడం లేదు. వేసవి వచ్చిందంటే అటవీ ప్రాంతంలో సాసర్‌పిట్లను ఏర్పాటు చేసి వాటర్‌ ట్యాంకుల ద్వారానే వారానికి రెండు సార్లు నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ నీటితో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు వాటి దాహార్తిని తీర్చుకునేందుకు వీలుంటుంది. మూగ జీవాలకు దప్పికను తీర్చేందుకు అటవీ ప్రాంతంలో సాసర్‌పిట్లను ఏర్పాటు చేసినప్పటికీ నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, మాచారెడ్డి, గాంధారి, కామారెడ్డి, పిట్లం, జుక్కల్‌ అటవీశాఖ రెంజ్‌ పరిధిలు ఉన్నాయి. అయితే ఈ రెంజ్‌ పరిధిలోని కొంత మంది అధికారులు తమ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్‌పిట్లలో నీటిని నిల్వ ఉంచడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు అరోపణలు వస్తున్నాయి. సిబ్బంది సాసర్‌పిట్లులో నీటిని వారంలో రెండు సార్లు నింపాల్సి ఉండగా కొంత మంది ట్యాంకర్ల ద్వారా కేవలం ఒకసారి మాత్రమే నింపి చేతులు దులుపుకుంటున్నారని అరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి అటవీ ప్రాంతాల్లో తినడానికి, తాగడానికి ఇబ్బందులు ఉండేవికావు. ఇటీవల కాలంలో మండుతున్న ఎండలకు పూర్తిగా కుంటలు, చెరువులు ఎండిపోవడంతో నీటి కోసం వన్యప్రాణులు అలమటిస్తున్నాయి. 

నీటి కోసం జనావాసంలోకి వన్యప్రాణులు

జిల్లాలోని అటవీ ప్రాంతంలో చెరువులు, కుంటలలో నీరు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం జనావాసంలోకి వస్తున్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతంలోని జింకలు, నెమళ్లు, కోతులు, కొండ గొర్రెలు, కుందేళ్లు చుట్టు పక్కలోని గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి దప్పికను తీర్చుకుంటున్నాయి. దీనిని అదునుగా భావిస్తున్న వేటగాళ్లు వీటిని వేటాడి చంపుతున్నారు. మరికొన్ని వన్యప్రాణులు చుట్టుపక్కలోని పంట పొలాల్లోకి నీరు తాగడానికి వస్తున్నాయి. సంబందిత రైతులు పంట పొలాల్లో పంట రక్షణ కోసం పురుగుల మందు చల్లుతుండడంతో అక్కడ నీటిని తాగి వన్యప్రాణులు మృతి చెందిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఇలా అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు నీటి కోసం జనావాసంలోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌ వద్ద ఎలుగుబంటి నీటి కోసం వచ్చి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. శుక్రవారం మాచారెడ్డి మండలంలో నీటి కోసం వచ్చిన జింకపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. కుక్కలు దాడి చేయడంతో స్థానికులు గమనించి జింకకు ప్రాథమిక చికిత్సను అందించారు.

పట్టింపులేని సంబంధిత శాఖ 

జిల్లాలోని అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం వన్యప్రాణులు చావు కేకలు పెడుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టింపులేక ఉంటున్నారు. అటవీ జంతువులు దాహార్తిని తీర్చేందుకు కొంతమంది సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అరోపణలు వస్తున్నాయి. అడవుల్లో నీరు లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు సాసర్‌పిట్లలో వాటర్‌ట్యాంకుల ద్వారా మూడు లేదా నాలుగు సార్లు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. ఒకవేళ నిధులను కేటాయించకపోయిన సంబంధిత శాఖ వారు వేరే నిధులు వేసులుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అడవుల్లో నీరు దొరకక వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నట్లు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధితశాఖ ఉన్నతాధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జంతువు ప్రేమికులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-23T06:26:48+05:30 IST